న్యూఢిల్లీ: చైనీస్ ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్ జియామీ మ్యూజిక్‌ను వచ్చే నెల నుంచీ మూసివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చైనా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో భారీగా ఎదగాలని అలీబాబా తొలుత వేసిన ప్రణాళికలకు దీంతో చెక్ పడవచ్చని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబో అభిప్రాయపడింది. కార్యకలాపాల సర్దుబాటులో భాగంగా జియామీ మ్యూజిక్‌ను ఫిబ్రవరి 5 నుంచి నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. 2013లో మ్యూజిక్ యాప్‌పై అలీబాబా గ్రూప్ మిలియన్లకొద్దీ ఇన్వెస్ట్ చేసింది. తద్వారా చైనీస్ భారీ మ్యూజిక్ మార్కెట్‌లో ప్రవేశించింది. అయితే ప్రణాళికలు విజయవంతం కాకపోవడంతో వెనకడుగు వేసేందుకు నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చైనా మ్యూజిక్ స్ట్రీమింగ్ మార్కెట్లో జియామీ కేవలం 2 శాతం మార్కెట్ వాటాను మాత్రమే సాధించగలిగింది. వెరసి కుగో, క్యూక్యూ, కువో, నెట్‌ఈజ్, క్లౌడ్ మ్యూజిక్ తదితర సంస్థల వెనుక నిలిచింది. ఈ వివరాలను బీజింగ్ సంస్థ టాకింగ్ డేటా వెల్లడించింది. కాగా.. గత నెలలో చైనా నియంత్రణ సంస్థలు అలీబాబా గ్రూప్‌నకు చెందన యాంట్ గ్రూప్‌పై యాంటీట్రస్ట్ చట్టంకింద దర్యాప్తును చేపట్టిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment