
భూ భారతితో సమస్యలకు చెక్
● జూన్ 2 నుంచి అందుబాటులోకి పోర్టల్ ● కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వెల్లడి
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : ప్రభుత్వం తాజాగా రూపొందించిన భూ భారతి చట్టం రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని, ఈ చట్టంతో భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. అన్నపురెడ్డిపల్లిలో భూ భారతి చట్టంపై మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. జూన్ 2 నుంచి పోర్టల్ అందుబాటులోకి వస్తుందన్నారు. గతంలో ఉన్న ధరణికి ఇది విరుద్ధమని, రైతుల భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ భూ భారతి చట్టం రైతులకు వరం లాంటిందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధు, ఏడీఏ రవికుమార్, తహసీల్దార్ జగదీశ్వర్‌ప్రసాద్, ఎంపీడీఓ మహాలక్ష్మి, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఏఓ అనూష, వనమా గాంధీ, పర్సా వెంకటేశ్వరరావు, వేముల రమణ పాల్గొన్నారు.
ఆర్‌వైవీ అర్హుల జాబితా రూపొందించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితా రూపొందించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులు, బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని, మండల ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో ఎంపీడీఓలు, బ్యాంకు మేనేజర్లు, కమిటీ సభ్యులు కార్యాచరణ రూపొందించుకుని క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని సూచించారు. జనాభా ప్రాతిపదికన యూనిట్ల కేటాయింపు ఉంటుందని, ఒకే గ్రామంలో ఒక యూనిట్‌కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించాలని అన్నారు. ఆయా కార్పొరేషన్ల అధికారులు సైతం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో పాల్గొనాలని ఆదేశించారు. వ్యవసాయ సంబంధిత యూనిట్ల స్థాపనపై అవగాహన కల్పించాలని, చేపల పెంపకం యూనిట్ల ద్వారా ఆర్థిక పురోగతి ఉంటుందని తెలిపారు. సమావేవంలో సీపీఓ సంజీవరావు, బీసీ సంక్షేమాధికారి ఇందిర, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి చట్టంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, హౌసింగ్ పీడీ శంకర్ తదితరులు హాజరయ్యారు.