
పంట కాలువలోకి జారిపోయిన టిప్పర్
కారంచేడు: కారంచేడు – ఆదిపూడి రోడ్డులోకి రివర్స్ చేసుకోవడానికి తిరిగిన టిప్పర్ లారీ అదుపుతప్పి పంట కాలువలోకి జారిపోయింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోయినప్పటికీ విద్యుత్ స్తంభాలు, వైర్లకు నష్టం కలిగినట్లు విద్యుత్‌శాఖ సిబ్బంది తెలిపారు. వాడరేవు – పిడుగురాళ్ల ప్రధాన రహదారి (167ఏ బైపాస్ రోడ్డు) పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగించే టిప్పర్ లారీని డ్రైవరు ఈ రోడ్డులోకి తిప్పాడు. అదుపుతప్పడంతో అది రైతులు ఏర్పాటు చేసుకున్న పంపింగ్ స్కీమ్ వద్ద పంట కాలువలోకి జారిపోయింది. ఇదే సమయంలో అక్కడ ఉన్న 11కేవీ విద్యుత్ లైన్‌తో పాటు, విద్యుత్ స్తంభం కూడా విరిగిపోయింది. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాల్య వివాహం నిలిపివేత
నాదెండ్ల: బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకుని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చిన సంఘటన ఓ గ్రామంలో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు... మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఈ ఏడాది ఇంటర్ రెండో సంవత్సరం పూర్తి చేసింది. చిలకలూరిపేట మండలం చినరాజాపేట గ్రామానికి చెందిన 22 ఏళ్ల నరేంద్రతో ఈ నెల 13న బాలిక వివాహాన్ని పెద్దలు నిర్ణయించారు. బాలిక తండ్రి చనిపోగా, తల్లి కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తోంది. బాలిక వివాహ సమాచారం తెలుసుకున్న ఎంపీడీవో స్వరూపారాణి, డీసీటీవో ప్రశాంత్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పద్మ, సచివాలయ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.