ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలకు జోష్‌! | Appliances, Consumer Electronics Sales To Grow 20percent During Festivals | Sakshi
Sakshi News home page

ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలకు జోష్‌!

Published Tue, Sep 26 2023 4:49 AM | Last Updated on Tue, Sep 26 2023 4:49 AM

Appliances, Consumer Electronics Sales To Grow 20percent During Festivals - Sakshi

న్యూఢిల్లీ: గృహోపకరణాలు, కన్జ్యూమర్‌ ఎల్రక్టానిక్‌ పరిశ్రమ ఈ ఏడాది అమ్మకాలపై బలమైన అంచనాలను పెట్టుకుంది. పండుగల సీజన్‌కుతోడు, వన్డే ప్రపంచ క్రికెట్‌ కప్‌ పోటీలు ఉండడంతో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేస్తోంది. ఏటా పండుగల సీజన్‌లో అధిక విక్రయాలు నమోదవుతుండడం సాధారణమే. కాకపోతే ఈ ఏడాది క్రికెట్‌ పోటీలు కూడా రావడం అమ్మకాలకు కలిసొస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

1987 తర్వాత పండుగల సీజన్‌ సమయంలో క్రికెట్‌ ప్రపంచ కప్‌ టోర్నమెంట్‌ రావడం ఇదే మొదటిసారి కానుంది. దీంతో టీవీలు, ముఖ్యంగా పెద్ద తెరల సెట్లు, ఆడియో ఉత్పత్తులు, సౌండ్‌ బార్లు, హెడ్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్‌ అధికంగా అమ్ముడుపోతాయనే అంచనాలు నెలకొన్నాయి. సంప్రదాయ, చిన్న తెరల టీవీల స్థానంలో 55 అంగుళాల పెద్ద టీవీలను వినియోగదారులు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయని కంపెనీలు భావిస్తున్నాయి. ప్రీమియం, అల్ట్రా ప్రీమియం అయిన క్యూఎల్‌ఈడీ, ఓఎల్‌ఈడీ టీవీలకు సైతం డిమాండ్‌ ఉంటుందని అంచనాతో ఉన్నాయి. వన్డే వరల్డ్‌కప్‌ అక్టోబర్‌ 5న ప్రారంభం అవుతుండగా, నవంబర్‌ 9న ముగియనుంది.  

ఆకర్షణీయమైన ఆఫర్లు
గత సీజన్ల మాదిరే ఈ ఏడాది కూడా వడ్డీ రహిత రుణ సదుపాయం, కొత్త మోడళ్ల ఆవిష్కరణ, విస్తృత ప్రచారంతో అమ్మకాలు పెంచుకోవాలని ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల కంపెనీలు యోచిస్తున్నాయి. ప్రస్తుత పండుగల సమయంలో అమ్మకాలు గతేడాది స్థాయిలోనే ఉండొచ్చు. కాకపోతే ఈ ఏడాది ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. వీటి అమ్మకాలు 30% పెరగొచ్చు. కాకపోతే మాస్‌ విభాగం (తక్కువ ధరల ఉత్పత్తులు) ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు.

ఈ ఏడాది ఆరంభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావం కొనసాగుతోంది. దీంతో విచక్షణారహిత వినియోగంపై ఒత్తిడి నెలకొంది. రుతుపవనాల్లో వ్యత్యాసం, కొన్ని రాష్ట్రాల్లో సరైన వర్షాలు కురవకపోవడం వ్యవసాయ ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇవి మాస్‌ ఉత్పత్తుల అమ్మకాలపై ప్రభావం పడేలా చేస్తాయి. కనుక ఈ విభాగంలో అమ్మకాలు ఏమంత మెరుగ్గా ఉంటాయని భావించడం లేదు’’అని గోద్రేజ్‌ అప్లయెన్సెస్‌ బిజినెస్‌ హెడ్‌ కమల్‌ నంది వివరించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement