న్యూఢిల్లీ: దేశంలో అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీ భారీ వృద్ధిని చూడనుంది. డిమాండ్ ఏటా 50 శాతం కాంపౌండెడ్ చొప్పున (సీఏజీఆర్) పెరుగుతూ, 2022 నాటికి ఉన్న 20 గిగావాట్ అవర్ (జీడబ్ల్యూహెచ్) నుంచి.. 2030 నాటికి 220 గిగావాట్ అవర్‌కు చేరుకుంటుందని సీఐఐ అంచనా వేసింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. ఈ వృద్ధికి స్థానికంగా అభివృద్ధి చెందుతున్న బ్యాటరీ తయారీ పరిశ్రమ, బలమైన స్థానిక సరఫరా మద్దతునిస్తాయని పేర్కొంది.
మొత్తం వ్యాల్యూచైన్ (మెటీరియల్ ప్రాసెసింగ్, అసెంబ్లింగ్, ఇంటెగ్రేషన్)లో అధిక భాగాన్ని భారత్ స్థానికంగానే తయారు చేసే స్థాయికి చేరుకుంటుందని తెలిపింది. ఈ అధ్యయనం కోసం 6డబ్ల్యూరీసెర్చ్ సాయాన్ని సీఐఐ తీసుకుంది. ‘‘వాహనం పవర్‌ట్రెయిన్‌ను బ్యాటరీ నడిపిస్తుంది. మెరుగైన బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) అభివృద్ధికి వీలుగా, బ్యాటరీ టెక్నాలజీలో పురోగతి అవసరం. తయారీ సామర్థ్యాల ఏర్పాటు, జాతీయ స్థాయిలో బ్యాటరీ ముడి పదార్థాల సరఫరా బలోపేతం చేయడమే కాకుండా.. చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు భారత్‌కు అధిక నాణ్యత, వినూత్నమైన బ్యాటరీ మెటీరియల్స్‌ను సరఫరా చేసే విశ్వసనీయ సరఫరా వ్యవస్థలు అవసరం’’ అని సీఐఐ నేషనల్ కమిటీ చైర్మన్ అయిన విపిన్ సోది తెలిపారు.
మైనింగ్‌ను ప్రోత్సహించాలి..
కోబాల్ట్, నికెల్, లిథియం, కాపర్ మైనింగ్, రిఫైనింగ్‌ను దేశీయంగా ప్రోత్సహించాలని సీఐఐ నివేదిక సూచించింది. బ్యాటరీ తయారీలో వినియోగించే కీలకమైన ఖనిజాలపై కస్టమ్ డ్యూటీని తగ్గించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. బ్యాటరీ తయారీని పెంచేందుకు వీలుగా పన్నుల మినహాయింపులు, ప్రోత్సాహకాల రూపంలో మద్దతుగా నిలవాలని అభిప్రాయపడింది. అలాగే, ఖనిజాల ప్రాసెసింగ్ ప్లాంట్‌కు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలకు (ఆర్‌అండ్‌డీ) ప్రోత్సాహకాలు అందించాలని సూచించింది. అత్యాధునిక టెక్నాలజీ కోసం ఇతర దేశాలతో సహకారం ఇచ్చిపుచ్చుకోవడం, బ్యాటరీ కెమికల్స్ పరిశ్రమ పర్యావరణ ఇతర అనుమతులు, లైసెన్స్‌లను పొందే విషయంలో నియంత్రణలను సులభతరం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. కేంద్ర సర్కారు 20 గిగావాట్ అవర్ ఏసీసీ తయారీకి వీలుగా ఉత్పత్తి ఆధారిత అనుసంధాన పథకం కింద (పీఎల్‌ఐ) రూ.18,100 కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించడం గమనార్హం.
దేశీయంగా బ్యాటరీల ముడిసరుకు ఉత్పత్తి
► ఎల్‌ఎఫ్‌పీ తయారీలో ఆల్ట్‌మిన్
బ్యాటరీల్లో కీలకమైన క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్ (క్యామ్)కి సంబంధించిన ముడి సరుకు లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్ (ఎల్‌ఎఫ్‌పీ)ని తొలిసారి దేశీయంగానే ఉత్పత్తి చేసేందుకు ఆల్ట్‌మిన్ శ్రీకారం చుట్టింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖలో భాగమైన ఏఆర్‌సీఐ తోడ్పాటుతో పైలట్ ప్రాతిపదికన 10 మెగావాట్ల సామర్ధ్యంతో ప్లాంటును ప్రారంభిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు మౌర్య సుంకవల్లి, కిరీటి వర్మ తెలిపారు. దీనిపై దాదాపు రూ. 25 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వివరించారు. విద్యుత్ వాహనాల వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో సామరŠాధ్యన్ని 3 గిగావాట్లకు పెంచుకునే ప్రణాళికలు ఉన్నట్లు పేర్కొన్నారు. భారత్‌కు 2025 నాటికి 25 గిగావాట్లు, 2030 నాటికి 150 గిగావాట్ల సామర్ధ్యం అవసరమవుతుందని చెప్పారు. ఎల్‌ఎఫ్‌పీ విషయంలో స్వయం సమృద్ధి సాధించడం వల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొన్నారు. ఎల్‌ఎఫ్‌పీకి అవసరమయ్యే లిథియంను బొలీవియా, బ్రెజిల్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment