
Apollo Tyres-Raksha Bandhan 2023: రాఖీ పండుగ లేదా రక్షా బంధన్.. అంటే రక్షణ.. బాధ్యతకు ప్రతీక. సోదరులు, సోదరీమణుల మధ్య బంధాన్ని మాత్రమే కాదు మనిషికి మనిషికీ మధ్య ఉంటే బంధానికి రక్షణ. ఒక నమ్మకం. ఈ రక్షణ స్ఫూర్తికి హద్దులు ఉండవు. ఈ నమ్మకాన్నే పునరుద్ఘాటిస్తూ ప్రముఖ టైర్ల కంపెనీ అపోలో టైర్స్ రక్షా బంధన్‌పై అద్భుతమైన యాడ్‌ను రూపొందించింది. ఈ యాడ్ ఇపుడు నెటిజనులను ఆకట్టుకుంటోంది.
అపోలో టైర్స్ రక్షా బంధన్ సారాంశాన్ని షార్ట్ ఫిల్మ్ ద్వారా స్పెషల్‌గా ప్రకటించింది. రక్షా బంధన్ ప్రతి ఒక్కరి కోసం అంటూ ఈ స్టోరీని అందంగా వివరించింది. నిజానికి రాఖీ పండుగ అన్నదమ్ములు, సోదరీ మణుల అనుబంధాన్ని ప్రత్యేక జరుపు కోవడం ప్రతీతి. కానీ రక్షా బంధన్ ప్రతి ఒక్కరికీ, మన జీవితంలో పరిధీయ పాత్రలు పోషిస్తున్న వారందరిదీ అంటూ ప్రకటించడం విశేషంగా నిలిచింది.
ఇంతకీ ఈ షార్ట్ ఫిల్మ్ లో ఏముందంటే.. ఒక యువతి రక్షా బంధన్ రోజున తన ఇంటికి కారులో వెడుతూ ఉంటుంది. అయితే, ఒక ట్రక్కు తనను తాను వెంబడిస్తూ, హారన్‌మోగిస్తూ ఉంటాడు. దీంతో ఆమె అసౌకర్యానికి గురవుతుంది.. ఏదో అనుమానంతో చూస్తుంది. కానీ అకస్మాత్తుగా కారు ఆగిపోతుంది. హైవేలో ఒంటరిగా మిగిలిపోతుంది. బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ఆమె ఇక్కడే ఆశ్చర్యానికి లోనవుతుంది. తనను అప్పటిదాకా వెంబడించిన ట్రక్ డ్రైవరే ఆమె పాలిట ఊహించని రక్షకుడిగా మారతాడు. భయపడొద్దు అంటూ భరోసా ఇచ్చి...ఆమెను గమ్య స్థానానికి చేరుస్తాడు. దీనికి ప్రతిఫలంగా ఆమె డబ్బులు ఇవ్వబోతే సున్నితంగా తిరస్కరిస్తూ.. నా సోదరి లాంటిదానికి వద్దు అంటాడు. ఇక తర్వాత మీకు తెలిసిందే.. అతని సహృదయానికి, తన పట్ల బాధ్యతగా వ్యవహరించిన డ్రైవర్‌కి రాఖీ కడుతుందన్న మాట ఆ యువతి. రక్షా బంధన్ అంటే అందరిదీ. అపరిచితులైనా సరే.. ఆపదలో ఉన్న వారి పట్ల బాధ్యతగా ఉండటం, రక్షణగా నిలబడటమే దీని ఔచిత్యం అనే సందేశంతో ఈ షార్ట్ ఫిలిం ముగుస్తుంది. అంతేకాదు అపోలో టైర్స్ ప్రతి ప్రయాణంలో వినియోగదారులకు భద్రత నిస్తుంది. ఈ భద్రతను నిర్ధారించే తన నిబద్ధతను మరోసారి నొక్కి చెబుతుంది ఈయాడ్‌లో..