ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యాన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 1,84,502 మెట్రిక్ టన్నులు కాగా అందులో సన్నరకం 99,729 మెట్రిక్ టన్నులు, మిగిలినవి దొడ్డు రకం వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 144 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ధాన్యం ఏ గ్రేడ్ రకానికి రూ.2,320, బీ గ్రేడ్‌కు రూ. 2,300 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లా సరిహద్దులో ఎనిమిది చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొనుగోలు ధాన్యాన్ని ఏరోజుకు ఆరోజు ఆన్‌లైన్ చేసి రైస్ మిల్లులకు తరలించాలని, దిగుమతిలో జాప్యం లేకుండా మిల్లర్లు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సెంటర్ ఇన్‌చార్జ్, మిల్లర్‌పై చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రతీ రైతు ఆధార్, బ్యాంకు, పట్టాదారు పాస్‌పుస్తకం తమవెంట తీసుకురావాలని చెప్పారు.
పోస్టర్లు ఆవిష్కరణ..
ధాన్యం మద్దతు ధర, నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి మార్కెటింగ్ శాఖ రూపొందించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం ఆవిష్కరించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఎం సివిల్ త్రినాథ్‌బాబు, డీఎస్‌ఓ రుక్మిణి, డీఏఓ బాబురావు, డీసీఓ ఖుర్షిద్, జీసీసీ మేనేజర్ విజయ్‌కుమార్, తూనికల, కొలతల అధికారి మనోహర్, మార్కెటింగ్ అధికారి నరేందర్, రైస్ మిల్లర్ల అసోసియేషన్ బాధ్యులు ఆనందరావు, రాజేంద్రప్రసాద్‌లు పాల్గొన్నారు.
‘రాజీవ్ యువవికాసా’నికి దరఖాస్తు చేసుకోవాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలోని బీసీ, ఎంబీసీ, బీసీ ఫెడరేషన్ ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాసం పథకానికి వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకానికి రజక, నాయీబ్రాహ్మణ, వడ్డెర, బట్రాజు, కృష్ణబలిజ, పూసల నగర, ఉప్పర, వాల్మీకి బోయ, కుమ్మరి, శాలీవాహన, విశ్వబ్రాహ్మణ, మేదర, కల్లుగీత కార్మికులు, గంగపుత్ర, పెరిక, పద్మశాలి, మేర, ముదిరాజ్, మున్నూరుకాపు, యాదవ, లింగాయత్ కులాలకు చెందినవారు అర్హులని తెలిపారు. tgobmmsnow.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 21 నుంచి 55 సంవత్సరాలలోపు వారు అర్హలని, వ్యవసాయ సంబంధ వృత్తులకు 60 సంవత్సరాల వరకు అర్హత ఉందని వివరించారు.