asteroid bennu
-
‘బెన్ను’ భూమిని ఢీకొడుతుందా?
సాక్షి, సెంట్రల్ డెస్క్: సుమారు 6.5 కోట్ల ఏళ్ల కింద.. సుమారు పది కిలోమీటర్ల వెడల్పున్న గ్రహశకలం భూమిని ఢీకొట్టింది.. డైనోసార్లు సహా 75 శాతానికిపైగా జీవం అంతరించడానికి కారణమైంది. అలాంటి మరో గ్రహశకలం ఇప్పుడు ఆందోళన రేపుతోంది. దాని పేరు ‘బెన్ను’. ఈ ఆస్టరాయిడ్‌పై పరిశోధన చేస్తున్న ‘నాసా’ శాస్త్రవేత్తలు.. ఇంతకుముందు ఊహించిన దానికంటే ఎక్కువగానే ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నారు. అది ఎప్పుడెప్పుడు ఢీకొనే అవకాశాలు ఎంతగా ఉన్నాయనే అంచనాలు వేశారు. మరి ఆస్టరాయిడ్ ఏంటి? ఎక్కడిది? దానిపై పరిశోధనలేమిటనే వివరాలు తెలుసుకుందామా?. ఎక్కడిదీ బెన్ను..? మన సౌర కుటుంబంలో అంగారక, గురు గ్రహాల మధ్య ఆస్టరాయిడ్ బెల్ట్ ఉంది. చిన్నవి పెద్దవి కలిపి సుమారు పది లక్షల గ్రహశకలాలు ఆ ప్రాంతంలోని కక్ష్యలో తిరుగుతున్నాయి. అందులోంచి కక్ష్య మారిన కొన్ని గ్రహ శకలాలు తోకచుక్కల తరహాలో దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో తిరుగుతున్నాయి. అంటే వేరే గ్రహం కక్ష్యను దాటుకుంటూ సూర్యుడికి కాస్త దగ్గరగా వెళ్లి.. తిరిగి దాటుకుంటూ వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఆ గ్రహాన్ని ఢీకొట్టే అవకాశం ఉంటుంది. ఆస్టరాయిడ్ ‘బెన్ను’కూడా కక్ష్య మారి.. భూమికి, అంగారకుడికి మధ్య ప్రాంతంలోకి వచ్చినట్టు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 1.2 ఏళ్లకోసారి సూర్యుడి చుట్టూ పరిభ్రమించే ‘బెన్ను’.. ఈ సమయంలో రెండు సార్లు భూమి కక్ష్యను దాటుతుంది. ప్రమాదమెంత? భవిష్యత్తులో భూమికి ప్రమాదకం కలిగించగల గ్రహశకలాల్లో ‘బెన్ను’ఒకటి. దీని వెడల్పు 490 మీటర్లు (1,600 అడుగులు). నిజానికి దీనితో పెద్దగా ప్రమాదం ఉండదని.. వచ్చే రెండు, మూడు వందల ఏళ్ల వరకు కూడా భూమికి దూరంగానే వెళుతుందని తొలుత భావించారు. కానీ ఈ ఆస్టరాయిడ్‌పైకి నాసా నిర్వహించిన ‘ఓసిరిస్–రెక్స్’వ్యోమనౌక ప్రయోగంలో వెల్లడైన అంశాలతో అంచనాలను మార్చారు. మొదట్లో 2175-2199 సంవత్సరాల మధ్య అది భూమికి అత్యంత దగ్గరగా వస్తుందని.. ఢీకొట్టే అవకాశం 0.037 శాతం (2,700లో ఒక వంతు) వరకు ఉందని అంచనా వేశారు. ప్రస్తుత అంచనా ప్రకారం.. బెన్ను భూమిని ఢీకొట్టే అవకాశం పెరిగిందని తేల్చారు. 2182వ సంవత్సరం సెప్టెంబర్ 24న ప్రమాదం జరిగే అవకాశం 0.057 శాతం (1,750లో ఒక వంతు) వరకు ఉందని గుర్తించారు. 2135వ సంవత్సరంలోనూ బెన్ను భూమికి అత్యంత సమీపంలోకి వస్తుందని, ఆ సమయంలో భూమి గ్రావిటీ ప్రభావానికి లోనవుతుందని తేల్చారు. అప్పుడు భూమిని ఢీకొట్టే ప్రమాదం తక్కువే అయినా.. ‘యార్కోవ్‌స్కీ’ ప్రభావం. భూమి, ఇతర గ్రహాల ఆకర్షణ వల్ల ‘బెన్ను’ కక్ష్య మారి.. ప్రమాదకరంగా పరిణమించవచ్చని తెలిపారు. ఏమిటీ ‘యార్కోవ్‌స్కీ’ఎఫెక్ట్? ఆస్టరాయిడ్లు కూడా తమ కక్ష్యలో తిరుగుతున్నప్పుడు భూమి తరహాలో తమచుట్టూ తాము భ్రమిస్తూ ఉంటాయి. ఈ సందర్భంగా సూర్యరశ్మి తగిలిన చోట ఆస్టరాయిడ్ ఉపరితలం వేడెక్కడం, తిరుగుతూ వెనక్కి వెళ్లినప్పుడు ‘థర్మల్ రేడియేషన్’రూపంలో ఆ వేడి చల్లారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో స్వల్పంగా ఒత్తిడి పుట్టి.. ఆస్టరాయిడ్‌ను వెలుగు ఉన్నవైపు (సూర్యుడివైపు) తోస్తుంది. ఏళ్లకేళ్లు ఇలా జరిగినప్పుడు కక్ష్యలో మార్పులు వస్తాయి. ‘బెన్ను’ఇలా కక్ష్య మార్చుకోవడం వల్ల భూమిని ఢీకొట్టే అవకాశం మరింతగా పెరగడం గానీ, లేక తగ్గిపోవడం గానీ జరగవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ‘బెన్ను’ శాంపిల్స్ తెస్తున్న ‘ఓసిరిస్–రెక్స్’ ఆస్టరాయిడ్ బెన్నుతో ప్రమాదం ఉంటుందని ముందే అంచనా వేసిన నాసా శాస్త్రవేత్తలు 2016లో దానిపైకి ‘ఒసిరిస్–రెక్స్’ వ్యోమనౌకను పంపారు. 2018 డిసెంబర్లో బెన్నును చేరుకుని పరిశీలన మొదలుపెట్టింది. 2020 అక్టోబర్‌లో దానిపై దిగి.. అక్కడి మట్టి, రాళ్లు శాంపిల్స్‌ను తీసుకుని తిరిగి భూమివైపు బయలుదేరింది. ఇది 2023 సెప్టెంబర్‌లో భూమికి చేరనుంది. నాసా శాస్త్రవేత్తలు ఆ శాంపిల్స్‌పై పరిశోధనలు చేయనున్నారు. ఈ ప్రయోగంలో వ్యోమనౌక గుర్తించిన అంశాల ఆధారంగా దాని ప్రయాణాన్ని తాజాగా అంచనా వేశారు. అప్పటి ఆస్టరాయిడ్‌తో ప్రళయం! ఆరున్నర కోట్ల ఏళ్ల కింద సుమారు 9.6 కిలోమీటర్లు (6 మైళ్లు) వెడల్పు ఉన్న గ్రహశకలం భూమిని ఢీకొట్టింది. దీనివల్ల భూమిపై 145 కిలోమీటర్ల వ్యాసం ఉన్న పెద్ద క్రేటర్ (గుంత) ఏర్పడింది. ‘చిక్సులుబ్’గా పిలిచే ఈ క్రేటర్ మెక్సికోలోని యుకాటన్ ప్రాంతంలో ఉంది. ఆ గ్రహశకలం ఢీకొన్న తర్వాత భూమిపై తీవ్ర పరిణామాలు సంభవించాయి. ఏకంగా ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తుతో సునామీ ఏర్పడింది. భూకంపాలు ఏర్పడ్డాయి. అగ్నిపర్వతాలు యాక్టివ్‌గా మారి కార్చిచ్చులు చెలరేగాయి. ఆస్టరాయిడ్ పేలుడుకారణంగా ఏర్పడిన దుమ్ము, ధూళి వాతావరణంలో పేరుకుపోయి.. కొన్నేళ్ల పాటు సూర్యరశ్మి తగ్గిపోయింది. మొక్కలు చనిపోయాయి. ఆహారం దొరక్క జంతువులు, జలచరాలు అంతరించాయి. మొత్తంగా భూమ్మీద ఉన్న జీవరాశుల్లో (మొక్కలు, జంతువులు, జలచరాలు..) 75 శాతం అంతరించిపోయాయి. డైనోసార్లు పూర్తిగా అంతరించాయి. ఆ తర్వాతి పరిస్థితుల్లోనే పిల్లల్ని కని పాలిచ్చే జంతువులు (మమ్మాల్స్), మానవ జాతులు అభివృద్ధి చెందాయి. నాడు భూమిని ఢీకొన్న గ్రహశకలం అత్యంత నల్లగా ఉండే ‘డార్క్ ఆస్టరాయిడ్ అని.. అది అంగారక, గురు గ్రహాల మధ్య ఉన్న ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచే వచ్చిందని శాస్త్రవేత్తలు ఇటీవలే నిర్ధారించడం గమనార్హం. -
గ్రహశకలం నుంచి భూమి వైపుగా వస్తోన్న ఒసిరిస్ రెక్స్
వాషింగ్టన్: నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం తరువాత అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన అంతరిక్ష నౌక ఒసిరిస్ రెక్స్ 2020లో అక్టోబరు 21న విజయవంతంగా బెన్నూ గ్రహశకలంపై తాకిన విషయం తెలిసిందే. అంతేకాకుండా గ్రహశకలంపై కంప్రెస్డ్ నైట్రోజన్ వాయువుతో పేలుడును సృష్టించి గ్రహశకలంపై ఉన్న దూళి కణాలను సేకరించింది. దాంతోపాటుగా ఒసిరిస్ రెక్స్ అంతరిక్ష నౌకలో అమర్చిన రోబోటిక్ ఆర్మ్ సహాయంతో గ్రహశకలంపై ఉన్న రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి, తిరిగి బెన్నూ గ్రహశకలం నిర్ణీత కక్ష్యలోకి చేరింది. తాజాగా ఒసిరిస్ రెక్స్ నౌక బెన్నూ గ్రహశకలం ఆర్బిట్‌ను వీడి భూమి వైపుకు అడుగులు వేస్తోన్నట్లు నాసా తెలిపింది. ఈ నౌక 33.4 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి భూమిని చేరనుంది. ఒసిరిస్ రెక్స్ నౌక 2023 సెప్టెంబర్ 24 న ఉటా ఎడారిలో ల్యాండ్ అవుతుందనీ శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఒసిరిస్ రెక్స్ నౌక గంటకు 600 మైళ్ల వేగంతో భూమి వైపుగా కదులుతోంది. నౌకతో పాటుగా బెన్నూ గ్రహశకలంపై సేకరించిన 60 గ్రాముల ధూళి, రాళ్లు, మట్టి కణాలను తీసుకొనివస్తోంది. గ్రహశకలం నుంచి సేకరించిన నమూనాలతో సౌరకుటుంబం పుట్టుకకుసంబంధించిన రహస్యాలను తెలుసుకోవచ్చునని సైంటిస్టులు భావిస్తున్నారు. అపోలో సమూహంలోని బెన్నూ ఒక కార్బోనేషియస్ గ్రహశకలం.దీనిని లీనియర్ ప్రాజెక్ట్‌లో భాగంగా 1999 సెప్టెంబర్ 11 కనుగొన్నారు.ఈ గ్రహశకలం 2175-2199 మధ్య సంవత్సరాలలో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. బెన్నూ సగటు వ్యాసం 490 మీటర్లు. ఒసిరిస్ రెక్స్ అంతరిక్ష నౌక బరువు సుమారు 880 కిలోగ్రాములు Tomorrow, our @NASASolarSystem OSIRIS-REx mission departs asteroid Bennu, carrying a sample of rocks & dust for return to Earth. Set a reminder to watch live at 4pm ET as the spacecraft begins its journey home: https://t.co/L4alRfju1k#ToBennuAndBack pic.twitter.com/68uLNEYv7e — NASA (@NASA) May 9, 2021 చదవండి: అంగారక గ్రహంపై ఆక్సిజన్...! -
గ్రహశకలంపై వాలిన ఒసిరిస్ రెక్స్
వాషింగ్టన్: నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం తరువాత అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రయోగించిన రోబోటిక్ అంతరిక్ష నౌక ఒసిరిస్ రెక్స్ విజయవంతంగా బెన్నూ గ్రహశకలంపై వాలింది. మంగళవారం ఉదయం 6.12 గంటలకు అమెరికాలోని కొలరాడోలోని డెన్వర్ ప్రాంతంలో ఉన్న లాక్‌హీడ్ మార్టిన్ స్పేస్ సెంటర్ నుంచి ఒసిరిస్ రెక్స్‌ను గ్రహశకలంపై దింపగలిగారు. ‘నేలపై వాలడం పూర్తయింది’అన్న ప్రకటన వినగానే కేంద్రంలోని శాస్త్రవేత్తలందరూ హర్షధ్వానాలు చేశారు. భూమికి సుమారు 33 కోట్ల కిలోమీటర్ల దూరంలోని రోబోటిక్ అంతరిక్ష నౌకను నియంత్రించడం, దానితో బెన్నూ గ్రహశకలం నమూనాలను సేకరించడం అంటే ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు!. నాసా సుమారు పన్నెండేళ్లుగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తూండగా బెన్నూ గ్రహశకలంపై వాలి కేవలం 16 సెకన్ల కాలంలో నమూనాలు సేకరించింది. ఓ మినీ వ్యాన్ అంత సైజుండే ఒసిరిస్ 11 అడుగుల పొడవైన రోబోటిక్ చేతితో బెన్నూ ఉత్తర ధ్రువ ప్రాంతంలోని రాళ్లను సేకరించి ఆ వెంటనే గ్రహశకలం నుంచి వేరుపడింది. ఈ నమూనాల ఫొటోలను ప్రసారం చేయడం మొదలుపెట్టింది. రానున్న ఏడు రోజుల్లో ఈ ఫోటోలు నాసాకు చేరనుండగా.. వాటి ఆధారంగా మరిన్ని నమూనాలను సేకరించాలా? వద్దా? అన్నది నిర్ణయిస్తారు. 60 గ్రాముల నుంచి 2 కిలోల వరకూ... బెన్నూ గ్రహశకలం నుంచి అరవై గ్రాముల నుంచి రెండు కిలోగ్రాముల వరకూ రాతి నమూనాలను సేకరించాలన్నది శాస్త్రవేత్తల లక్ష్యం. కర్బనం ఎక్కువగా ఉండే ఈ రాళ్ల ద్వారా మన సౌర కుటుంబం పుట్టుకకు సంబంధించిన రహస్యాలు తెలుసుకోవచ్చు. మంగళవారం నాటి ప్రయోగం అంతా అనుకున్నట్లుగానే సాగిందని, ఒసిరిస్ రెక్స్ చేయి పీడనంతో కూడిన వాయువును విడుదల చేయడం ద్వారా నమూనాలను సేకరించిందని ప్రాజెక్టు పర్యవేక్షకుడు డాంటే లారెట్టా తెలిపారు. -
భవిష్యత్తు ప్రమాదం నుంచి భూమిని కాపాడిన నాసా
భూమిని ఏదో ఒకరోజు ఢీ కొట్టే అవకాశం ఉన్న ఓ ఉల్కను నాసా పేల్చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ రోబోటిక్ హంటర్ ను కార్నివల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి గురువారం ప్రయోగించింది. ఈ ఉల్క పేరును బెన్నుగా తెలిపిన నాసా.. ముక్కలైన బెన్నుపై జీవిజాడల కోసం అన్వేషణ చేపట్టినట్లు తెలిపింది. ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి బెన్ను భూమికి చేరువగా వస్తుందని పేర్కొంది. ఈ ప్రక్రియలో వచ్చే 150 ఏళ్లలో బెన్ను భూమికి అతి చేరువగా వచ్చి ఢీ కొట్టే అవకాశం ఉందని తెలిపింది. ఈ కారణంగానే ఒసిరిస్-రెక్స్ అంతరిక్ష నౌకని ప్రయోగించి ఉల్కను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. బెన్ను భూమిని ఢీ కొట్టకపోయినా.. మానవజాతికి హాని తలపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పింది. బెన్నుతో పాటు పెద్ద సంఖ్యలో ఉల్కలు భూమికి చేరువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. బెన్నుని ధ్వంసం చేయడం వల్ల వాటిపై కూడా పరిశోధనలు చేసే అవకాశం ఏర్పడిందని తెలిపింది.