ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి
పాల్వంచరూరల్: ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో గ్రామపంచాయతీల ద్వారా తాగునీరు, నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్, డీఆర్‌డీఓ విద్యాచందన ఆదేశించారు. మండల పరిధిలోని కేశవాపురం గ్రామంలో ఉపాధి పనులు, నర్సరీలను బుధవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. ఎండ తీవ్రంగా ఉన్నందున ఉదయం ఏడుగంటలకే పని ప్రదేశాలకు చేరుకోవాలన్నారు. రూ.300 వచ్చేలా కొలతల ప్రకారం పనులు చేయాలని సూచించారు. పలుగు, పార, తట్టలు లేని కారణంగా పనులు ఎక్కువగా చేయలేకపోతున్నామని ఈ సందర్భంగా ఉపాధి కూలీలు అదనపు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె.విజయభాస్కరరెడ్డి, సిబ్బంది రంగా, కృష్ణవేణి, శంకర్ పాల్గొన్నారు.
ఏజెంట్ల వద్ద సైతం
తలంబ్రాల బుకింగ్
ఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ తలంబ్రాలు కావాల్సిన భక్తులు ఖమ్మం డిపో పరిధిలోని ఆర్టీసీ కార్గో ఏజెంట్ల వద్ద బుక్ చేసుకోవచ్చని డిపో మేనేజర్ దినేష్‌కుమార్ తెలిపారు. ఈసందర్భంగా ఖమ్మం కొత్త బస్టాండ్‌లో బుధవారం కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. స్వామి వారి తలంబ్రాలను ఇంటి వద్దే అందించనుండగా, ఖమ్మం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్(91542 98583), ఖమ్మం పాతబస్టాండ్ ఏజెంట్(97043 45599), కొణిజర్ల ఏజెంట్(85220 12587), నేలకొండపల్లి ఏజెంట్ 83310 06959, బోనకల్ ఏజెంట్(83091 25037)ను సంప్రదించాలని సూచించారు.
ఇసుక లారీ సీజ్
దమ్మపేట: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని బుధవారం రాత్రి పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... రాత్రి వేళ ఎస్సై సాయికిషోర్ రెడ్డి సిబ్బందితో కలసి మండల పరిధిలోని జలవాగులో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఏపీ నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న లారీని గుర్తించి, స్టేషన్‌కు తరలించారు. లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
వైస్ ఎంపీపీ మృతి
టేకులపల్లి: రోడ్డు ప్రమాదంలో వైస్ ఎంపీపీ మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. టేకులపల్లి ఎస్‌ఐ పి.సురేష్ కథనం ప్రకారం.. మండలంలోని సులానగర్ గ్రామానికి చెందిన, తాజా మాజీ వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్ (56) బుధవారం రాత్రి బైక్‌పై కొత్తగూడెం నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. అదే సమయంలో లక్ష్మీదేవిపల్లి మండలం వేపలగడ్డకు చెందిన పాయం రాకేష్, టేకులపల్లి మండలం బోడు కొత్తగూడేనికి కిషోర్ మరో బైక్‌పై కొత్తగూడెం వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో బోరింగ్ తండా సమీపంలో కొత్తగూడెం–ఇల్లెందు ప్రధాన రహదారిపై రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ముగ్గురికీ తీవ్రగాయాలయ్యాయి. ఉండేటి ప్రసాద్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారిలో రాకేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎంకు తీసుకెళ్లారు. కాగా మృతుడు ప్రసాద్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, సురేందర్ సందర్శించి సంతాపం తెలిపారు.
ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి
ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి
Comments
Please login to add a commentAdd a comment