ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020) రెండో త్రైమాసికంలో అమెరికన్ టెక్ దిగ్గజాలు ప్రోత్సాహకర ఫలితాలు సాధించాయి. ఫాంగ్(FAANG) కంపెనీలుగా ప్రసిద్ధమైన ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్ గురువారం క్యూ2(ఏప్రిల్-జూన్) ఫలితాలు ప్రకటించాయి. మార్కెట్లు ముగిశాక ఫలితాలు విడుదలకావడంతో ఫ్యూచర్స్‌లో ఈ కౌంటర్లు భారీగా లాభపడ్డాయి. ఫలితాల తీరు, షేర్ల జోరు చూద్దాం..
అమెజాన్
క్యూ2లో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ 26ఏళ్ల చరిత్రలో అత్యధిక లాభాలు ఆర్జించింది. 5.2 బిలియన్ డాలర్ల నికర లాభం సాధించింది. ఆన్‌లైన్ అమ్మకాలు, థర్డ్‌పార్టీ మర్చంట్స్ తదితరాలు ఇందుకు సహకరించాయి. దీంతో ఈ షేరు 5 శాతం జంప్‌చేసింది. మొత్తం ఆదాయం సైతం దాదాపు 89 బిలియన్ డాలర్లకు చేరింది. లాక్‌డవున్ కారణంగా ఆన్‌లైన్ విక్రయాలు పెరగడంతో ఇటీవల 1.75 లక్షల మంది సిబ్బందిని నియమించుకున్న కంపెనీ సర్వీసులను మరింత విస్తరించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ అమెజాన్ షేరు 60 శాతంపైగా ర్యాలీ చేయడంతో కంపెనీ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగారు. కాగా.. క్యూ3లోనూ అమెజాన్ 87-93 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేస్తుండటం గమనార్హం!
యాపిల్ ఇంక్
లాక్‌డవున్‌లోనూ ఐఫోన్ల దిగ్గజం యాపిల్ క్యూ3(ఏప్రిల్-జూన్)లో పటిష్ట ఫలితాలు సాధించింది. ఐప్యాడ్లు, మ్యాక్ కంప్యూటర్ల విక్రయాలు సైతం పెరగడంతో యాపిల్ షేరు ఫ్యూచర్స్‌లో 6 శాతం జంప్‌చేసింది. ప్రధానంగా ఐఫోన్ల అమ్మకాల ద్వారా 26.4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించింది. ఇది అంచనాలకంటే 4 బిలియన్ డాలర్లు అధికంకావడం గమనార్హం! 399 డాలర్ల విలువగల ఐఫోన్ ఎస్‌ఈ అమ్మకాలు ఇందుకు సహకరించింది. వాచీల అమ్మకాలు 17 శాతం జంప్‌చేసి 6.5 బిలియన్ డాలర్లకు చేరాయి. క్యూ2లో మొత్తం ఆదాయం దాదాపు 60 బిలియన్ డాలర్లకు చేరింది. 2.58 డాలర్ల ఈపీఎస్ సాధించింది. యాపిల్ షేరు 400 డాలర్లను అధిగమించడంతో 4:1 నిష్పత్తిలో షేర్ల విభజనను ప్రతిపాదించింది.
ఫేస్‌బుక్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఇంక్ క్యూ2లో అంచనాలు మించుతూ 11 శాతం అధికంగా 18.3 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. నికర లాభం 5.2 బిలియన్ డాలర్లుకాగా.. ఈపీఎస్ 1.8 డాలర్లకు ఎగసింది. నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 2.7 బిలియన్లను తాకింది. దీంతో ఫ్యూచర్స్‌లో ఫేస్‌బుక్ షేరు 7 శాతం దూసుకెళ్లింది. జులైలో ప్రకటనల ఆదాయం 10 శాతం పుంజుకోవడంతో క్యూ3లోనూ ఇదే విధమైన పనితీరు చూపగలమని కంపెనీ అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment