ముంబై: రేట్ల పెంపు ద్వారా కఠిన విధానంవైపు మొగ్గుచూపి, వృద్ధి విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వెనుకడుగు వేసిందన్న విమర్శల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి తీసుకునే చర్యలు ఎకానమీ పురోగతికి ప్రతికూలం అని భావించడం తగదని ఆయన స్పష్టం చేశారు. ఎకానమీ పురోగతి– ద్రవ్యోల్బణం కట్టడి సమతౌల్యతకు ప్రభుత్వంతో కలిసి సెంట్రల్ బ్యాంక్ తగిన అన్ని చర్యలూ తీసుకుంటుందని గవర్నర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు, ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా మే, జూన్ నెలల్లో ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను వరుసగా 0.4 శాతం, 0.5 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీనితో ఈ రేటు 4.9 శాతానికి చేరింది. అయితే దీనిపై పలు విమర్శలు వ్యక్తం అయ్యాయి. మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణ్యం ఇటీవల ఒక వ్యాసంలో ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో ఆర్‌బీఐ ఆలస్యంగా వ్యవహరించిందని, చివరకు పాలసీలో మార్పుచేసి వృద్ధి విషయంలో వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్‌బీఐపై వస్తున్న విమర్శలను పరోక్షంగా ప్రస్తావించారు.
మా నిర్ణయాలకు కట్టుబడి ఉన్నాం...
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక పరిణామాలకు అనుగుణంగా సెంట్రల్ బ్యాంక్ వ్యవహరించిందని అన్నారు. విధానం మార్పునకు తగిన కాల వ్యవధిని అనుసరించిందని స్పష్టం చేశారు. ‘‘మహమ్మారి సమయంలో అధిక ద్రవ్యోల్బణాన్ని సహించడం చాలా అవసరం. అప్పటి క్లిష్ట సమయంలో రేట్ల పెంపు ఎంతమాత్రం సమంజసం కాదు. ఆ విధానం పరిణామాలు ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా ఉంటాయి. మేము ఇప్పటికీ మేము అప్పటి మా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము’’ అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా, లోన్ రికవరీ ఏజెంట్ల విపరీత చర్యలపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన ఈ సందర్భగా హెచ్చరించారు. ఫైనాన్షియల్ రంగంలోకి గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్ (మెటా) వంటి బడా సంస్థల ప్రవేశం వల్ల కొన్ని సమస్యలు ఉంటాయని కూడా కార్యక్రమంలో గవర్నర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment