బెట్టింగ్‌లకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం
● ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై ప్రత్యేక నిఘా ● ఎస్పీ తుషార్ డూడీ
బాపట్లటౌన్: బెట్టింగ్‌లకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆన్‌లైన్‌లో రోజుకొక రకమైన బెట్టింగ్ యాప్‌లు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. వివిధ ఆఫర్స్‌తో బెట్టింగ్ ఫ్రీ అంటూ యువతను ఆకర్షించి వారి జీవితాన్ని నాశనం చేస్తున్నాయన్నారు. ఒకసారి ఆడి చూద్దాం అని సరదాగా మొదలుపెట్టి వీటి బారిన పడిన యువకులు బయటికి రావడమనేది కష్టతరమైన విషయమన్నారు. ఈ బెట్టింగ్స్‌కి అలవాటు పడ్డ వాళ్లు అప్పుల పాలు కావడమే కాకుండా.. చేసిన అప్పులు తీర్చలేక చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆన్‌లైన్ బెట్టింగ్‌పై నిఘా ఉంచామన్నారు. బెట్టింగ్ ముఠాలు రేపల్లె, చీరాల, అద్దంకి వంటి మరికొన్ని ప్రదేశాల్లో వారి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. దానికి అనుగుణంగా గతంలో బెట్టింగ్‌లు నిర్వహిస్తూ వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన 39 మంది కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. చీరాల–1 టౌన్‌లో రెండు కేసుల్లో 11 మంది, రేపల్లె టౌన్‌లో ముగ్గురు, వేమూరు పోలీస్‌స్టేషన్‌లో ఆరుగురు, కొల్లూరులో ఒకరు, చీరాల టూ టౌన్‌లో ఒకరు, వేటపాలెంలో 9 మంది, అద్దంకిలో 8 మందిని గతంలో అరెస్ట్ చేశామన్నారు. కొత్తగా ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడే అవకాశం ఉన్నా వారిపై నిఘా ఉంచామన్నారు. బెట్టింగ్ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను సిద్ధం చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment