పోలీస్‌ శాఖ ని‘శ్రేష్ట’ం | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ శాఖ ని‘శ్రేష్ట’ం

Published Wed, Apr 16 2025 11:02 AM | Last Updated on Wed, Apr 16 2025 11:02 AM

పోలీస్‌ శాఖ ని‘శ్రేష్ట’ం

పోలీస్‌ శాఖ ని‘శ్రేష్ట’ం

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన పోలీస్‌ అధికారులకు ఒక న్యాయం..బలహీన వర్గ అధికారులకు మరో న్యాయం అన్న చందాన రేంజ్‌ అధికారి సర్వశ్రేష్ట త్రిపాఠి వ్యవహార శైలి ఉంది. దీనిపై జిల్లా పోలీసు శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇటీవల మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అరెస్టు చేసిన సమయంలో వేటు పడిన ఇద్దరు ఎస్‌ఐలూ బలహీనవర్గాలకు చెందినవారే. ఆ సమయంలో అక్కడే ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ సామాజికవర్గ పోలీసు అధికారులు అక్కడే ఉన్నా.. వారిపై కనీస చర్యల్లేకపోవడంపై పోలీసుశాఖలో నిరసన వ్యక్తమవుతోంది.

ఆద్యంతం టీడీపీ సామాజికవర్గ అధికారుల కనుసన్నల్లోనే..

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను, ఆయన అనుచరులను మంగళగిరిలో అరెస్టు చేసి ముందుగా నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌ నుంచి నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో టీడీపీ సామాజిక వర్గానికి చెందిన ఎస్‌హెచ్‌ఓ వంశీధర్‌ వద్దకు తరలించారు. కోర్టులో హాజరు పరిచే ముందు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ ఆళ్ల హరిశ్రీనివాస్‌, కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి ఆధ్వర్యంలో తీసుకెళ్లారు. ఆ తర్వాత కోర్టులో హాజరు పరిచే సమయంలో మాధవ్‌ తన అనుచరుల వద్ద ఫోన్‌ తీసుకుని తన లాయర్‌తో మాట్లాడుతుండగా సీఐ వీరాస్వామి దానిని లాక్కున్నారు. ఈ సమయంలో సీఐ వీరయ్యచౌదరి, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ ఆళ్ల హరి శ్రీనివాస్‌ కూడా అక్కడే ఉన్నారు. వారు మాధవ్‌ ఫోన్‌లో మాట్లాడుతున్నా పట్టించుకోలేదు. సీఐ వీరాస్వామి ఫోన్‌ లాక్కున్నారు. అయితే మాధవ్‌ ఫోన్‌ మాట్లాడుతతున్నా.. నిర్లక్ష్యంగా ఉన్నారన్న సాకుతో సీఐ వీరాస్వామితోపాటు పట్టాభిపురం ఎస్‌ఐ రాంబా బు, నగరంపాలెం ఎస్‌ఐ రామాంజనేయులుతోపాటు 12 మందిని రేంజ్‌ ఐజీ సస్పెండ్‌ చేశారు. వాస్తవానికి అరెస్టు సమయంలో నిందితుడు బంధుమిత్రులు, లాయర్‌తో ఫోన్‌ మాట్లాడే హక్కుంది. అతని వద్ద ఫోన్‌ లాక్కునే అధికారం పోలీసులకు లేదని సీనియర్‌ రిటైర్డ్‌ పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మాధవ్‌ ఫోన్‌ మాట్లాడుతున్నా.. చోద్యం చూసిన వారిని వదిలేసి ఫోన్‌ లాక్కున్న సీఐ వీరాస్వామిపై వేటు పడడం విస్తుగొలుపుతోంది. ఒక వేళ మాజీ ఎంపీ వ్యవహారంలో తప్పు జరిగినట్టు పోలీస్‌ బాస్‌ భావిస్తే మంగళగిరి నుంచి నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ వరకు ఎంత మంది పోలీసు అధికారులు ఉన్నారో అంత మందినీ సస్పెండ్‌ చేయాలి కానీ ఎస్సీ, బీసీలనే టార్గెట్‌గా చేసి సస్పెండ్‌ చేయడమేమిటని సిబ్బంది ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

ఉద్యోగోన్నతి జాబితాలో ఉన్నా వేటు

నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ రామాంజనేయులు ఉద్యోగోన్నతి జాబితాలో ఉన్నారు. కొద్దిరోజుల్లో సీఐ కానున్నారు. దీంతో ఆయన కూడా తన తప్పు లేకుండా సస్పెండ్‌ వేటు వేశారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది.

బలహీనవర్గాలపై వివక్ష? ఆరునెలల్లో రెండు సార్లు సస్పెండైన ఎస్‌ఐ సీఐ ఉద్యోగోన్నతి జాబితాలో ఉన్న ఎస్‌ఐపైనా వేటు అధికారపార్టీ సామాజికవర్గానికి రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి వంత జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారిన పోలీస్‌బాస్‌ తీరు

ఆరునెలల్లో రెండోసారి సస్పెన్షన్‌

పట్టాభిపురం ఎస్‌ఐ రాంబాబు ఆరునెలల్లో రెండో సారి సస్పెండ్‌ అయ్యారు. దీంతో ఆయన తన తప్పు లేకున్నా వేటు వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. దీని వల్ల తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారతాయని బాధ పడుతున్నట్టు తెలుస్తోంది.

వీరిపై చర్యలేవీ..

మాజీ ఎంపీ మాధవ్‌ సెల్‌ఫోన్‌ మాట్లాడిన వ్యవహారంలో 12 మందిని సస్పెండ్‌ చేసిన పోలీసుశాఖ ఇందులో భాగస్తులైన టీడీపీ సామాజికవర్గానికి చెందిన మంగళగిరి ఎస్‌ఐ వెంకట్‌, కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి, నల్లపాడు సీఐ వంశీధర్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ ఆళ్ల హరి శ్రీనివాస్‌లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని వెస్ట్‌ డీఎస్పీ ముందు సస్పెండ్‌ అయిన ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. బందోబస్తుకు వెళ్లి దూరంగా ఉన్న తమపై వేటు వేయడం ఏమిటని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో సస్పెండ్‌ అయి ఏఆర్‌ నుంచి సివిల్‌కు కనవర్షన్‌ అయిన బలహీనవర్గాల వారిని ఆరునెలలైనా ఇంతవరకు విధుల్లోకి తీసుకోలేదు. కానీ వీఆర్‌లోకి వెళ్లిన టీడీపీ సామాజిక వర్గానికి చెందిన సీఐకి మాత్రం తుళ్లూరు ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు అప్పగించారు. ఈ వివక్ష ఎందుకో అధికారులే సమాధానం చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement