దేశంలో నాలుగో పెద్ద బ్రోకింగ్ సేవల కంపెనీ ఏంజెల్ బ్రోకింగ్.. ఇన్వెస్టర్లను నిరాశపరుస్తూ స్టాక్ ఎక్స్ఛేంజీలలో డిస్కౌంట్‌లో లిస్టయ్యింది. ఐపీవో ధర రూ. 306తో పోలిస్తే ఎన్‌ఎస్‌ఈలో 10 శాతం నష్టంతో రూ. 275 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రూ. 297 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 257 వద్ద కనిష్టానికీ చేరింది. ప్రస్తుతం రూ. 17 నష్టంతో రూ. 289 వద్ద కదులుతోంది.
రూ. 600 కోట్లు
గత నెల 24న ముగిసిన పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఏంజెల్ బ్రోకింగ్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 180 కోట్లు సమకూర్చుకుంది. షేరుకి రూ. 306 ధరలో 58.8 లక్షల షేర్లను 12 సంస్థలకు కేటాయింంచింది. ఏంజెల్ బ్రోకింగ్‌లో ఇన్వెస్ట్ చేసిన యాంకర్ సంస్థలలో గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా, మెక్వారీ ఫండ్ సొల్యూషన్స్, ఇన్వెస్కో ట్రస్టీ, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తదితరాలున్నాయి. వెరసి ఐపీవో ద్వారా రూ. 600 కోట్లు సమకూర్చుకుంది.
బ్యాక్‌గ్రౌండ్..
టెక్నాలజీ ఆధారిత ఫైనాన్షియల్ సర్వీసులను ఏంజెల్ బ్రోకింగ్ అందిస్తోంది. ప్రధానంగా బ్రోకింగ్, అడ్వయజరీ, మార్జిన్ ఫండింగ్, షేర్ల తనఖాపై రుణాలు తదితరాలను క్లయింట్లకు సమకూర్చుతోంది. 7.7 లక్షల మంది యాక్టివ్ కస్టమర్లను కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. 6.3 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. క్లయింట్ల రీత్యా దేశంలోనే నాలుగో పెద్ద బ్రోకింగ్ సంస్థగా ఏంజెల్ నిలుస్తోంది. జూన్‌కల్లా కంపెనీ నెట్‌వర్త్ రూ. 639 కోట్లను అధిగమించింది. ఏంజెల్ బ్రోకింగ్.. ఈ ఏడాది అంటే 2020లో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన 8వ కంపెనీ కావడం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment