
రేపటి నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు
● గంట ముందే కేంద్రాల్లోకి అనుమతి ● తాగునీరు, ఫ్యాన్లు వంటి వసతులు కల్పించిన అధికారులు
ఖమ్మం సహకారగర్: ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఈనెల 20నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 20నుంచి 26వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం పరీక్షలు జరగనుండగా, ఉదయం 9నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2–30నుంచి 5–30గంటల వరకు జరిగే పరీక్షలకు గంట ముందు నుంచే కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు.
ఉద్యోగుల నియామకం
పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఎనిమిది కేంద్రాల్లో ఎనిమిది మంది చొప్పున, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను నియమించారు. అలాగే, వేసవి నేపథ్యాన కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు వంటి వసతులు కల్పిస్తున్నారు. కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించేది లేదని ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి ఈ.సోమశేఖర శర్మ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు తెలిపారు. కేంద్రాల సమీపాన జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సూచించారు.