సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ హైకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీఆర్‌ఎస్ అధిష్టానం ఈ అంశంపై అచితూచి వ్యవహరిస్తోంది. హైకోర్టు తీర్పును సవాల్ చేసే ప్రయత్నాల్లో వనమా వర్గం ఉండగా, అదే తీర్పును అమల్లో పెట్టాలంటూ జలగం సంబంధిత అధికారులను కలుస్తున్నారు. మరోవైపు కొత్తగూడెం నుంచి కారు గుర్తుపై పోటీ చేయాలని గంపెడాశలు పెట్టుకున్న నేతల ఆశలపై హైకోర్టు తీర్పు నీళ్లు చల్లినట్లయింది.
తారుమారు
గత ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన జలగం వెంకట్రావు ఓటమి పాలవ్వగా వనమా కాంగ్రెస్ నుంచి గెలిచారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో నియోజకవర్గంలో ఇద్దరు నేతలు ఉండగా, మూడో వ్యక్తికి ఇక్కడ అవకాశం దొరకడం దుర్లభం అనే పరిస్థితి ఉండేది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జలగం వెంకట్రావు నియోజకవర్గంలో పెద్దగా హడావుడి చేసింది లేదు. అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. మరోవైపు వనమా రాఘవపై పోలీస్ కేసులు నమోదు కావడంతో సీన్ మారిపోయింది.
హడావుడి చేస్తున్న గడల
జలగం పెద్దగా నియోజకవర్గానికి రాకపోవడం, మరోవైపు వనమా కుటుంబంపై కేసులు – వయోభారాన్ని సాకుగా చూపుతూ కొత్తగూడెం సీటు నుంచి పోటీ చేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపించారు. వీరందరినీ వెనక్కి నెడుతూ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ముందు వరుసలోకి వచ్చారు. జీఎస్‌ఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల పేరుతో రాజకీయ ప్రణాళికను అమల్లో పెట్టారు. సెలవు చిక్కితే చాలు కొత్తగూడెంలో వాలిపోతూ సిట్టింగ్ ఎమ్మెల్యే వనమాపై విమర్శలు చేస్తూనే మరోవైపు సీఎం కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తూ వచ్చారు. కేవలం ఏడాది వ్యవధిలోనే గడల పేరు అందరి నోళ్లలో నానే స్థాయికి చేరుకున్నారు.
కొద్దిరోజులుగా వద్దిరాజు..
పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉంటారని, ఆయనకు సమర్థంగా ఎదుర్కొనే అభ్యర్థి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అంటూ కొంతకాలంగా కొత్త ప్రచారం ఊపందుకుంది. దీంతో కొత్తగూడెం నుంచి కారులో ఎవరికి బెర్త్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా హైకోర్టు తీర్పుతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఊహించని విధంగా జలగం వెంకట్రావు తెరమీదకు వచ్చారు. నిన్నా మొన్నటి వరకు గులాబీ పార్టీ నుంచి జలగం బరిలో ఉంటారా లేదా అనే స్థాయి నుంచి ఆయనే ఉంటారనే పరిస్థితి నెలకొంది. దీంతో కొత్తగూడెం టికెట్‌పై ఆశలు పెట్టుకున్న నేతలకు ఈ తీర్పు పిగుడుపాటులా మారిందనే అభిప్రాయం నియోజవర్గంలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గడల శ్రీనివాసరావు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది.
అధిష్టానం ఆరా
కొత్తగూడెం నియోజవర్గంలో పార్టీ పరిస్థితులపై ఎప్పటికప్పుడు బీఆర్‌ఎస్ అధిష్టానం ఆరా తీస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే చర్చ మొదలైంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో నష్టపోయిన, లాభపడిన ఇద్దరు వ్యక్తులు బీఆర్‌ఎస్ పార్టీకి చెందినవారే కావడంతో పరిస్థితి సున్నితంగా మారింది. దీంతో పార్టీ తరఫున హడావుడిగా ప్రకటనలు చేయకుండా అన్ని అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అందువల్లే కోర్టు తీర్పు పట్ల జలగం, వనమా వర్గీలు తప్పితే పార్టీ పరంగా మిగిలినవారేవరు ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు తీర్పు వెలువడిన తర్వాత ప్రగతి భవన్ నుంచి వనమాకు ఫోన్ వెళ్లినట్టు సమాచారం. రాజకీయాల్లో లాంటి పరిణామాలు సహజమేనని అన్నింటిని తట్టుకుని ముందుకు వెళ్లాలని సీఎం కేసీఆర్ వనమాకు సూచించినట్టు తెలుస్తోంది. గడ్డుకాలంలో వనమాకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్టు వనమా వర్గం నేతలు చెబుతున్నారు.
చర్యలు మొదలయ్యాయి
కొత్తగూడెం ఎమ్మెల్యేగా 2018, డిసెంబరు 12 నుంచి నన్ను గుర్తించాలని ఎన్నికల కమిషన్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీటికి సంబంధించిన తీర్పు కాపీలను ఈ రోజు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు అందించాను. అసెంబ్లీ స్పీకర్‌కు, సెక్రటరీలకు కూడా ఇచ్చాను. హైకోర్టు తీర్పును అనుసరించి తీసుకోవాల్సిన విధానపరమైన చర్యలు మొదలయ్యాయి. తుది అంకానికి చేరడానికి కొంత సమ యం పట్టవచ్చు. నాలుగేళ్లుగా కొత్తగూడెంలో ఆగి పోయిన అభివృద్ధిని పట్టాలెక్కిస్తాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రారంభించిన పనులే పూర్తి చేయలేకపోయారు. సమయం ఎంతుందన్నది కాదు, సంకల్పం ఎంత బలమైంది అనేది ముఖ్యం.
– జలగం వెంకట్రావు
ప్రజల నుంచి వేరు చేయలేరు
ఎన్ని అవాంతరాలు ఎదురైనా కొత్తగూడెం ప్రజల నుంచి తనను ఎవరూ వేరు చేయలేరు. వార్డు సభ్యుని నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన నాకు అఽధికారం, పదవులు కొత్త కాదు. గెలిచినపుడు ప్రజలతో ఉంటూ, ఓడినప్పుడు ప్రజలకు దూరంగా ఉండటం అనేది వారికి ద్రోహం చేసినట్టే. రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు పార్టీ పటిష్టతకు కూడా పాటు పడుతున్నాను. నియోజకవర్గంలో 80 శాతం మంది ప్రజాప్రతినిధులను గెలిపించుకున్నాను. మున్నూరుకాపు, బీసీ వర్గానికి చెందిన నాపై కుట్రలు చేశారు. చివరి శ్వాస వరకు కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తాను.
–వనమా వెంకటేశ్వరావు
Comments
Please login to add a commentAdd a comment