
నష్టం మిగిల్చిన వర్షం..
అనుకోని వర్షం అన్ని పంటలను దెబ్బకొట్టింది.. మండే వేసవిలో కురిసిన అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. ఆరుగాలం శ్రమించి.. ఇక పంట చేతికొస్తుందనుకున్న రైతుల ఆశలపై నీళ్లు కుమ్మరించింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చెప్పా పెట్టకుండా వచ్చిన వాన అన్నదాతల కంట కన్నీళ్ల వరదలు పారించింది.
పాల్వంచరూరల్: వర్షానికి నేలవాలిన వరి పంట
పాల్వంచ మండలంలో..
పాల్వంచరూరల్: మండలంలోని కోడిపుంజుల వాగులో తేజావత్ కీమా మిర్చి తడిసి ముద్దయింది. నారాయణరావుపేటలో దాసరి మస్తాన్‌రావుకు చెందిన ఎనిమిది ఎకరాలు, అప్పొజు సత్యనారాయణకు చెందిన ఆరు ఎకరాలు, వెంకట్రావుకు చెందిన 3 ఎకరాల వరి పంట నేలవాలింది. నాగారం, దంతలబోరు, సోములగూడెం, రంగాపురం గ్రామాల్లో వరి దెబ్బతిన్నది. ఏఓ శంకర్ రంగాపురంలో వరి పంటలను పరిశీలించారు.
ఇల్లెందులో..
ఇల్లెందురూరల్: అకాల వర్షాటనికి మండలంలో మొక్కజొన్న పంట సుమారు 300 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు సమాచారం. పూబెల్లిలో కల్లంలో ఆరబెట్టిన మొక్కజొన్న తడిసిపోవడంతో మహిళా రైతు కల్తీ కోటమ్మ చేలోనే సొమ్మసిల్లి పడిపోయింది. ఐదెకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న నూర్పిడి చేసి కల్లంలో ఆరబెట్టింది. గురువారం వాహనం దొరక్కపోవడంతో తీసుకెళ్లకపోవడంతో.. భారీ వర్షం నట్టేట ముంచింది. శుక్రవారం ఉదయం చేనుకు వెళ్లిన ఆమె తడిసిన పంటను చూసి అక్కడే కుప్పకూలింది. సమీప రైతులు గమనించి ఇంటికి చేర్చారు. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి కూడా కూడా తడిసిపోయింది. ఏడీఏ లాల్‌చంద్, ఏఓ సతీశ్ గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. సీపీఎం నాయకులు అబ్దుల్ నబీ, ఆలేటి కిరణ్, వజ్జ సురేశ్ కూడా పంటలను పరిశీలించారు.

నష్టం మిగిల్చిన వర్షం..

నష్టం మిగిల్చిన వర్షం..

నష్టం మిగిల్చిన వర్షం..