‘బెన్ను’ భూమిని ఢీకొడుతుందా? | Asteroid Bennu Has 1 in 1750 Chance of Smashing into Earth | Sakshi
Sakshi News home page

‘బెన్ను’ భూమిని ఢీకొడుతుందా?

Published Sun, Aug 15 2021 3:58 PM | Last Updated on Sun, Aug 15 2021 4:08 PM

Asteroid Bennu Has 1 in 1750 Chance of Smashing into Earth - Sakshi

సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌: సుమారు 6.5 కోట్ల ఏళ్ల కింద.. సుమారు పది కిలోమీటర్ల వెడల్పున్న గ్రహశకలం భూమిని ఢీకొట్టింది.. డైనోసార్లు సహా 75 శాతానికిపైగా జీవం అంతరించడానికి  కారణమైంది. అలాంటి మరో గ్రహశకలం ఇప్పుడు ఆందోళన రేపుతోంది. దాని  పేరు ‘బెన్ను’. ఈ ఆస్టరాయిడ్‌పై పరిశోధన చేస్తున్న ‘నాసా’ శాస్త్రవేత్తలు.. ఇంతకుముందు ఊహించిన దానికంటే ఎక్కువగానే ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నారు.  అది ఎప్పుడెప్పుడు ఢీకొనే అవకాశాలు ఎంతగా ఉన్నాయనే అంచనాలు  వేశారు. మరి ఆస్టరాయిడ్‌ ఏంటి? ఎక్కడిది? దానిపై  పరిశోధనలేమిటనే వివరాలు తెలుసుకుందామా?. 

ఎక్కడిదీ  బెన్ను..? 
మన సౌర కుటుంబంలో అంగారక, గురు గ్రహాల మధ్య ఆస్టరాయిడ్‌ బెల్ట్‌ ఉంది. చిన్నవి పెద్దవి కలిపి సుమారు పది లక్షల గ్రహశకలాలు ఆ ప్రాంతంలోని కక్ష్యలో తిరుగుతున్నాయి. అందులోంచి కక్ష్య మారిన కొన్ని గ్రహ శకలాలు తోకచుక్కల తరహాలో దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో తిరుగుతున్నాయి. అంటే వేరే గ్రహం కక్ష్యను దాటుకుంటూ సూర్యుడికి కాస్త దగ్గరగా వెళ్లి.. తిరిగి దాటుకుంటూ వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఆ గ్రహాన్ని ఢీకొట్టే అవకాశం ఉంటుంది. ఆస్టరాయిడ్‌ ‘బెన్ను’కూడా కక్ష్య మారి.. భూమికి, అంగారకుడికి మధ్య ప్రాంతంలోకి వచ్చినట్టు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 1.2 ఏళ్లకోసారి సూర్యుడి చుట్టూ పరిభ్రమించే ‘బెన్ను’.. ఈ సమయంలో రెండు సార్లు భూమి కక్ష్యను దాటుతుంది.


 
ప్రమాదమెంత? 
భవిష్యత్తులో భూమికి ప్రమాదకం కలిగించగల గ్రహశకలాల్లో ‘బెన్ను’ఒకటి. దీని వెడల్పు 490 మీటర్లు (1,600 అడుగులు). నిజానికి దీనితో పెద్దగా ప్రమాదం ఉండదని.. వచ్చే రెండు, మూడు వందల ఏళ్ల వరకు కూడా భూమికి దూరంగానే వెళుతుందని తొలుత భావించారు. కానీ ఈ ఆస్టరాయిడ్‌పైకి నాసా నిర్వహించిన ‘ఓసిరిస్‌–రెక్స్‌’వ్యోమనౌక ప్రయోగంలో వెల్లడైన అంశాలతో అంచనాలను మార్చారు. 

  • మొదట్లో 2175-2199 సంవత్సరాల మధ్య అది భూమికి అత్యంత దగ్గరగా వస్తుందని.. ఢీకొట్టే అవకాశం 0.037 శాతం (2,700లో ఒక వంతు) వరకు ఉందని అంచనా వేశారు. 
  • ప్రస్తుత అంచనా ప్రకారం.. బెన్ను భూమిని ఢీకొట్టే అవకాశం పెరిగిందని తేల్చారు. 2182వ సంవత్సరం సెప్టెంబర్‌ 24న ప్రమాదం జరిగే అవకాశం 0.057 శాతం (1,750లో ఒక  వంతు) వరకు ఉందని గుర్తించారు. 
  • 2135వ సంవత్సరంలోనూ బెన్ను భూమికి అత్యంత సమీపంలోకి వస్తుందని, ఆ సమయంలో భూమి గ్రావిటీ ప్రభావానికి లోనవుతుందని తేల్చారు. అప్పుడు భూమిని ఢీకొట్టే ప్రమాదం తక్కువే అయినా.. ‘యార్కోవ్‌స్కీ’ ప్రభావం.  
  • భూమి, ఇతర గ్రహాల ఆకర్షణ వల్ల ‘బెన్ను’ కక్ష్య మారి.. ప్రమాదకరంగా పరిణమించవచ్చని తెలిపారు. 

ఏమిటీ  ‘యార్కోవ్‌స్కీ’ఎఫెక్ట్‌? 
ఆస్టరాయిడ్లు కూడా తమ కక్ష్యలో తిరుగుతున్నప్పుడు భూమి తరహాలో తమచుట్టూ తాము భ్రమిస్తూ ఉంటాయి. ఈ సందర్భంగా సూర్యరశ్మి తగిలిన చోట ఆస్టరాయిడ్‌ ఉపరితలం వేడెక్కడం, తిరుగుతూ వెనక్కి వెళ్లినప్పుడు ‘థర్మల్‌ రేడియేషన్‌’రూపంలో ఆ వేడి చల్లారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో స్వల్పంగా ఒత్తిడి పుట్టి.. ఆస్టరాయిడ్‌ను వెలుగు ఉన్నవైపు (సూర్యుడివైపు) తోస్తుంది. ఏళ్లకేళ్లు ఇలా జరిగినప్పుడు కక్ష్యలో మార్పులు వస్తాయి. 

  • ‘బెన్ను’ఇలా కక్ష్య మార్చుకోవడం వల్ల భూమిని ఢీకొట్టే అవకాశం మరింతగా పెరగడం గానీ, లేక తగ్గిపోవడం గానీ జరగవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 

‘బెన్ను’ శాంపిల్స్‌ తెస్తున్న ‘ఓసిరిస్‌–రెక్స్‌’ 
ఆస్టరాయిడ్‌ బెన్నుతో ప్రమాదం ఉంటుందని ముందే అంచనా వేసిన నాసా శాస్త్రవేత్తలు 2016లో దానిపైకి ‘ఒసిరిస్‌–రెక్స్‌’ వ్యోమనౌకను పంపారు. 2018 డిసెంబర్‌లో బెన్నును చేరుకుని పరిశీలన మొదలుపెట్టింది. 2020 అక్టోబర్‌లో దానిపై దిగి.. అక్కడి మట్టి, రాళ్లు శాంపిల్స్‌ను తీసుకుని తిరిగి భూమివైపు బయలుదేరింది. ఇది 2023 సెప్టెంబర్‌లో భూమికి చేరనుంది. నాసా శాస్త్రవేత్తలు ఆ శాంపిల్స్‌పై పరిశోధనలు చేయనున్నారు. ఈ ప్రయోగంలో వ్యోమనౌక గుర్తించిన అంశాల ఆధారంగా దాని ప్రయాణాన్ని తాజాగా అంచనా వేశారు. 

అప్పటి  ఆస్టరాయిడ్‌తో ప్రళయం! 
ఆరున్నర కోట్ల ఏళ్ల కింద సుమారు 9.6 కిలోమీటర్లు (6 మైళ్లు) వెడల్పు ఉన్న గ్రహశకలం భూమిని ఢీకొట్టింది. దీనివల్ల భూమిపై 145 కిలోమీటర్ల వ్యాసం ఉన్న పెద్ద క్రేటర్‌ (గుంత) ఏర్పడింది. ‘చిక్సులుబ్‌’గా పిలిచే ఈ క్రేటర్‌ మెక్సికోలోని యుకాటన్‌ ప్రాంతంలో ఉంది. ఆ గ్రహశకలం ఢీకొన్న తర్వాత భూమిపై తీవ్ర పరిణామాలు సంభవించాయి. ఏకంగా ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తుతో సునామీ ఏర్పడింది. భూకంపాలు ఏర్పడ్డాయి. అగ్నిపర్వతాలు యాక్టివ్‌గా మారి కార్చిచ్చులు చెలరేగాయి.

ఆస్టరాయిడ్‌ పేలుడుకారణంగా ఏర్పడిన దుమ్ము, ధూళి వాతావరణంలో పేరుకుపోయి.. కొన్నేళ్ల పాటు సూర్యరశ్మి తగ్గిపోయింది. మొక్కలు చనిపోయాయి. ఆహారం దొరక్క జంతువులు, జలచరాలు అంతరించాయి. మొత్తంగా భూమ్మీద ఉన్న జీవరాశుల్లో (మొక్కలు, జంతువులు, జలచరాలు..) 75 శాతం అంతరించిపోయాయి. డైనోసార్లు పూర్తిగా అంతరించాయి. ఆ తర్వాతి పరిస్థితుల్లోనే పిల్లల్ని కని పాలిచ్చే జంతువులు (మమ్మాల్స్‌), మానవ జాతులు అభివృద్ధి చెందాయి. 

  • నాడు భూమిని ఢీకొన్న గ్రహశకలం అత్యంత నల్లగా ఉండే ‘డార్క్‌ ఆస్టరాయిడ్‌ అని.. అది అంగారక, గురు గ్రహాల మధ్య ఉన్న ఆస్టరాయిడ్‌ బెల్ట్‌ నుంచే వచ్చిందని శాస్త్రవేత్తలు ఇటీవలే నిర్ధారించడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement