స్ట్రీమింగ్ సర్వీస్‌ల ద్వారా మ్యూజిక్ వినడానికి ఇష్టపడుతున్న యువతరం అవే సర్వీసుల ద్వారా సంగీతంపై అవగాహన ఏర్పర్చుకుంటోంది. ఆ అవగాహనతో యువ సంగీత ప్రేమికులు, శ్రోతలు స్పాటిఫై, యాపిల్ మ్యూజిక్, ఆడియో మ్యాక్... మొదలైన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మ్యూజిషియన్‌లుగా మారుతున్నారు...
శ్రోతలు సంగీతం వినే విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా మార్పు వచ్చింది. ఇంటర్నెట్ యూజర్‌లను దృష్టిలో పెట్టుకొని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది ఫోనోగ్రాఫిక్ ఇండస్ట్రీ(ఐఎఫ్‌పీఐ) చేసిన సర్వేలో 78 శాతం మంది స్ట్రీమింగ్ సర్వీసుల ద్వారా మ్యూజిక్‌ను వింటున్నట్లు తెలిసింది. అందులో యువతరం ఎక్కువ. అయితే యువతరంలో కొంతమంది సంగీతాన్ని విని ఎంజాయ్ చేయడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. తమను ప్రపంచానికి పరిచయం చేసుకునే వేదికలుగా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకుంటున్నారు.
‘మన్ మేరీ జాన్’ పాటతో అపర్ణ కుమార్ చందెల్ అలియాస్ కింగ్ ‘టాప్ 50 చార్ట్స్’లో మొదటి స్థానంలో నిలిచి వైరల్ సెన్సేషన్ అయ్యాడు. నాన్–ఫిల్మ్ ఇండియన్ మ్యూజిక్ ఆ స్థాయిలో ప్రాచుర్యం పొందడం అరుదు. అపర్ణ కుమార్ ఇప్పుడు ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ స్పాటిఫై మోస్ట్ పాపులర్ ఆర్టిస్ట్‌లలో ఒకరు. కొన్ని సంవత్సరాల క్రితం శ్రోతగా స్పాటిఫైకి దగ్గరయ్యాడు అపర్ణ కుమార్.
కొత్త ఆర్టిస్ట్‌ల గురించి తెలుసుకోవడంలో, వారి నుంచి స్ఫూర్తి పొందడంలో అపర్ణ కుమార్‌కు ఉపయోగపడిన ప్లాట్‌ఫామ్‌లలో స్పాటిఫై ఒకటి. మూడు సంవత్సరాల క్రితం ఈ ర్యాపర్ తన తొలి ఆల్బమ్ ‘కార్నివాల్’తో క్రియేటర్‌గా మారాడు. అతడి ‘తు ఆకే దేఖ్లే’ పాట వైరల్‌గా మారింది. ‘స్పాటిఫై ద్వారా శ్రోతలు ఎలాంటి పాటలు వినడానికి ఇష్టపడుతున్నారో సులభంగా అవగాహన చేసుకోవచ్చు’ అంటున్నాడు అపర్ణ కుమార్. కుమార్‌కు మాత్రమే కాదు ఎంతోమంది యంగ్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌లకు స్పాటిఫైలాంటి ప్లాట్‌ఫామ్‌ల క్రియేటర్–సెంట్రిక్ అప్రోచ్ వరంలా మారింది.
పెద్ద ప్రాజెక్ట్‌లు వచ్చేలా చేయడంలో, మ్యూజిక్‌ను కెరీర్ ఆప్షన్‌గా మలుచుకోవడంలో, ప్రపంచానికి వారి ప్రతిభను పరిచయం చేయడంలో స్పాటిఫైలాంటి ప్లాట్‌ఫామ్‌లు యూత్‌కు ఉపయోగపడుతున్నాయి. ‘ఒకప్పుడు యంగ్ ఆర్టిస్ట్‌లు తమ గురించి తాము తెలుసుకోలేకపోయేవారు. తమ సంగీతాన్ని వినడానికి ఎవరు ఇష్టపడుతున్నారు? ఎలాంటి సంగీతం చేయాలి? అనే విషయంలో స్పష్టత ఉండేది కాదు. ఈ పరిస్థితిలో మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు మార్పు తీసుకువచ్చాయి.
స్పాటిఫై ఫర్ ఆర్టిస్ట్ యాప్ ద్వారా తమకు ఎలాంటి మ్యూజిక్ ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడదు... అనేది అర్థం చేసుకోవడానికి వీలవుతుంది’ అంటుంది చెన్నైకి చెందిన సంగీత ప్రేమికురాలు నిధి. ‘మ్యూజిక్ ఇండస్త్రీలో చాలా మార్పులు వచ్చాయి. బడ్డింగ్ మ్యూజిషియన్‌లు తమ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇప్పుడు ఎన్నో సోషల్ మీడియా అప్లికేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఒకరు పాపులర్ కావడానికి సినిమా మాధ్యమమే ఏకైకమార్గం అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ హవా నడుస్తోంది.
ఔత్సాహికులు తమ మ్యూజిక్ టాలెంట్‌ను పరిచయం చేసుకోవడానికి యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి ఎన్నో వేదికలు ఉన్నాయి’ అంటున్నాడు ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ సలీమ్ మర్చెంట్. మ్యూజిక్ కంపోజర్‌గా మంచి పేరు తెచ్చుకుంది కోల్‌కత్తాకు చెందిన అలోక దాస్‌గుప్తా. చిన్న వయసు నుంచే మ్యూజిక్ కంపోజ్ చేసేది. అయితే తాను కంపోజ్ చేసింది ఎవరికైనా వినిపించాలంటే భయంగా ఉండేది. కెనడా యార్క్ యూనివర్శిటీలో మ్యూజిక్ పెరఫార్‌మెన్స్ అండ్ కంపోజిషన్‌లో డిగ్రీ చేసినా తనమీద తనకు నమ్మకం కలగడానికి ఆలోక దాస్‌గుప్తాకు కొంత సమయం పట్టింది.
‘స్పాటిఫై లాంటి ప్లాట్‌ఫామ్స్ యువ ఆర్టిస్ట్‌లకు గట్టి ధైర్యాన్ని ఇస్తున్నాయి’ అంటుంది అలోకదాస్ గుప్తా. ముంబైకి చెందిన సౌమ్య శ్రీరాగకు లీడింగ్ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌పై మంచి అవగాహన ఉంది. భవిష్యత్‌లో మ్యూజిషియన్‌గా రాణించాలనేది ఆమె కల. ‘నా ప్రయత్నంలో విజయం సాధిస్తానా? లేదా? అనేది తెలియదుకాని గట్టి ప్రయత్నమైతే చేయాలనుకుంటున్నాను’ అంటున్న శ్రీరాగకు ప్లే బ్యాక్ సింగర్ నికిత గాంధీ ఇచ్చిన సలహా ‘ఏదో ఒకటి రాస్తూనో, కంపోజ్ చేస్తూనో ఉండాలి. అవి బాగున్నాయా? లేదా– అనేది రెండో విషయం.
ముందు మన సంతోషం కోసం చేస్తే చాలు’. సంగీతాన్ని వినే అవకాశమే కాదు విశ్లేషించే అవకాశం కూడా ఇస్తున్నాయి కొన్ని ప్లాట్‌ఫామ్స్. మ్యూజిక్ స్ట్రీమింగ్ అండ్ డిస్కవరీ ప్లాట్‌ఫామ్ ‘ఆడియోమ్యాక్’ సబ్‌స్రైబర్‌లకు తమ ఫేవరెట్ ఆర్టిస్ట్‌ల ఆల్బమ్‌లను విశ్లేషించే అవకాశం ఇచ్చింది. శ్రోతలకు నచ్చేలా, మెచ్చేలా మ్యూజిక్ ఇండస్ట్రీ వ్యూహాల మాట ఎలా ఉన్నా... ప్రతి అవకాశాన్ని, ప్రతి ఫీచర్‌ని తమలోని సంగీత ప్రతిభను మెరుగు పెట్టుకోవడానికి యువతరం ఉపయోగించుకుంటుంది.
వివిధ మాధ్యమాల ద్వారా ట్రెండ్స్‌ను ఫాలో కావడమే కాదు క్రియేట్ చేస్తుంది యువతరం.
యంగర్ జనరేషన్ ఏం వింటుంది, దేనికి కనెక్ట్ అవుతుంది అనేదానిపై మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ఫిల్మ్ మ్యూజిక్ మాత్రమే కాదు ఇండిపెండెంట్ మ్యూజిక్ వినడానికి కూడా శ్రోతలు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ మ్యూజిక్‌తో వివిధ మాధ్యమాల ద్వారా తమను తాము నిరూపించుకునే అవకాశం యువ కళాకారులకు ఉంది.
– అసీస్ కౌర్, ఫేమస్ స్పాటిఫై సింగర్‌ఇండిపెండెంట్ మ్యూజిక్
(చదవండి: పాటే కథలా!.. సరికొత్త మ్యూజిక్ తరాన!)
Comments
Please login to add a commentAdd a comment