
వలపర్ల తిరునాళ్లలో ఆధిపత్య పోరు
మార్టూరు : మండలంలోని వలపర్ల గ్రామంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన తిరునాళ్లలో అధికార పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ స్థానికంగా కలకలం రేపింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య జరిగిన ఘర్షణలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. వలపర్ల గ్రామ పొలిమేరలోని కోతి ఆంజనేయస్వామి ఆలయ తిరునాళ్ల శుక్రవారం రాత్రి నిర్వహించారు. స్థానిక రెండు సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరు టీడీపీ నాయకుల మధ్య కొన్ని నెలల నుంచి ఆధిపత్య పోరు నడుస్తోంది. తిరునాళ్లకు రెండు ప్రభల ఏర్పాట్ల కోసం చురుగ్గా ప్రయత్నాలు జరిగాయి కూడా. విషయం తెలిసిన ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయం ఇద్దరు నాయకులను హెచ్చరించింది. ఒకే ప్రభను ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించింది. చివరకు ఒక ప్రభనే ఏర్పాటు చేసినా లోపల ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. తిరునాళ్ల సందర్భంగా శుక్రవారం రాత్రి ప్రభ స్టేజీపై డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. వలపర్ల శివారు గ్రామమైన ద్వారకపాడుకు చెందిన ఓ పది మంది యువకులు స్టేజీ సమీపంలో ఉండగా, మరో వర్గానికి చెందిన యువకులతో వివాదం ప్రారంభమైంది. మొదటి నుంచి అధిపత్య పోరు సమాచారం తెలిసిన సీఐ మద్దినేని శేషగిరిరావు ముందుగానే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల మధ్య ప్రారంభమైన వివాదాన్ని మొదట్లోనే పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించారు. తిరిగి 12:30 గంటల ప్రాంతంలో స్టేజీ వెనుక రెండు గ్రూపులు ఘర్షణకు తలపడ్డాయి. విషయం తెలిసిన సీఐ శేషగిరిరావు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఓ వర్గానికి చెందిన యువకులు పోలీసులను సైతం పక్కకు నెట్టివేసే ప్రయత్నం చేశారు. సీఐ ఆదేశాలతో పోలీసులు ఇరు వర్గాలపై లాఠీచార్జి చేశారు. చివరకు ఒంటిగంట ప్రాంతంలో పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకురావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలుగు తమ్ముళ్ల బాహాబాహి
పోలీసుల లాఠీచార్జి
Comments
Please login to add a commentAdd a comment