ఖమ్మంక్రైం: ఖమ్మం జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. తాగిన మైకంలో ఓ ఆర్టీసీ కండక్టర్‌ను ఆమె భర్తే దాారుణంగా హత్య చేశాడు. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వైరా మండలం స్టేజీ పినపాకకు చెందిన ఎక్కిరాల దేవమణి(36)కి తల్లాడ మండలం లక్ష్మీపురానికి చెందిన బంధువు ఇనపనూరి రాంబాబుతో 2006లో వివాహమైంది. వీరికి పిల్లలు ప్రణవ్‌తేజ, అశ్విత ఉన్నారు. అయితే, వివాహమైన కొద్దికాలం నుంచే రాంబాబు మద్యానికి బానిపై తరచూ భార్యను వేధించేవాడు.
ఇంతలోనే దేవమణికి ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగం రావడంతో ఖమ్మం మామిళ్లగూడెంలో పిల్లలతో కలిసి ఉంటోంది. ఆ తర్వాత కూడా రాంబాబులో మార్పు రాకపోగా దేవమణిపై వేధింపులు మరింత పెరిగాయి. దీంతో ఈనెల 6వ తేదీన ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకోగా, విచారణకు కోర్టు గడువు ఇచ్చింది. కాగా, వీరి కుమారుడు ప్రణవ్ పదో తరగతి చదువుతూ ప్రైవేట్ పాఠశాల హాస్టల్‌లో ఉంటుండగా, ఆదివారం ఆయన వద్దకు వెళ్లిన దేవమణి సోమవారం నుంచి జరిగే పరీక్షలు బాగా రాయాలని చెప్పి పండ్లు, బిస్కట్లు ఇచ్చి వచ్చింది.
నివాళులర్పించిన ఆర్టీసీ ఉద్యోగులు
ఖమ్మం మామిళ్లగూడెం: మహిళా కండక్టర్ దేవమణి మృతిపై ఖమ్మం ఆర్టీసీ డీఎం బి.శ్రీనివాస్, సీఐ రామయ్య, ఉద్యోగులు సంతాపం తెలిపారు. డీఎం, సీఐతో పాటు ఉద్యోగులు, సంఘాల నాయకులు ఏఎస్.రావు, భాస్కర్, పాషా, గడ్డం లింగయ్య, వెంకటేశ్వర్లు, పిట్టల సుధాకర్, తోకల బాబు, పర్వీన్, మల్లికాంబ, సీతారామయ్య, గుండు మాధవరావు, లింగమూర్తి, రోశయ్య, సరిత, నాగేశ్వరావు, భాగ్యలక్ష్మి, మెరుగు రవీంద్రనాధ్, యాదగిరి, పిల్లి రమేష్, అనిత తదితరులు ఆమె మృతదేహం వద్ద నివాళులర్పించారు. అలాగే, సంస్థ తరఫున దేవమణి అంత్యక్రియలకు రూ.20వేల నగదునుటీఐ రాయప్ప ఆమె కుటుంబీకులకు అందజేశారు.
కాపు కాసి హత్య...
తరచుగా దేవమణి ఉండే ఇంటి వద్దకు వచ్చి మద్యం మత్తులో రాంబాబు గొడవ చేసి ఇంటి ముందు పడుకుని వెళ్లేవాడు. ఈక్రమంలోనే ఆదివారం రాత్రి కూడా వచ్చాడు. అదే సమయాన బాత్‌రూం వెళ్లేందుకు దేవమణి బయటకు రాగా, ఆమెతో గొడవ పడిన రాంబాబు మొదట ఆమె చేతులు విరిచాడు. దీంతో ఆమె కేకలు వేయగా నిద్రలో ఉన్న కూతురు అశ్విత మేల్కొని అడ్డుకోబోగా గొంతు పట్టి గట్టిగా నెట్టేశాడు. ఆతర్వాత దేవమణిని ఇంట్లోకి లాక్కెళ్లిన రాంబాబు అక్కడే ఉన్న రోకలి బండతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందింది. ఆ వెంటనే రాంబాబు పారిపోగా.. అశ్విత తన తాతయ్య, అమ్మమ్మకు ఫోన్ చేసి చెప్పింది. అలాగే, స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఖమ్మం టూటౌన్ సీఐ శ్రీధర్, సిబ్బంది చేరుకుని మృతదేహన్ని మార్చురీకి తరలించడంతో పాటు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. సోమవారం ఉదయం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం పూర్తయ్యాక స్వగ్రామమైన పినపాకకు తరలించారు. కాగా, దైవమణి సోదరుడు వరంగల్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment