ఏసీసీ లాభం రూ.326 కోట్లు
న్యూఢిల్లీ: మెరుగైన అమ్మకాలతో సిమెంట్ దిగ్గజం ఏసీసీ జూన్ త్రైమాసికంలో రూ.326 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన రూ.246 కోట్లతో పోల్చుకుంటే తాజాగా 32 శాతం మేర వృద్ధి చెందింది. కన్సాలిడేటెడ్ విక్రయాలు 18 శాతం అధికమై రూ.3,818 కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు రూ.3,238 కోట్లు. సిమెంట్ విక్రయాలు 10 శాతం అధికంగా 6.74 మిలియన్ టన్నులు అమ్ముడుపోయినట్టు కంపెనీ తెలిపింది.
కొత్త బ్రాండ్లు విడుదల చేయడంతోపాటు ప్లాంట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి చర్యలు చక్కని పనితీరుకు నిదర్శనంగా ఏసీసీ ఎండీ నీరజ్ అఖోరీ తెలిపారు. కాగా, ప్రతీ రూ.10 ముఖ విలువ కలిగిన షేరుకు మధ్యంతర డివిడెండ్ కింద రూ.11 ఇవ్వాలని బోర్డు సిఫారసు చేసింది. జనవరి–డిసెంబర్‌ను ఆర్థిక సంవత్సరంగా ఏసీసీ పాటిస్తోంది.