Adani Hires Wachtell Law Firm in Battle Against Hindenburg - Sakshi
Sakshi News home page

హిండెన్‌బర్గ్‌తో పోటీలో ఆదానీ కొత్త ప్లాన్‌!

Published Fri, Feb 10 2023 2:20 PM | Last Updated on Fri, Feb 10 2023 4:55 PM

Adani Hires Wachtell Law Firm In Battle Against Hindenburg - Sakshi

హిండెన్‌బర్గ్‌తో పోరులో గౌతమ్‌ ఆదానీ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. హిండెన్‌బర్గ్‌తో న్యాయ పోరాటానికి అమెరికాలోనే అత్యంత ఖరీదైన లీగల్‌ సంస్థ అయిన వాచ్‌టెల్‌ను నియమించుకున్నారు. ఈ చర్యతో తన ఇన్వెస్టర్లలో తిరిగి విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. 

ఫినాన్షియల్‌ టైమ్స్‌ కథనం ప్రకారం.. హిండెన్‌బర్గ్‌ నివేదికతో ఆదానీ గ్రూప్‌నకు ఎదురైన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు న్యూయార్క్‌లో ప్రముఖ వాచ్‌టెల్‌, లిప్టెన్‌, రోసెన్‌, కట్జ్‌ సంస్థల్లోని సీనియర్‌ లాయర్ల సేవలను వినియోగించుకోనున్నారు. స్టాక్‌ మార్కెట్‌లో ఆదానీ గ్రూప్‌ అవకతవకలకు పాల్పడిదంటూ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ బయటపెట్టిన నివేదిక సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

డీల్‌ జరిగింది అక్కడే
ఆదానీ గ్రూప్‌నకు అండగా ఉండే సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ సంస్థలో కార్యాలయంలో వాచ్‌టెల్‌తో ఈ డీల్‌ జరినట్లు తెలుస్తోంది. సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ సంస్థ అధినేత సిరిల్‌ ష్రాఫ్‌ కుమార్తెను గౌతమ్‌ ఆదానీ కొడుక్కి వివాహం చేసుకున్నారు. కార్పొరేట్‌ సంస్థల్లో తలెత్తే సంక్షోభాలను పరిష్కరించడంలో ఈ వాచ్‌టెల్‌ సంస్థకు విశేష నైపుణ్యం ఉంది.

రూ.4లక్షల కోట్లు ఆవిరి 
కొద్ది రోజుల క్రితం అమెరికా షార్ట్ షెల్లింగ్ సంస్థ‌ హిండేన్‌ బర్గ్‌ భారత్‌లో కార్పొరేట్‌ దిగ్గజాల్లో ఒకటైన అదానీ గ్రూప్‌ అవకతవకలకు పాల్పడినట్లు ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్‌ దెబ్బకు అదానీ గ్రూప్‌ విలువ ఏకంగా రూ. 4 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానంలో ఉన్న అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ 7వ స్థానానికి పడిపోయాడు. భారతీయ స్టాక్‌ మార్కెట్లు భారీ ఎత్తున నష్టపోయాయి. ఆ రిపోర్ట్‌ విడుదల ప్రారంభంలో కేవలం రెండు ట్రేడింగ్‌ సెషన్లలో రూ.10 లక్షల కోట్లను పోగొట్టుకొన్నాయి. 

పార్లమెంట్‌లో ప్రకంపనలు
స్టాక్ మార్కెట్ లోనే కాదు, ఇటు పార్లమెంట్ లోనూ అదానీ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అదానీ గ్రూపు ఆర్థిక అవకతవకలపై చర్చించాలని ప్రతిపక్షాలు ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి. మొత్తానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక షేక్ చేస్తుంది. 

ఇన్వెస‍్టర్లలో విశ్వాసం నింపేందుకై
ఈ తరుణంలో హిండెన్‌బర్గ్‌పై గౌతమ్‌ అదానీ న్యాయ పోరాటానికి దిగారు. అమెరికాలోనే అత్యంత ఖరీదైన లీగల్‌ సంస్థ వాచ్‌టెల్‌ను నియమించుకున్నారు. ఈ చర్యతో తన ఇన్వెస్టర్లలో తిరిగి విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ అంశంలో అదానీ ఎంత మేరకు విజయం సాధిస్తానేది కాలమే నిర్ణయించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement