
నేత్రపర్వంగా రామయ్య కల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. వరుస సెలవులు కావడంతో నిత్యకల్యాణ వేడుకలోనూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ కనకదుర్గమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకోగా అర్చకులు విశేష పూజలు జరిపారు. అనంతరం అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
నేటి ప్రజావాణి రద్దు
సూపర్‌బజార్(కొత్తగూడెం): భూభారతి చట్టం అమలులో భాగంగా జిల్లావ్యాప్తంగా అవగాహనా సదస్సుల నిర్వహణలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమై ఉన్నందున సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తులు అందజేయడానికి కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు.
కిన్నెరసానిలో
పర్యాటక సందడి
పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రంవరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 562 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖ రూ.30,420 ఆదాయం లభించగా, 180మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.8,060 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. కొత్తగూడెం రెండో అదనపు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కె.సాయిశ్రీ కుటుంబ సభ్యులతో కిన్నెరసానిని సందర్శించారు. మ్యూజియంలోని జంతువుల బొమ్మలను వీక్షించి బోటు షికారు చేశారు.

నేత్రపర్వంగా రామయ్య కల్యాణం

నేత్రపర్వంగా రామయ్య కల్యాణం