మారని రేట్లు.. వృద్ధికి చర్యలు | RBI adopts a new liquidity management framework | Sakshi
Sakshi News home page

మారని రేట్లు.. వృద్ధికి చర్యలు

Published Fri, Feb 7 2020 4:28 AM | Last Updated on Fri, Feb 7 2020 4:28 AM

RBI adopts a new liquidity management framework - Sakshi

ముంబై: వడ్డీరేట్లను ప్రభావితం చేసే కీలకమైన రెపో రేటు, రివర్స్‌ రెపో రేట్లను ఎలాంటి మార్పులూ చేయకుండా యథాతథంగా ఉంచుతున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. అయితే 11 ఏళ్ల కనిష్టానికి చేరిన ఆర్థిక వృద్ధికి మద్దతుగా బ్యాంకింగ్, రియల్టీ, ఎంఎస్‌ఎంఈ, ఆటో రంగాలకు ప్రోత్సాహక చర్యలతో ముందుకు వచ్చింది. అయితే, తన సర్దుబాటు విధానాన్ని మార్చుకోకపోవటం ద్వారా అవసరమైతే మున్ముందు రేట్ల కోతకు అవకాశం ఉంటుందని ఆర్‌బీఐ సంకేతమిచ్చింది. రుణ రేట్లను తగ్గించేందుకు వీలుగా బ్యాంకులకు రూ.లక్ష కోట్లను సమకూర్చనున్నట్టు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకటించారు.

రుణాలకు మంచి రోజులు
► సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ), ఆటోమొబైల్, గృహ రుణ వితరణ పెంపునకు వీలుగా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌) నిబంధనలను ఆర్‌బీఐ సడలించింది. దీంతో ఈ రంగాలకు అదనంగా ఇచ్చే రుణాల విషయంలో బ్యాంకులు 4 శాతాన్ని సీఆర్‌ఆర్‌ రూపంలో పక్కన పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇది ఈ ఏడాది జూలై వరకు అమల్లో ఉంటుంది. ఇది బ్యాంకులకు సానుకూలం. ఎందుకంటే ఇలా మిగిలిన నిధులను రుణాలివ్వటానికి వినియోగించవచ్చు.

► దేశాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఎంఎస్‌ఎంఈ రంగానికి మద్దతుగా.. డిఫాల్టయిన రుణాలను 2021 మార్చి 31 వరకు పునరుద్ధరిస్తున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. జీఎస్టీ నమోదిత ఎంఎస్‌ఎంఈలకే ఇది వర్తిస్తుంది. జీడీపీలో ఎంఎస్‌ఎంఈ రంగం వాటా 28%. ఎగుమతుల్లో వాటా 40 శాతం. అంతేకాదు 11 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం కూడా.  

► వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ రంగానికి పెద్ద ఉపశమనం కల్పించింది. ప్రమోటర్ల చేతుల్లో లేని అంశాలతో వాణిజ్య రియల్టీ ప్రాజెక్టుల కార్యకలాపాల ఆరంభం ఆలస్యమైతే, వాటి రుణ గడువును ఏడాది పాటు పొడిగించేందుకు అనుమతించింది. అంటే ప్రాజెక్టులు ఆలస్యమైనా ఆయా రుణాలను డౌన్‌గ్రేడ్‌ చేయరు. ఇన్‌ఫ్రాయేతర రంగాల రుణాల్లాగే వీటినీ పరిగణిస్తారు. రియల్టీ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఇది అదనపు మద్దతునిస్తుందని ఆర్‌బీఐ  పేర్కొంది.


ద్రవ్యోల్బణం భయాలు
రిటైల్‌ ద్రవ్యోల్బణం జనవరి–మార్చి క్వార్టర్‌లో 6.5 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ ఎంపీసీ అంచనా వేసింది. జనవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఐదేళ్ల గరిష్ట స్థాయిలో 7.35 శాతంగా నమోదు కావటం తెలిసిందే. వచ్చే ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌కు ద్రవ్యోల్బణం 3.8–4 శాతం మధ్య ఉంటుందని గతంలో చేసిన అంచనాలను సవరిస్తూ 5–5.4%కి పెంచింది. ప్రధానంగా కూరగాయలు, పప్పుధాన్యాల ధరలు పెరగొచ్చని అభిప్రాయపడింది.  

వృద్ధి రేటు 5%: 2019–20లో వృద్ధి రేటు 5%గా ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. 2020–21లో 6%గా ఉంటుందని అంచనా వేసింది. 2020–21 తొలి ఆరు నెలల్లో 5.9–6.3% మధ్య ఉంటుందన్న లోగడ అంచనాలను.. 5.5–6%కి తగ్గించింది.

ఇతర ముఖ్యాంశాలు
► రేట్ల యథాతథ స్థితికి ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆధ్వర్యంలోని ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా (ఆరుగురు సభ్యులు) ఓటు వేసింది.  గత భేటీలోనూ (2019 డిసెంబర్‌) రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు.  
► దీంతో ఆర్‌బీఐ రెపో రేటు 5.15 శాతం, రివర్స్‌ రెపో రేటు 4.9 శాతంగానే కొనసాగనున్నాయి.

► ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం బడ్జెట్లో 3.8 శాతానికి సవరించగా, దీనివల్ల మార్కెట్‌ నుంచి ప్రభుత్వ రుణ సమీకరణ పెరగదని ఆర్‌బీఐ పేర్కొంది.

► చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీసీ అభిప్రాయపడింది. దీంతో రానున్న త్రైమాసికంలో (ఏప్రిల్‌ నుంచి ఆరంభమయ్యే) వడ్డీ రేట్లను కేంద్రం తగ్గించే అవకాశాలున్నాయి.

► హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (హెచ్‌ఎఫ్‌సీ) నియంత్రణకు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తారు. అప్పటి వరకు నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు ఆదేశాలు, మార్గదర్శకాలే కొనసాగుతాయి. హెచ్‌ఎఫ్‌సీల నియంత్రణ గతేడాది ఆగస్ట్‌ 9 నుంచి ఆర్‌బీఐకి బదిలీ కావటం తెలిసిందే.  

► బ్యాంకుల్లో డిపాజిట్‌ బీమాను ఒక డిపాజిట్‌దారునికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం బ్యాంకు బ్యాలన్స్‌ షీట్లపై పెద్దగా ప్రభావం చూపదని పేర్కొంది.

► బడ్జెట్లో ప్రభుత్వం వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లలో చేసిన మార్పులు డిమాండ్‌కు మద్దతునిస్తాయని అంచనా వేసింది.

► తదుపరి ఆర్‌బీఐ విధాన ప్రకటన ఏప్రిల్‌ 3న ఉంటుంది.


మా వద్ద ఎన్నో అస్త్రాలు
‘‘సెంట్రల్‌ బ్యాంకు వద్ద ఎన్నో సాధనాలున్నాయని గుర్తుంచుకోవాలి. వృద్ధి మందగమనం రూపంలో భారత ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైతే వాటిని సంధిస్తాం’’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ స్పష్టం చేశారు. తద్వారా 2008 ఆర్థిక మాంద్యం తర్వాత అమెరికాలో మాదిరే అసాధారణ అస్త్రాలను వినియోగించేందుకు ఆర్‌బీఐ వెనుకాడదన్న సంకేతం ఇచ్చారు. రేట్లలో మార్పులు చేయకపోవడం అంచనాలకు అనుగుణంగానే ఉందన్నారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ వృద్ధి తగ్గే రిస్క్‌ పెరిగిందని... అయితే, పూర్తి  ప్రభావంపై అనిశ్చితి ఉందని చెప్పారు.  

బ్యాంకుల్లోకి రూ.లక్ష కోట్లు
లాంగ్‌టర్న్‌ రీపర్చేజ్‌ అగ్రిమెంట్స్‌ (రెపోస్‌/రుణాలు) ఏడాది, మూడేళ్ల కాల వ్యవధిపై రూ.లక్ష కోట్ల మేర రెపో రేటుకు జారీ చేయనున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. రెపోస్‌ అంటే.. బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్‌బీఐకి విక్రయించి నిధులు పొందడం. గడువు తీరిన తర్వాత తిరిగి అవి మళ్లీ కొనుగోలు చేస్తాయి. ఇప్పటి వరకు ఆర్‌బీఐ గరిష్టంగా 56 రోజులకే రెపోస్‌ను ఇష్యూ చేసింది. అందులోనూఒక రోజు నుంచి 15 రోజుల కాలానికే ఎక్కువగా ఉండేవి.

మొదటిసారి ఏడాది, మూడేళ్ల రెపోస్‌ను ఆర్‌బీఐ ప్రకటించింది. బ్యాంకుల నిధుల వ్యయాలను తగ్గించడమే ఇందులోని ఉద్దేశం. ‘‘మానిటరీ పాలసీ బదిలీ మరింత మెరుగ్గా ఉండేందుకు తీసుకున్న చర్య ఇది. ఎందుకంటే రెపో రేటుకు నిధులను ఇస్తున్నాం. బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రూ.లక్ష కోట్లను విడుదల చేయాలనుకుంటున్నాం. దాంతో బ్యాంకులు రుణ రేట్లను తగ్గించేందుకు వీలు పడుతుంది’’ అని ఆర్‌బీఐ గరవ్నర్‌ శక్తికాంతదాస్‌ తెలిపారు.   

ఎవరేమన్నారంటే...
ఏడాది, మూడేళ్ల లాంగ్‌టర్మ్‌ రెపోస్‌ బ్యాంకుల నిధుల వ్యయాలను తగ్గిస్తాయి. దీంతో ఈ ప్రభావాన్ని మరింత మెరుగ్గా రుణగ్రహీతలకు బదిలీ చేయడం వీలు పడుతుంది. రెపో రేట్లను మార్పు చేయకపోవడం ఊహించినదే. అయితే, అభివృద్ధి, నియంత్రణపరమైన చర్యలు ఆర్థిక రంగానికి సానుకూలం.

– రజనీష్‌ కుమార్, ఎస్‌బీఐ చైర్మన్‌
 
ప్రాజెక్టు రుణాలకు అదనంగా ఏడాది గడువు ఇవ్వడం రియల్‌ ఎస్టేట్‌ రంగానికి భారీ ఉపశమనం.

– అనుజ్‌పురి, అన్‌రాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ చైర్మన్‌
 
ఆటో, హౌసింగ్, ఎంఎస్‌ఎంఈ రంగాలకు ఇచ్చే ఇంక్రిమెంటల్‌ రుణాలకు సీఆర్‌ఆర్‌ నుంచి బ్యాంకులకు మినహాయింపునివ్వడం.. ఈ రంగాలకు రుణ వితరణను పెంచి, మందగమనానికి మందులా పనిచేస్తుంది.

– కృష్ణన్‌ సీతారామన్, క్రిసిల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement