వెంటాడే పాట...
హాలీవుడ్ సినిమా / ఆగస్ట్ రష్ (2007)
నువ్వు ఎప్పుడైనా విన్నావా సంగీతాన్ని? వాయిద్యాల నుంచో కంఠస్వరాల నుంచో కాకుండా ప్రకృతి నుంచి వినబడుతున్న పాటని - చెవులతో కాకుండా మనసుతో వినే ప్రయత్నాన్ని ఎప్పుడన్నా చేశావా? గాలి నుంచి, వెలుతురు నుంచి, ఇంద్రధనుస్సు నుంచి, పచ్చని చేల మీదుగా ఓ పాట ఎప్పుడూ వినబడుతూ ఉంటుంది. పాట ఓ జ్ఞాపకం. పెదవుల చివర్లు రుచి చూసే కన్నీటి ఉప్పదనం - కళ్లని చందమామల్లా వెలిగించే గొప్ప సంతోషం.
అమ్మ పాడిన జోలపాట కావచ్చు; నాన్న నేర్పిన పద్యమో, సినిమా పాటో కావచ్చు. జీవితానికి అంతకుమించిన కీర్తనలేం కావాలి? ఒక్కోసారి పాట.. తప్పిపోయిన జీవితాలకు పెనవేసుకునే పేగుబంధం కావచ్చు. ఆ పాట విన్నవాడు, అనుభవించినవాడు ఓ పదేళ్ల పసివాడు ‘ఆగస్ట్ రష్’.ఆ కుర్రాడు దుమ్ముపట్టిన గిటార్ తీగెలను చేతివేళ్లతో మీటుతుంటే రేగే దుమ్ముని పక్కన పెట్టండి - తీగెలు పసిపిల్లల్లా కేరింతలు కొడుతుంటాయి. సంగీతం తరంగాలుగా ఎగిరెగిరి పడుతుంటుంది.
ఆ కుర్రాడి అసలు పేరు ఇవాన్ టేలర్. ఊహ తెలిసేటప్పటికి ఓ అనాథ శరణాలయంలో పెరుగుతున్నాడు. అక్కడా ఎంతో కాలం ఉండలేదు. అసలు తనెవరు? అనాథ ఎందుకు అయ్యాడు? ఏ గురువు నేర్పకుండానే సంగీతం శ్వాసగా, శాశ్వత నేస్తంగా ఎలా కాగలిగింది? ఈ ప్రశ్నలకు జవాబులు వెదకడం ప్రారంభించాడు. తన పాటే తనని తల్లిదండ్రుల దగ్గరికి చేరుస్తుందని బలంగా నమ్మాడు. మరోవైపు అతని తల్లి లైలా పుట్టిన వెంటనే దూరమైన కొడుకు కోసం వెదుకుతోంది. ఆమె కోసం ఆమె ప్రియుడు, ఇవాన్ తండ్రి లూయీస్ అన్వేషిస్తున్నాడు. ఈ థీమ్‌తో సంగీత భరితంగా ప్రేమకోసం సాగిన ఓ అన్వేషణే ‘ఆగస్ట్ రష్’ చిత్రం.
క్రిస్టీన్ షెర్డీన్ ఐర్లాండ్‌కి చెందిన యువతి. చిన్నప్పటి నుంచి సినిమాలంటే విపరీతమైన పిచ్చి. సున్నితమైన భావోద్వేగాలతో సినిమా రూపొందించాలనే ఆమె ఆలోచనకి నిక్ కాసిల్, జేమ్స్ విహర్డ్, పాల్ క్యాస్ట్రో అందించిన స్క్రిప్ట్ బలంగా నిలిచింది.
లైలా ఓ గాయని. లూయీస్ కానెల్లీ ఐరిష్ రాక్ బ్యాండ్‌లో పేరున్న సంగీత కళాకారుడు. ఇద్దరూ అనుకోకుండా వారి సంగీత కచేరీల తర్వాత కలుసుకున్నారు. సరదాగా కొంతసేపు గడిపారు. ఎవడో రోడ్డుమీది గాయకుడు ఆలపించిన పాట వింటూ, రొమాన్స్‌లో మునిగి తేలారు. తండ్రి అదుపాజ్ఞల్లో ఉండే లైలా ఆ మరుసటి ఉదయమే తన దారిన తాను వెళ్లిపోయింది. కొంతకాలానికే తను గర్భవతి అని తెలుసుకుంది. ప్రమాదవశాత్తూ, తొమ్మిది నెలల కన్నా ముందుగానే ప్రసవించింది. ఆమె తండ్రి ఆ పసికందుని అనాథగా వదిలేశాడు. ఆ కుర్రాడికి అనాథ శరణాలయం ఇవాన్ టేలర్ అని పేరు పెట్టింది.
వాడికి చిన్నప్పటినుంచి సంగీతమంటే పిచ్చి. ప్రతి శబ్దంలోనూ ఏదో రాగం వింటుంటాడు. తోటి అనాథలు - ఆ అనాథ శరణాలయం నుంచి వెళ్లిపోతే - ఇవాన్ తన తల్లిదండ్రుల్ని వెదుక్కోవచ్చనే సలహా ఇచ్చారు. ఇవాన్ ఆ మాట నమ్మి న్యూయార్క్ నడిరోడ్ల మీదికొచ్చాడు. ఎప్పటికైనా తన పాటే తన తల్లిదండ్రుల దగ్గరికి చేరుస్తుందని ఇవాన్ నమ్మకం. అలాంటి పరిస్థితుల్లో వాలెస్ అనే ఓ వీధి పాటగాడు పరిచయమయ్యాడు. అనాథలైన పిల్లలందర్నీ చేరదీసి, వారికి కాస్తో కూస్తో సంగీతం నేర్పించి, వాళ్లచేత రోడ్లమీద పాటలు పాడించి, ఆ వచ్చే డబ్బు తను సొంతం చేసుకుంటుంటాడు వాలెస్. ఇవాన్ బాల మేథావి అని గ్రహించి, ఆ కుర్రాడి పేరు ‘ఆగస్ట్ రష్’గా మారుస్తాడు వాలెస్.
లైలాకి ఆమె తండ్రి చనిపోతూ ఆమెకో కొడుకు ఉన్నాడనే నిజం చెప్పి, కన్నుమూస్తాడు. లైలా కొడుకుని వెదుక్కుంటూ న్యూయార్క్ చేరుకుంటుంది. మరోవైపు లూయీస్ కూడా లైలాని వెదుక్కొంటూ తిరుగుతుంటాడు.
‘ఆగస్ట్ రష్’ పాత్రలో ఫ్రెడీ హైమార్ అద్భుతంగా నటించగా, రాబిన్ విలియమ్స్ మాక్సెల్ వాలెస్ అనే దుష్ట పాత్రకి జీవం పోశాడు. ‘ఆగస్ట్ రష్’ తల్లిదండ్రులుగా కెరీ రస్సెల్, జొనాథన్ నటించారు.
♦ ఈ సినిమాకి సంగీతం ప్రాణం. అందుకే చిత్ర సంగీత దర్శకుల్లో ఒకరైన మార్క్ మాన్సినా ఏడాదిన్నర పాటు ఈ సినిమా కంపోజింగ్‌కి సమయం వెచ్చించాడు.
♦ ఇదే కథని ‘బ్రాడ్‌వే’లో సంగీత నృత్య రూపకంగా ప్రదర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు.
♦ 25 మిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా 65 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
♦ తెలుగులో ఆ మధ్యకాలంలో ఓ స్టార్ హీరో కుమారుడితో ఈ ‘ఆగస్ట్ రష్’ ఆధారంగా సినిమా రూపొందించే ప్రయత్నం చేశారు. కాని కార్యరూపం దాల్చలేదు.
ఇవాన్ ప్రతిభతో విపరీతంగా డబ్బు సంపాదించవచ్చని వాలెస్ ఆశపడతాడు. అందుకే ఇవాన్ ఫొటోతో ‘కనబడుట లేదు’ అని వేసి పోస్టర్లన్నింటినీ చింపేస్తాడు. ఒక దశలో వాలెస్ పోలీసులకి దొరికిపోతాడు.
♦ సెంట్రల్ పార్క్‌లో జరుగుతున్న సంగీత కార్యక్రమంలో తను పాలుపంచుకోవాలనుకుంటాడు ఇవాన్.
♦ అదే పార్క్‌లో లైలా కూడా సంగీత కచేరీకి హాజరవుతుంది. లైలా పోస్టర్ చూసి ఆ కార్యక్రమానికి లూయీస్ కూడా వస్తాడు. ఎలాగైనా ఆ కార్యక్రమంలో పాట పాడాలనుకునే ఆగస్ట్ రష్‌కి అడ్డం తగులుతాడు వాలెస్.
♦ ఆ అడ్డంకులు తొలగించుకుని -పాట పాడతాడు ఆగస్ట్ రష్. ఆ పాట లూయీస్, లైలాలకి అతను తమ బిడ్డే అని గుర్తుచేసింది. ముగ్గురూ కలుసుకున్నారు. కథ సుఖాంతం. - తోట ప్రసాద్