న్యూఢిల్లీ: అదానీ పవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.9 కోట్లతో పోల్చి చూసినప్పుడు ఎన్నో రెట్ల వృద్ధితో రూ.2,738 కోట్లకు దూసుకుపోయింది. మొత్తం ఆదాయం సైతం రూ.8,290 కోట్ల నుంచి రూ.13,355 కోట్లకు వృద్ధి చెందింది.
మహన్ వద్ద 1,600 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం ప్రణాళిక ప్రకారమే కొనసాగుతున్నట్టు కంపెనీ తెలిపింది. ఇనార్గానిక్ (ఇతర సంస్థల కొనుగోళ్లు) మార్గంలో తమ నాయకత్వ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికంతోపాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొమ్మిది నెలల్లో ముంద్రా, ఉడుపి, రాయిపూర్, మహన్ ప్లాంట్లు అధిక విక్రయాలకు సాయపడినట్టు తెలిపింది.
అదే సమయంలో గొడ్డా ప్లాంట్ నుంచి అదనపు ఉత్పత్తి తోడైనట్టు వివరించింది. బంగ్లాదేశ్ విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఇది (గొడ్డా ప్లాంట్) కీలక భాగంగా మారినట్టు పేర్కొంది. మూడో త్రైమాసికంలో 21.5 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను విక్రయించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 11.8 బిలియన్ యూనిట్లుగానే ఉంది. రుణాలకు చేసే వ్యయాలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.946 కోట్ల నుంచి రూ.797 కోట్లకు తగ్గాయి.
ప్రస్తుత ఆర్థిక సంత్సరం డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి నికర లాభం 230 శాతం పెరిగి రూ.18,092 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.5,484 కోట్లుగా ఉంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో అదానీ పవర్ షేరు 4 శాతానికి పైగా లాభపడి రూ.542 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment