ముంబై: ఆర్థికమంత్రి ఈ నెల ఒకటవ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2022–23 వార్షిక బడ్జెట్, సెంట్రల్ బ్యాంక్ అనుసరిస్తున్న ద్రవ్య పరపతి విధానాలు భారత్ ఎకానమీ విస్తృత స్థాయి పురోగతికి బాటలు వేస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఫిబ్రవరి బులిటన్‌లో ప్రచురితమైన ఆర్టికల్ విశ్లేషించింది. మూడవ వేవ్‌ను సవాళ్లను అధిగమించిన భారత్‌లో ఆర్థిక రికవరీ ఇప్పటికే పటిష్టం అవుతోందని వివరించింది. అంతర్జాతీయంగా ఆర్థిక అంశాలుసహా వివిధ ప్రతికూలతలు కొనసాగుతున్నప్పటికీ దేశీయ ఎకానమీ పురోగమిస్తోందని ‘స్టేట్ ఆఫ్ ఎకానమీ’ థామ్‌తో ప్రచురితమైన ఆర్టికల్ పేర్కొంది. ఆర్టికల్‌లో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..
► మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి బడ్జెట్‌లో ప్రభుత్వ పెట్టుబడుల పునరుద్ధరణ వల్ల 2022–23లో ప్రైవేట్ పెట్టుబడులు కూడా గణనీయంగా పెరుగుతాయి. ఇది ఉపాధి కల్పన, డిమాండ్‌ను బలోపేతం వంటి అంశాలకూ దోహదపడుతుంది.
► మల్టీ–మోడల్ కనెక్టివిటీ, రవాణా రంగం పురోగతి ద్వారా విస్తృత స్థాయి వృద్ధిని భారత్ సాధించగలుతుంది. ఈ లక్ష్య సాధనలో గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్రణాళిక కీలకమైనది. మౌలిక సదుపాయాల పురోగతిలో ఇది కీలకమైనది.
► ప్రపంచ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ, దేశీయ స్థూల ఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయి. మూడవ వేవ్ నుంచి భారత్ బయట పడిన నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలలో పునరుద్ధరణ వేగంగా ఉంది.
► డిమాండ్, ఆశావాదం ప్రాతిపదికన తయారీ, సేవల రంగాల రెండూ విస్తరిస్తున్నాయి. వినియోగదారు, వ్యాపార విశ్వాసాన్ని మెరుగుపడ్డం కూడా కలిసివస్తోంది. వ్యాపారాలు తిరిగి సాధారణ స్థితికి వస్తుండడంతో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని విశ్వసిస్తున్నాం.
► ఈ రోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం సమస్యతో సతమతమవుతోంది. క్రూడ్‌సహా కమోడిటీల ధరలు పెరగడం, సరఫరాల్లో సమస్యలు దీనికి ప్రధాన కారణం.
► ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు ఇంకా తీవ్ర అనిశ్చితిలోనే కొనసాగుతున్నాయి. పలు అంశాలు ఇంకా సవాళ్లవైపే పయనిస్తున్నాయి.
► భారత్‌కు సంబంధించినంతవరకూ ప్రభుత్వం నుంచి అధిక వ్యయాల ప్రణాళికలు, వ్యాపారాలను సులభతరం చేయడానికి చర్యలు సానుకూల అంశాలు. ఆయా అంశాలే ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల వరుసలో భారత్‌ను మొదట నిలబెడుతున్నాయి.
► ఈ నెల ప్రారంభంలో జరిగిన ఆర్‌బీఐ పాలసీ సమావేశాల్లో ద్రవ్యోల్బణం–వృద్ధి లక్ష్యంగా ఆర్‌బీఐ వరుసగా పదవ త్రైమాసిక బేటీలోనూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఆర్‌బీఐ యథాతథంగా 4 శాతం వద్దే కొనసాగించింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని పేర్కొంది. వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని అభిప్రాయపడింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2021–22లో 9.2 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గుతుందని ఆర్‌బీఐ ఇటీవలి పాలసీ సమావేశం అంచనావేసింది.
► పెట్టుబడులకు సంబంధించి కేంద్రం మూలధన వ్యయాలు (క్యాపిటల్ అకౌంట్‌కు సంబంధించి) 35.4 శాతం పెరిగినట్లు బడ్జెట్ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఇందుకు సంబంధించి కేటాయింపులు రూ.5.54 లక్షల కోట్లయితే (సవరిత గణాంకాల ప్రకారం రూ.6.03 లక్షల కోట్లు), 2022–23లో రూ.7.50 లక్షల కోట్లకు (జీడీపీలో 2.9 శాతం) పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. వృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ కేటాయింపులకు భారీగా పెంచుతున్నట్లు తెలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే తాజా కేటాయింపులు (రూ.7.50 లక్షల కోట్లు) రెండు రెట్లు అధికమని మంత్రి తెలిపారు.
వేగవంతమైన ఆర్థికాభివృద్ధి
ఆర్థికశాఖ నెలవారీ నివేదిక స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కొత్త బడ్జెట్ (2022–23 ఆర్థిక సంవత్సరం)లో ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల వల్ల భారత్ ఆర్థిక వ్యవస్థ అగ్ర దేశాలతో పోల్చితే వేగంగా పురోగమించనుందని ఆర్థికశాఖ నెలవారీ సమీక్షా నివేదిక పేర్కొంది. కోవిడ్–19 అనంతర ప్రపంచం ఆర్థిక పరిస్థితి ఎలా ఉండాలన్న ప్రణాళికతోనే ప్రస్తుత సంవత్సరం కూడా ముగియవచ్చని నివేదిక విశ్లేషించింది. భారత్‌కు సంబంధించినంతవరకూ తయారీ, నిర్మాణ రంగాలు వృద్ధి చోదకాలుగా ఉంటాయని పేర్కొంది. పీఎల్‌ఐ, మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయాల పెంపు దేశీయ ఆర్థిక వ్యవస్థ పురోగతికి బాటలు వేస్తాయని నివేదిక విశ్లేషించింది. నివేదికలోని కొన్ని కీలకాంశాలను పరిశీలిస్తే...
► నికర విత్తన విస్తీర్ణం, పంటల వైవిధ్యీకరణలో స్థిరమైన పురోగతిని వ్యవసాయ రంగం సాధిస్తోంది. ఇది దేశ ఆహార నిల్వల పరిస్థితిని బలోపేతం చేస్తుంది. అదే సమయంలో రైతులకు కనీస మద్దతు ధరలు, ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా ఆదాయ బదిలీల వంటి అంశాలు ఈ రంగానికి లాభిస్తాయి.
► వేగవంతమైన వృద్ధి విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా భారత్‌ను తొలి స్థానంలో నిలిపిన విషయం గమనార్హం. జనవరి మొదట్లో భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారీగా 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. గత ఏడాది అక్టోబర్‌లో 9.5 శాతం అంచనాలను తాజాగా 9 శాతానికి కుదించింది. అయినా ఈ స్థాయి వృద్ధి కూడా ప్రపంచ దేశాల్లో అత్యధికమని పేర్కొంది.
► దేశంలో మూడవ వేవ్ సవాళ్లు తలెత్తినప్పటికీ, మొత్తం ఆర్థిక కార్యకలాపాలు వీటిని తట్టుకుని నిలబడ్డాయి. విద్యుత్ వినియోగం, తయారీకి సంబంధించి పర్చేజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్, ఎగుమతులు, ఈ–వే బిల్లులు వంటి వంటి అనేక హై ఫ్రీక్వెన్సీ సూచికలు బలమైన పనితీరును ప్రదర్శిస్తున్నాయి. వృద్ధి రికవరీ పటిష్టతను ఇది ప్రతిబింబిస్తోంది.
► కోవిడ్ 19 వైరస్ వల్ల కలిగిన అనిశ్చితి, ఆందోళన ప్రజల మనస్సుల నుండి తొలగిపోయిన తర్వాత, వినియోగం పుంజుకుంటుంది. డిమాండ్ పునరుద్ధరణ జరుగుతుంది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి సంబంధించి ఉత్పత్తిని పెంచడానికి ప్రైవేటు పెట్టుబడులకు విస్తృత స్థాయి అవకాశం ఏర్పడుతుంది.
► అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక అంశాలను మినహాయిస్తే, భారత్ ఆర్థిక వ్యవస్థకు 2022–23లో పలు సానుకూల అంశాలు ఉన్నాయి.
పురోగతి బాటలో ఎకానమీ
Published Thu, Feb 17 2022 2:52 AM | Last Updated on Thu, Feb 17 2022 2:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment