భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఎస్పీకి సీఆర్‌పీఎఫ్ అధికారుల అభినందన
కొత్తగూడెంటౌన్: జిల్లాలో పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు ఇతర శాఖలను సమన్వయం చేస్తూ గత లోక్‌సభ ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేసిన ఎస్పీ రోహిత్‌రాజును సీఆర్‌పీఎఫ్ ఐజీపీ చారూసిన్హా అభినందించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రశంసాపత్రం అందజేశారు. మావోయిస్టు ప్రభావిత జిల్లా అయినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేసి సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించారని ప్రశంసించారు. కాగా, జిల్లాలో పోలీసులతో పాటు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని ఎస్పీ తెలిపారు.
స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌గా రాజమల్లు
కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌గా మెండు రాజమల్లును నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ద్వారా సోమవారం ఆయన అందుకున్నారు. అనంతరం చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి బత్తుల రామారావు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత జిల్లా జడ్జి పాటిల్ వసంత్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జి.భానుమతి, రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కె.సాయిశ్రీ, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెలగల నాగిరెడ్డి, సీనియర్ న్యాయవాదులు పలివెల సాంబశివరావు, రమేష్‌కుమార్, సూరెడ్డి రమణారెడ్డి, గాదె సునంద పాల్గొన్నారు.
నిరంతర విద్యుత్
సరఫరాయే లక్ష్యం
దుమ్ముగూడెం : అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా తమ శాఖ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని విద్యుత్ శాఖ ఎస్‌ఈ మహేందర్ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని లచ్చిగూడెం సబ్‌స్టేషన్‌లో నూతన బ్రేకర్‌ను ప్రారంభించారు. గతంలో లచ్చిగూడెం – గుర్రాలబైలు గ్రామాలకు కలిపి ఒకటే బ్రేకర్ ఉండగా విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడేది. దీంతో నూతన బ్రేకర్ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ.. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీఈ జీవన్‌కుమార్, ఏడీఈ ప్రభాకర్‌రావు, ఏఈ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రామయ్యకు ముత్తంగి అలంకరణ
రామయ్యకు ముత్తంగి అలంకరణ