అర్జీలను పరిష్కరించాలి
కొత్తగూడెంఅర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.
గ్రీవెన్స్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ఇలా..
● ప్రభుత్వం నుంచి రావాల్సిన భూమి ఇప్పించాలని జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు సూర్యదేవర రాజయ్య భార్య సీతమ్మ వినతిపత్రం అందజేసింది. పరిశీలించిన అదనపు కలెక్టర్ ఈ సెక్షన్ సూపరింటెండెంట్‌కు ఎండార్స్ చేశారు.
● అగ్నిప్రమాదంలో ఇల్లు, కుమార్తె వివాహం కోసం దాచుకున్న నగదు, బంగారం దగ్ధమయ్యాయని, తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని జూలూరుపాడు మండలం సాయిరాం తండాకు చెందిన గుగులోతు వీరు అర్జీ అందించారు. అర్జీని పరిశీలించి చర్యలు నిమిత్తం హౌసింగ్ పీడీకి ఎండార్స్ చేశారు.
● పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయితీ వర్కర్ల వేతనాలు చెల్లించాలని ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో, ఖబరస్థాన్ స్థలానికి అనుమతి మంజూరు చేయాలని జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎండీ యాకూబ్‌పాషా ఆధ్వర్యంలో వినతి అందజేశారు.
● ఇసుక అక్రమ తవ్వకాలను ప్రభుత్వం అరికట్టాలని కోరుతూ సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ నాయకుడు రంగారెడ్డి, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య వినతి పత్రం అందజేశారు.
● కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని, సబ్ రిజిస్ట్రార్ వ్యవహారశైలి, అవినీతిపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ జిల్లా సమాచార హక్కు చట్టం కో–ఆర్డినేషన్ కమిటీ మెంబర్ జూలూరి రఘుమాచారి ఫిర్యాదు చేశారు.
● జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అప్పగించాలని కోరుతూ బీఆర్‌ఎస్, తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేశారు.
● 2021లో తన తండ్రి మరణించాడని, ఆయన పేరు మీద ఎస్‌ఐబీలో ఉన్న పంట రుణం మాఫీ చేయాలని జూలూరుపాడు మండలం వినోబా నగర్‌కు చెందిన గంగావత్ ప్రసాద్ విన్నవించగా.. దరఖాస్తును వ్యవసాయ శాఖ అధికారికి ఎండార్స్ చేశారు.
● భూక్యా పులి సింగ్, సరోజ అనే వ్యక్తులు తమ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నారని, విచారణ జరిపి తమకు పట్టా మంజూరు చేయాలని ఇల్లెందు మండలం ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన కున్సోత్ అరుణ ఫిర్యాదు చేయగా, దరఖాస్తును టేకులపల్లి తహసీల్దార్ ఎండార్స్ చేశారు.
● వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్న భూమికి తన మరిది కందుకూరి నాగార్జున అడ్డుపడుతున్నాడని, తగిన చర్యలు తీసుకుని ఆలయానికి భూమి ఇప్పించేలా చూడాలని దమ్మపేటకు చెందిన కందుకూరి లక్ష్మీ నరసమ్మ అనే మహిళ ఫిర్యాదు చేసింది. అర్జీని పరిశీలించిన అదనపు కలెక్టర్ ఈ సెక్షన్ సూపరింటెండెంట్‌కు ఎండార్స్ చేశారు.
గ్రీవెన్స్‌లో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన