స్టార్‌లైనర్ సేఫ్ కాదు: నాసా
స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌకలో తిరిగి రానున్న సునీత, విల్మోర్
ఆటోపైలెట్ మోడ్‌లో ఖాళీగా స్టార్‌లైనర్ తిరుగుప్రయాణం
కేప్‌కనావెరాల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి రావడానికి బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్యూల్ సురక్షితం కాదని నాసా తేల్చిచెప్పింది. వారిని అందులో వెనక్కు తీసుకురావడం అత్యంత ప్రమాదకరమని శనివారం పేర్కొంది. ఆ రిస్క్ తీసుకోరాదని నిర్ణయించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎలాన్ మస్‌్కకు చెందిన స్పేస్ ఎక్స్ షటిల్ డ్రాగన్ క్యాప్సూల్‌లో వారిని తీసుకురావాలని నిర్ణయించింది.
పలు వైఫల్యాల తర్వాత బోయింగ్ స్టార్‌లైనర్ గత జూన్‌లో సునీత, విల్మోర్‌లను అంతరిక్ష కేంద్రానికి చేర్చడం తెలిసిందే. థ్రస్టర్లు మొరాయించడం, హీలియం లీకేజీ తదితర సమస్యల నడుమ అతికష్టమ్మీద∙స్టార్‌లైనర్ ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమైంది. వారం కోసమని వెళ్లిన సునీత, విల్మోర్ అక్కడే చిక్కుకుపోయారు. ఫిబ్రవరిలో తిరుగు ప్రమాణమంటే ఎనిమిది నెలలకు పైగా ఐఎస్‌ఎస్‌లోనే గడపనున్నారు. స్టార్‌లైనర్‌కు మరమ్మతులు చేయడానికి బోయింగ్ ఇంజనీర్లతో కలిసి నాసా తీవ్రంగా శ్రమించింది. మూడునెలల ప్రయత్నాల అనంతరం.. మానవసహిత తిరుగు ప్రమాణానికి స్టార్‌లైనర్ సురక్షితం కాదని తేల్చేసింది. అది ఒకటి, రెండు వారాల్లో ఐఎస్‌ఎస్ నుంచి విడివడి ఆటోపైలెట్ మోడ్‌లో ఖాళీగా భూమికి తిరిగి రానుంది. తమ విమానాల భద్రతపై ఇప్పటికే ఇబ్బందులను ఎదుర్కొంటున్న బోయింగ్‌కు స్టార్‌లైనర్ వైఫల్యం గట్టి ఎదురుదెబ్బే.
స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలోనే ఉంది. మార్చి నుంచి ఐఎస్‌ఎస్‌లో ఉన్న నలుగురు వ్యోమగాములను తీసుకుని సెపె్టంబరు నెలాఖరులో భూమికి తిరిగివస్తుంది. అత్యవసరమైతే తప్ప అందులో మరో ఇద్దరిని ఇరికించడం సురక్షితం కాదని నాసా తెలిపింది. రష్యాకు చెందిన సోయుజ్ క్యాప్సూల్ కూడా ఐఎస్‌ఎస్‌లోనే ఉన్నా అందులోనూ ముగ్గురికే చోటుంది. ఏడాదిగా ఐఎస్‌ఎస్‌లో ఉన్న ఇద్దరు రష్యా వ్యోమగాములు అందులో తిరిగొస్తారు. డ్రాగన్ సెపె్టంబరులో ఇద్దరు వ్యోమగాములతో ఐఎస్‌ఎఐస్‌కు వెళ్తుంది. తిరుగు ప్రమాణంలో సునీత, విల్మోర్‌లను కూడా తీసుకొస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment