న్యూఢిల్లీ: రుణభారంతో కుదేలైన అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్‌ను సొంతం చేసుకునేందుకు పలు దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. కంపెనీని చేజిక్కించుకునేందుకు అదానీ ఫిన్‌సర్వ్, కేకేఆర్, పిరమల్ ఫైనాన్స్, పూనావాలా ఫైనాన్స్ తదితర 14 దిగ్గజాలు పోటీ పడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజాగా రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకి వీలుగా బిడ్స్ దాఖలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నియమిత పాలనాధికారి ఈ నెల 25వరకూ గడువు పెంచారు. తొలుత ఇందుకు మార్చి 11చివరి తేదీగా ప్రకటించారు. చెల్లింపుల్లో వైఫల్యం, కార్పొరేట్ పాలనా సంబంధ సమస్యల నేపథ్యంలో గతేడాది నవంబర్ 29న ఆర్‌బీఐ రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ బోర్డును రద్దు చేసింది. 2021 సెప్టెంబర్‌లో కంపెనీ నిర్వహించిన ఏజీఎంలో కన్సాలిడేటెడ్ రుణ భారం రూ. 40,000 కోట్లుగా వాటాదారులకు తెలియజేసింది.
మూడో పెద్ద కంపెనీ
ఇటీవల ఆర్‌బీఐ దివాలా చట్ట చర్యల(ఐబీసీ)కు ఉపక్రమించిన మూడో పెద్ద నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)గా రిలయన్స్ క్యాప్ నిలుస్తోంది. ఇప్పటికే ఐబీసీ పరిధిలోకి చేరిన సంస్థల జాబితాలో శ్రేయీ గ్రూప్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్) చేరిన విషయం విదితమే. కాగా.. రిలయన్స్ క్యాప్ కొనుగోలు పట్ల ఆసక్తి కలిగిన కంపెనీలు బిడ్స్ దాఖలుకు మరింత గడువును కోరడంతో పాలనాధికారి తాజా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రేసులో ఇప్పటికే ఆర్ప్ వుడ్, వర్దే పార్టనర్స్, మల్టిపుల్స్ ఫండ్, నిప్పన్ లైఫ్, జేసీ ఫ్లవర్స్, బ్రూక్‌ఫీల్డ్, ఓక్‌ట్రీ, అపోలో గ్లోబల్, బ్లాక్‌స్టోన్, హీరో ఫిన్‌కార్స్ ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వీటిలో చాలవరకూ కంపెనీ పూర్తి కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశాయి.
కొనుగోలుదారులకు రెండు అవకాశాలు
కొనుగోలుదారులకు రెండు అవకాశాలున్నాయి. కంపెనీకున్న 8 అనుబంధ సంస్థల కోసం లేదా మొత్తం రిలయన్స్ క్యాపిటల్‌ను సొంతం చేసుకునేందుకు ఈవోఐలు దాఖలు చేయవచ్చు. అనుబంధ సంస్థల జాబితాలలో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ సెక్యూరిటీస్, రిలయన్స్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ తదితరాలున్నాయి. దివాలా చర్యలలో భాగంగా వై.నాగేశ్వరరావును ఆర్‌బీఐ పాలనాధికారిగా నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment