
రేపు భద్రాచలానికి ఎమ్మెల్సీ కవిత
ఇల్లెందు : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం భద్రాచలం వస్తున్నారని బీఆర్‌ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శనం చేసుకుంటారని, ఆ తర్వాత హరిత హోటల్‌లో తెలంగాణ ఉద్యమకారులతో ఏర్పాటు చేసే సమావేశంలో మాట్లాడుతారని వివరించారు. ఉద్యమకారులంతా సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు.
ఫొటోలు తొలగించిన అధికారులు
భద్రాచలంఅర్బన్: భద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి విచారణ చేపట్టకుండానే బిల్లుల మంజూరుకు ప్రతిపాదించిన ఉద్యోగి పూసా జగదీష్‌ను ఇప్పటికే సస్పెండ్ చేశారు. తప్పుడు ఫొటోలు అప్‌లోడ్ చేసినట్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించిన విషయం విదితమే. ఈమేరకు శనివారం మరోమారు విచారణ చేపట్టిన అధికారులు సదరు ఉద్యోగి అప్‌లోడ్ చేసిన ఫొటోలను సైట్ నుంచి తొలగించారు.