‘నవమి’ లెక్క తేలేదెప్పుడో ? | - | Sakshi
Sakshi News home page

‘నవమి’ లెక్క తేలేదెప్పుడో ?

Published Thu, Apr 24 2025 12:41 AM | Last Updated on Thu, Apr 24 2025 12:41 AM

‘నవమి’ లెక్క తేలేదెప్పుడో ?

‘నవమి’ లెక్క తేలేదెప్పుడో ?

● ఆదాయానికి మించి ఖర్చులతో రామయ్యపై భారం ● ఈ ఏడాదీ అందని ప్రభుత్వ ఫెస్టివల్‌ ఫండ్‌

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారాముల కల్యా ణం, పట్టాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా ముగిశాయి. ఇక రామయ్య ఆదాయ, వ్యయాల లెక్కలు తేలాల్సి ఉంది. నవమి అనంతరం పనులు, వరుస సెలవులు రావడంతో లెక్కల వివరాలను తెలపడంలో జాప్యం జరుగుతోందని ఆలయ అధికారులు అంటున్నారు. అయితే ఈ ఏడాది సైతం ఆదాయ, వ్యయాలు సమానంగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి తొలిసారిగా హాజరైన ఈ ఉత్సవానికి ప్రభుత్వ సాయం ప్రకటనపై అందరూ ఆసక్తిగా ఎదురుచూసినా.. ఉత్సవాల నిర్వహణ ఫండ్‌పై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో భక్తులు, ఆలయ సిబ్బంది నిరాశకు లోనయ్యారు.

టికెట్ల విక్రయమే ప్రధాన వనరు..

శ్రీ సీతారామచంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు దేవస్థానానికి రూ.2.50 కోట్లు ఖర్చవుతాయని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇక శ్రీరామనవమికి విక్రయించే టికెట్ల ద్వారా వచ్చే ఆదాయమే ఆలయానికి ప్రధాన వనరుగా మారుతోంది. ఈ టికెట్లను ఆన్‌లైన్‌, కౌంటర్ల ద్వారా విక్రయించారు. ఆన్‌లైన్‌లో ఈ ఏడాది ముందుగానే టికెట్లు అందుబాటులో ఉంచారు. అయితే సీఎంతో పాటు వీవీఐపీలు కల్యాణానికి పెద్ద ఎత్తున తరలిరావడంతో కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదేశాల మేరకు ఉభయ దాతల సెక్టార్‌ను కుదించారు. 1000 టికెట్లను 725కే పరిమితం చేయడంతో సుమారు రూ.16 లక్షల ఆదాయానికి గండి పడింది. దీనికి తోడు రెవెన్యూ అధికారులు విక్రయించిన టికెట్ల ఆదాయం సైతం తగ్గే అవకాశం ఉంది. ఇలా ఆన్‌లైన్‌, కౌంటర్ల ద్వారా విక్రయించిన టికెట్లతో పాటు పరోక్ష సేవల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం కలిపి సుమారు రూ.2.75 కోట్ల మేర సమకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆలయ హుండీ ఆదాయం సైతం లెక్కించాల్సి ఉంది. గత లెక్కల ప్రకారం 45 రోజులకు సుమారు రూ.కోటి ఆదాయం వచ్చింది. శ్రీరామ నవమి అనంతరం వరుస సెలవులు ఉండటంతో భక్తుల రద్దీ కూడా బాగానే ఉంది. దీంతో నెల రోజులకు హుండీ ఆదాయం రూ.కోటి వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది రెండు లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. ఇలా మొత్తంగా శ్రీరామనవమి ఉత్సవాల ద్వారా రూ.3.50 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఫెస్టివల్‌ ఫండ్‌ ప్రకటిస్తే బాగు..

ఏటా శ్రీరామనవమి వేడుకలను ప్రభుత్వ ఉత్సవాలుగా ప్రకటించి ఫెస్టివల్‌ ఫండ్‌ విడుదల చేయాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. ప్రత్యేక నిధులతో ఉత్సవాలను విజయవంతం చేస్తే దేవస్థానానికి రూ.2.50 కోట్ల వరకు ఆదా అవుతుంది. దీనికి తోడు నవమి ఆదాయం అదనంగా మారనుంది. అంటే సుమారు రూ. కోట్ల మేర నిధులు రామయ్య చెంతన ఉంటాయి. దీంతో భక్తులకు అవసరమైన వసతి సౌకర్యాలు, ఇతర సేవలు శాశ్వతంగా అందించే అవకాశం ఉంటుంది. ఇంకా నిత్యాన్నదానాన్ని ప్రతిరోజూ అసంఖ్యాకంగా అందజేయాలనే సంకల్పం సైతం నెరవేరుతుంది. 2027లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. భద్రాచలంలో ఉన్న పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ నేపథ్యంలో గోదావరి పుష్కరాలకు ముందు జరిగే 2026 నవమి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఫెస్టివల్‌ ఫండ్‌ విడుదల చేసి శాశ్వత వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement