ఫాంగ్‌.. అందుకో ఆఫర్‌! | FAANG Jobs: Recruitment, Eligibility, Job Skills, Coding, Resume | Sakshi
Sakshi News home page

ఫాంగ్‌.. అందుకో ఆఫర్‌!

Published Wed, Jul 14 2021 5:18 PM | Last Updated on Wed, Jul 14 2021 6:01 PM

FAANG Jobs: Recruitment, Eligibility, Job Skills, Coding, Resume - Sakshi

ఫాంగ్‌(ఎఫ్‌ఏఏఎన్‌జీ).. ఫేస్‌బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్‌లకు సంక్షిప్త నామం. ఇవి అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలు. మార్కెట్లో వృద్ధి పరంగా.. ప్రగతిపథంలో పయనిస్తున్న టాప్‌ కంపెనీలు! అమెరికాకు చెందిన ఈ టెక్‌ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య వేలల్లో ఉంటుంది. ఫాంగ్‌ కంపెనీల్లో కొలువు దక్కితే..ఆకర్షణీయ వేతనాలతోపాటు ఎదిగేందుకు ఆకాశమే హద్దు అనే అభిప్రాయం!! అందుకే టాప్‌ ఐఐటీలు మొదలు.. స్థానిక ఇంజనీరింగ్‌ కాలేజీల విద్యార్థుల వరకూ.. ప్రతి ఒక్కరికీ ఫాంగ్‌ కంపెనీల్లో నియామకాలపై ఎంతో ఆసక్తి. ఈ నేపథ్యంలో.. ఫేస్‌బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్‌లో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ.. అవసరమైన అర్హతలు, నైపుణ్యాలపై ప్రత్యేక కథనం.. 

బీటెక్‌ పూర్తయ్యాక.. మీ డ్రీమ్‌ కంపెనీ ఏది అని అడిగితే.. ఎక్కువ మంది నుంచి టక్కున వచ్చే సమాధానం.. గూగుల్, ఫేస్‌బుక్‌! తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో.. ఉద్యోగార్థులకు ఆకర్షణీయ సంస్థల జాబితాలో మొదటి రెండు స్థానాల్లో అమెజాన్, గూగుల్‌ నిలిచాయి. ఫాంగ్‌గా పేర్కొనే ఫేస్‌బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్‌.. ఆన్‌క్యాంపస్, ఆఫ్‌క్యాంపస్‌ విధానాల్లో నియామకాలు జరుపుతున్నాయి. ఆఫ్‌–క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌ కోసం ముందుగా తమ సంస్థల వెబ్‌సైట్స్‌ ద్వారా ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్నాయి. ఆయా ప్రకటనల ఆధారంగా అభ్యర్థులు తమ రెజ్యుమే ఆన్‌లైన్‌లో పంపించాల్సి ఉంటుంది.


ఫేస్‌బుక్‌.. ఫేస్‌ చేయాలంటే!

►ఫేస్‌బుక్‌ అభ్యర్థుల్లో కోర్‌ నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తూనే.. క్రియేటివిటీకి పెద్దపీట వేస్తుంది. ఫేస్‌బుక్‌ ఎంపిక ప్రక్రియ నాలుగైదు వారాలపాటు సుదీర్ఘంగా కొనసాగుతుంది. 

► దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రెజ్యుమే ఆధారంగా ముందుగా టెలిఫోన్‌ సంభాషణ జరుగుతుంది. ఇందులో అభ్యర్థుల లక్ష్యాలు, అభిరుచులు, సంస్థలో ఉద్యోగంపై ఉన్న వాస్తవ ఆసక్తిని తెలుసుకుంటారు. ఆ తర్వాత టెలిఫోనిక్‌ లేదా వీడియో విధానంలో మరో రెండు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీటిలో విజయం సాధిస్తే.. సంస్థ కార్యాలయంలో జరిగే ఎంపిక ప్రక్రియకు హాజరు కావాలని సూచిస్తారు. ఇక్కడ మరో మూడు లేదా నాలుగు రౌండ్లలో రిటెన్, ఓరల్‌ టెస్ట్‌లు ఉంటాయి. 

► రిటెన్‌ టెస్ట్‌ల్లో కోడింగ్‌కు సంబంధించి రెండు లేదా మూడు ప్రశ్నలు ఇచ్చి.. వాటిని పరిష్కరించమని అడుగుతారు. ఇందుకు అరగంట నుంచి గంట వరకు సమయం ఇస్తారు. ఈ దశ దాటిన వారిని ఇంటర్వ్యూ రౌండ్స్‌ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూలు టెలిఫోనిక్‌ లేదా వీడియో కాల్స్‌ రూపంలో ఉంటాయి. ఒక్కో రౌండ్‌ ఇంటర్వ్యూ దాదాపు 45 నిమిషాలపాటు జరుగుతుంది. ఫేస్‌బుక్‌ మూడు రకాల ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. అవి.. కోడింగ్‌ ఇంటర్వ్యూ, డిజైన్‌ ఇంటర్వ్యూ, బిహేవియరల్‌ ఇంటర్వ్యూ.

► కోడింగ్‌ ఇంటర్వ్యూ కొన్ని సందర్భాల్లో రాత పరీక్ష రూపంలో ఉంటోంది. అభ్యర్థుల్లోని కోడింగ్‌ నైపుణ్యాలు పరిశీలించేలా ఈ పరీక్ష నిర్వహిస్తారు. తొలి దశలో నిర్వహించే కోడింగ్‌ పరీక్షతో పోల్చితే ఇది కొంత క్లిష్టంగా ఉంటుంది. దాదాపు అరగంట వ్యవధిలో జరిగే ఈ కోడింగ్‌ ఇంటర్వ్యూలో చివరి అయిదు నుంచి పది నిమిషాలు అభ్యర్థులను మౌఖికంగా పరీక్షించేందుకు కేటాయిస్తారు.

► డిజైన్‌ ఇంటర్వ్యూ రౌండ్‌లో..సిస్టమ్‌ డిజైన్‌ లేదా నిర్దిష్టంగా ఒక ప్రొడక్ట్‌ డిజైన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. డిజైన్‌ ప్రిన్సిపుల్స్, అభ్యర్థులు అప్పటికే చేసిన డిజైన్స్‌పై ప్రశ్నలు అడుగుతారు.

► బిహేవియరల్‌/కల్చరల్‌ ఫిట్‌ ఇంటర్వ్యూలో.. అభ్యర్థుల దృక్పథాన్ని, లక్షణాలను పరీక్షిస్తారు. లక్ష్యాలు, ప్రొఫైల్, నేపథ్యం, విలువలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. వీటికి అభ్యర్థులు ఇచ్చే సమాధానాలతో ఇంటర్వ్యూ ప్యానెల్‌ సంతృప్తి చెందితే.. ఫేస్‌బుక్‌ కొలువు ఖరారైనట్లే!!


అమెజాన్‌.. ఆఫర్లు అందుకోండిలా!

► అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో ఎంపిక ప్రక్రియ గరిష్టంగా మూడు వారాలపాటు కొనసాగుతుంది. అభ్యర్థులకు ఐదు నుంచి ఆరు రౌండ్లలో ఇంటర్వ్యూలు, రాత పరీక్షలు నిర్వహిస్తారు. 

► ముందుగా అభ్యర్థుల రెజ్యుమేను పరిశీలిస్తారు. దరఖాస్తు చేసుకున్న పోస్ట్‌కు సరితూగుతారని భావిస్తే.. ఎంపిక ప్రక్రియకు పిలుపు వస్తుంది. 

► తొలుత రిటెన్‌/ఆన్‌లైన్‌ కోడింగ్‌ రౌండ్స్‌తో ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది.

► రిటెన్‌/ఆన్‌లైన్‌ కోడింగ్‌ రౌండ్స్‌లో..అభ్యర్థుల్లోని టెక్నికల్‌ స్కిల్స్, తార్కిక విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించేలా రాత పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధానంగా అప్టిట్యూడ్,టెక్నికల్‌ నాలెడ్జ్, ప్రోగ్రామింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. 

► రాత పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఆన్‌లైన్‌ కోడింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ ఆన్‌లైన్‌ కోడింగ్‌ రౌండ్‌లో..ఆపరేటింగ్‌ సిస్టమ్స్, ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్‌పై ప్రశ్నలు అడుగుతారు.

► రిటెన్‌/ఆన్‌లైన్‌ కోడింగ్‌ టెస్ట్‌ రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి. తొలి టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూలో అభ్యర్థుల రెజ్యుమే, పూర్తిచేసిన ప్రాజెక్ట్‌ల వివరాలు తెలుసుకుంటారు. టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ తర్వాత ప్రత్యక్ష ఇంటర్వ్యూలకు(ఆన్‌సైట్‌ ఇంటర్వ్యూ) పిలుస్తారు. 

► మొదటి ఇంటర్వ్యూ అభ్యర్థుల్లోని అల్గారిథమ్‌ నైపుణ్యాలను తెలుసుకునేలా ఉంటుంది. తర్వాత రౌండ్‌లోనూ ఇవే నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల క్లిష్టత స్థాయి కొంత ఎక్కువగా ఉంటుంది.

► ఆ తర్వాత హెచ్‌ఆర్‌/హైరింగ్‌ మేనేజర్‌ రౌండ్స్‌ పేరిట ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. హైరింగ్‌ మేనేజర్‌ రౌండ్‌ ఇంటర్వ్యూని పూర్తిగా టెక్నికల్‌ రౌండ్‌గా పేర్కొనొచ్చు. ఇందులో డేటాస్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, కొన్ని క్లిష్టమైన పజిల్స్‌పై ప్రశ్నలు అడుగుతారు. ఇందులో విజయం సాధిస్తే.. చివరగా బార్‌ రైజర్‌ రౌండ్‌ ఉంటుంది.
 
► బార్‌ రైజర్‌ రౌండ్‌లో.. సంస్థ దీర్ఘకాలిక ప్రణాళికలకు అనుగుణంగా సదరు అభ్యర్థి సరితూగుతారో లేదో పరిశీలిస్తారు. అంతిమంగా సంస్థ హెచ్‌ఆర్‌ కమిటీ.. తొలిదశ నుంచి అభ్యర్థుల ప్రతిభను అన్ని కోణాల్లో పరిశీలించి..నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తారు. ఈ నివేదిక ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. 


యాపిల్‌.. ప్రిపేర్‌ వెల్‌

► యాపిల్‌ ఎంపిక ప్రక్రియలో.. ముందుగా సంబంధిత ఉద్యోగ ప్రకటనను అనుసరించి వచ్చిన దరఖాస్తుల స్క్రీనింగ్‌ మొదలవుతుంది.

► స్క్రీనింగ్‌లో భాగంగా తొలుత అభ్యర్థుల ప్రొఫై ల్‌ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. ఇవి ప్రధానంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి సదరు ఉద్యోగానికి సరితూగుతాడా అనేది తెలుసుకోవడంతోపాటు అకడమిక్‌ నేపథ్యంపైనా ప్రశ్నలు ఉంటాయి. 

► ఆ తర్వాత టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో సంతృప్తికరంగా సమాధానాలిస్తే.. ఆ తర్వాత మూడు లేదా నాలుగు రౌండ్లలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. వీటిల్లో టెక్నికల్, హెచ్‌ఆర్‌ రౌండ్లు ఉంటాయి. 

► టెక్నికల్‌ ఇంటర్వ్యూలు రెండు రౌండ్లలో నిర్వహిస్తారు. వీటిలో ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌పై ప్రశ్నలు అడుగుతారు. ఇందులో విజయం సాధిస్తే.. హెచ్‌ఆర్‌ రౌండ్‌ ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సి ఉంటుంది. 

► హెచ్‌ఆర్‌ రౌండ్‌ ఇంటర్వ్యూలో.. టెక్నికల్, పర్సనల్, అకడమిక్‌ ప్రొఫైల్‌ సంబంధిత ప్రశ్నలు అడుగుతారు. 

► కొన్ని సందర్భాల్లో గ్రూప్‌ డిస్కషన్స్‌తో ఇంటర్వ్యూ ప్రక్రియ మొదలవుతుంది. 15 మంది అభ్యర్థులను ఒక బృందంగా ఏర్పాటు చేసి.. సామాజిక సంబంధిత అంశాలపై చర్చించమని అడుగుతారు. ఆ తర్వాత టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ జరుగుతుంది. అనంతరం మరోసారి టెక్నికల్, హెచ్‌ఆర్‌ రౌండ్‌ ఇంటర్వ్యూలు, రిటెన్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు. 

► వీటన్నింటిలోనూ విజయం సాధిస్తే.. ఉద్యోగ విధులు, వేతనాలు, ఇతర ప్రోత్సాహకాలు, నిబంధనల గురించి తెలియజేసి.. అభ్యర్థుల సమ్మతిని తెలుసుకుంటారు. దాని ఆధారంగా ఆఫర్‌ లెటర్‌ పంపిస్తారు. 

► కంపెనీ అవసరాలు, కోరుకునే నైపుణ్యాలపై అవగాహన పెంచుకొని.. సమగ్ర ప్రిపరేషన్‌తో ఎంపిక ప్రక్రియకు హాజరైతే.. యాపిల్‌ కొలువు సొంతం చేసుకోవచ్చు.


నెట్‌ఫ్లిక్స్‌.. కెరీర్‌ ఫిక్స్‌

► ఓటీటీ ప్రపంచంలో పేరున్న నెట్‌ఫ్లిక్స్‌ సంస్థలో కొలువు ఖరారు చేసుకోవాలంటే.. ముందుగా సంస్థ వెబ్‌సైట్‌ లేదా జాబ్‌ పోర్టల్స్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► కంపెనీ జాబ్‌ నోటిఫికేషన్‌కు అనుగుణంగా వచ్చిన దరఖాస్తులను హెచ్‌ఆర్‌ ప్రతినిధులు పరిశీలించి.. తొలుత టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థులు సదరు ఉద్యోగానికి సరితూగుతారా, వారి అకడమిక్‌ నేపథ్యం, అన్వయ సామర్థ్యాలను పరిశీలిస్తారు. 

► ఆ తర్వాత దశలో ముఖాముఖి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థులు టెక్నికల్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌లకు కూడా హాజరవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న జాబ్‌ రోల్‌ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు.

► ఈ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా హెచ్‌ఆర్‌ ప్రతినిధులు అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని,పని సంస్కృ తికి సరితూగే దృక్పథాన్ని పరిశీలించి.. సంబంధిత విభాగానికి సిఫార్సు చేస్తారు. విభాగాధిపతుల నిర్ణయం మేరకు ఆఫర్‌ ఖరారవుతుంది.


గూగుల్‌ను... గెలవాలంటే

► అంతర్జాతీయంగా ఉద్యోగార్థుల క్రేజీ కంపెనీ గూగుల్‌.. అభ్యర్థుల అకడమిక్‌ నైపుణ్యాలతోపాటు అంకిత భావం, నేర్చుకోవాలనే తపనకు నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తోంది. 

► గూగుల్‌ సంస్థలో.. దరఖాస్తు నుంచి ఆఫర్‌ లెటర్‌ వరకు దాదాపు ఆరు వారాల పాటు ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది.

► ముందుగా సంస్థ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులో పేర్కొన్న వివరాల ఆధారంగా సంబంధిత ఉద్యోగానికి సరితూగుతారో, లేదో పరిశీలిస్తారు. 

► ఉద్యోగానికి సరితూగుతారనుకునే అభ్యర్థులను స్టాఫింగ్‌ టీమ్‌ సభ్యులు సంప్రదించి.. ఎంపిక ప్రక్రియకు సిద్ధంగా ఉండాలని సూచిస్తారు. 

► ఎంపిక ప్రక్రియలో భాగంగా కోడింగ్‌ క్విజ్, ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌కు సంబంధించి ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూల ప్రక్రియ మొదలవుతుంది.

► ఇంటర్వ్యూలు ప్రారంభానికి ముందే ఫోన్‌ లేదా వీడియో ద్వారా వర్చువల్‌ చాటింగ్‌ విధానంలో హెచ్‌ఆర్‌ ప్రతినిధులు, హైరింగ్‌ మేనేజర్లు చిన్నపాటి చర్చ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థుల్లోని స్కిల్స్‌ను గుర్తించడంతోపాటు దరఖాస్తు చేసుకున్న జాబ్‌ రోల్‌కు సరితూగుతారా, లేదా? అని పరిశీలిస్తారు. 

► కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూ ప్రారంభానికి ముందే చిన్నపాటి ప్రాజెక్ట్‌ వర్క్‌లు పూర్తి చేయమని అడుగుతారు. నిర్దిష్టంగా ఏదైనా కేస్‌ స్టడీని పేర్కొని.. దానికి సంబంధించి కోడింగ్‌ నమూనాలు రూపొందించమంటారు.

► గూగుల్‌లో ఇంటర్వ్యూలు ఒకే రోజు మూడు, నాలుగు రౌండ్లు కూడా నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూలను స్ట్రక్చర్డ్, ఓపెన్‌ ఎండెడ్‌ కొశ్చన్స్‌గా పిలుస్తున్నారు. స్ట్రక్చర్డ్‌ ఇంటర్వ్యూల్లో టెక్నికల్‌ స్కిల్స్‌ను పరిశీలిస్తారు. ఓపెన్‌ ఎండెడ్‌ కొశ్చన్స్‌ విధానంలో అభ్యర్థులు ఒక సమస్యను ఎలా పరిష్కరిస్తారో తెలుసుకునే విధంగా ప్రశ్నలు అడుగుతారు. వీటిలో విజయం సాధిస్తే గూగుల్‌ సంస్థలో కొలువు ఖరారైనట్లే!!


ఫాంగ్‌ నియామకాలు... ముఖ్యాంశాలు

► సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ.

► అభ్యర్థుల్లోని సబ్జెక్ట్‌ నైపుణ్యాలు, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌ పరిశీలించేలా ఎంపిక ప్రక్రియ.

► ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లు, టెక్నికల్‌ టెస్ట్‌లతో అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్న సంస్థలు.

►ఫాంగ్‌ సంస్థల్లో దాదాపు ఆరు వారాల పాటు ఎంపిక ప్రక్రియ.

► క్రియేటివిటీ, లాజికల్‌ స్కిల్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్న సంస్థలు.

►టెక్నికల్‌ టెస్ట్‌లలో ప్రధానంగా కోడింగ్, ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌పై దృష్టి.

►నాన్‌–టెక్నికల్‌ ఉద్యోగాల్లో కమ్యూనికేషన్, అప్టిట్యూడ్, సాఫ్ట్‌స్కిల్స్‌ ఉన్న వారికి ప్రాధాన్యం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement