ఇల్లెందురూరల్: తెలిసీ తెలియని వైద్యంతో డాక్టర్ భార్య చేసిన చికిత్స బెడిసికొట్టింది. ఇంజక్షన్ వేసిన కాసేపటికే ఓ మహిళ కన్నుమూసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని కొమరారంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాలిలా.. మండలంలోని పోలారం గ్రామపంచాయతీ భద్రుతండాకు చెందిన భూక్య కోక్యా (45) జ్వరంతో బాధపడుతూ స్థానికంగా ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించుకుంది. జ్వరం తగ్గకపోవడంతో కోడలు ప్రమీల సాయంతో కొమరారంలో ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు జి.బన్సీ నిర్వహిస్తున్న కొమరారంలోని విఘ్నేశ్వర ఆస్పత్రిలో చేరింది.
ఆ సమయంలో ఎలాంటి అనుభవం లేని వైద్యుడి భార్య వెన్నెల కోక్యాను పరిశీలించి.. అందరికీ వైరల్ జ్వరాలే వస్తున్నాయంటూ ఓ ఇంజక్షన్ వేసింది. కాసేపటికే కోక్యా పరిస్థితి విషమంగా మారగా, భర్త బన్సీకి సమాచారం ఇచ్చింది. అతని సూచన మేరకు వెన్నెల సైలెన్ పెట్టినా ఎలాంటి మార్పు రాలేదు. కోక్యా ఆపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కోడలు ప్రమీల పక్కనే ఉన్న పోచారంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళుతుండగానే మృతి చెందింది.
విషయం తెలియగానే పోలారం గ్రామపంచాయతీ సర్పంచ్ వాంకుడోత్ సరోజిని, గ్రామస్తులు, మృతురాలి బంధువులు భారీగా తరలిరావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే కొమరారం ఎస్సై గిరిధర్‌రెడ్డి అక్కడికి చేరుకుని చికిత్సకు సంబంధించిన మందులు స్వాధీనం చేసుకుని బన్సీ, వెన్నెలను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బంధువుల ఆందోళన, దాడికి యత్నం..
ఆసుపత్రిలో విచారించిన ఎస్సై గిరిధర్‌రెడ్డి పిటిషన్ ఇవ్వాలని మృతురాలి కుటుంబసభ్యులను కోరారు. ఇదే విషయాన్ని గ్రామస్తులకు వివరించే ప్రయత్నం చేస్తుండగా కోపోద్రిక్తులైన వారు ఆస్పత్రిపై దాడికి యత్నించారు. పోలీసులు అడ్డుకున్నా అప్పటికే ముందుభాగంలో అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వైద్యుడు బన్సీ,, అతడి భార్య వెన్నెలను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రి వెనుక భాగం నుంచి ప్రత్యేక వాహనంలో తరలించే ప్రయత్నం చేశారు. గమనించిన గ్రామస్తులు పోలీసు వాహనాన్ని చుట్టుముట్టి దాడికి యత్నించారు.
ఎస్సై గిరిధర్‌రెడ్డి వారికి నచ్చజెప్పి కేసు నమోదు చేశామని, పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్నామని వివరించడంతో శాంతించారు. అనంతరం కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించి మృతురాలిని శవ పరీక్ష కోసం ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment