
బెట్టింగ్‌లకు పాల్పడితే జీవితం అంధకారమే !
బాపట్ల టౌన్: బెట్టింగ్‌లకు పాల్పడితే జీవితం అంధకారంగా మారుతుందని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లను అదునుగా చేసుకొని కొందరు స్వార్థపరులు, చెడు నడత కలిగిన వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్‌లకు తెరలేపే అవకాశం ఉందని హెచ్చరించారు. బెట్టింగ్‌లకు బలి అవుతున్నవారిలో ఎక్కువ శాతం యువతే ఉంటున్నారని, సులభంగా నగదును అర్జించవచ్చునని ఆశ చూపుతూ ఊబిలో దించుతారని తెలిపారు. ఒక్కసారి అలవాటు పడితే వాటి నుంచి బయటకు రావడం కష్టం అవుతుందని సూచించారు. ఒకసారి ఆదాయం వచ్చినా పలుమార్లు నష్టపోతారని, వాటిని భర్తీ చేసుకోవడానికి, చేసిన అప్పులను తీర్చడానికి యువత దొంగతనాలకు, ఇతర నేరాలకు పాల్పడుతూ తమ భవిష్యత్తుని అంధకారం చేసుకుంటున్నారని వివరించారు. బెట్టింగ్ అనేది పెనుభూతం లాంటిదని, ఆశ చూపి అంధకారంలోకి నెట్టేస్తుందని హెచ్చరించారు. యువత దానికి బలి కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్రికెట్ మ్యాచ్‌లను వినోదం కోసం మాత్రమే చూడాలని, బెట్టింగులు వైపు మొగ్గు చూపకూడదని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను గమనిస్తూ ఉండాలని, బెట్టింగులకు పాల్పడుతుంటే వారికి నచ్చచెప్పి ఆ ఊబిలో నుంచి బయటకు తీసుకురావాలని చెప్పారు. గతంలో బెట్టింగ్‌లకు పాల్పడిన వారిపై, అనుమానితులపై నిఘా ఉంచామని పేర్కొన్నారు. జిల్లాలో బెట్టింగులను నిర్వహించినా, అమాయకులను, యువతను ఊబిలోకి లాగాలని ప్రయత్నించినా ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. నిర్వాహుకులను గుర్తించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తెలిస్తే డయల్ 112/100కు సమాచారం అందించాలని, ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ
పెను భూతానికి బలి కావద్దు
బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు
Comments
Please login to add a commentAdd a comment