ముంబై: భారత్ బ్యాంకింగ్ రుణ వృద్ధి 2021 సెప్టెంబర్ 10వ తేదీతో ముగిసిన పక్షం రోజులకు (2020 ఇదే కాలం వద్ద ఉన్న విలువతో పోల్చి) 6.7 శాతం పెరిగి రూ.109.12 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ఇక డిపాజిట్ల విలువ 9.32 శాతం పెరిగి రూ.155.75 లక్షల కోట్లుగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం ఈ గణాంకాలను విడుదల చేసింది. 2020 సెప్టెంబర్ 11తో ముగిసిన పక్షం రోజులకు బ్యాంకింగ్ రుణవిలువ రూ.102. 27 లక్షల కోట్లుకాగా, డిపాజిట్ల విలువ రూ.142.47 లక్షల కోట్లని ఆర్‌బీఐ షెడ్యూల్డ్ బ్యాంక్స్ స్టేట్‌మెంట్ పేర్కొంది. కాగా 2021 ఆగస్టు 27తో ముగిసిన పక్షం రోజుల్లో రుణ వృద్ధి 6.67 శాతంకాగా, డిపాజిట్ల వృద్ధి 9.45 శాతం. అంటే సమీక్షించిన పక్షం రోజుల వ్యవధిలో రుణ వృద్ధి రేటు స్వల్పంగానై పెరగడం (6.67 శాతం నుంచి 6.7 శాతానికి) కొంతలో కొంత ఊరటనిచ్చే అంశం.
గత ఆర్థిక సంవత్సరం ఇలా...
ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం, 2020–21లో బ్యాంక్ రుణ వృద్ధి కేవలం 5.56 శాతంకాగా, డిపాజిట్ల వృద్ధి రేటు 11.4 శాతం. కరెంట్, సేవింగ్స్ అకౌంట్స్ (కాసా) డిపాజిట్లు భారీగా పెరగడం వల్ల డిపాజిట్లలో భారీ వృద్ధి (2019–2020లో 8.8 శాతం వృద్ధి)కి కారణమని గణాంకాలు వెల్లడించాయి. ఒక్క 2021 మార్చిలోనే కాసా డిపాజిట్లు 43.7 శాతం పెరగడం గమనార్హం. డిపాజిట్లలో గృహ రంగం వాటా 64.1శాతం. ఇందులో వ్యక్తులు,హిందూ అవిభక్త కుటుంబాల వాటానే 55.8 శాతం. నాన్–ఫైనాన్షియల్ కార్పొరేషన్ల వాటా 18.8 శాతం.
కేంద్రం ప్రత్యేక దృష్టి
రుణ వృద్ధి, తద్వారా ఎకానమీ పురోగతిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యయాల వల్ల 2021–22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రుణ వృద్ధి 8.9 శాతంగా ఉంటుందన్న రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అంచనావేస్తోంది. ప్రభుత్వ వ్యయాలు ప్రత్యేకించి మౌలిక రంగంలోకి వెళుతున్న పెట్టుబడులు, రిటైల్ రుణాలకు డిమాండ్ పునరుద్దరణ వంటి అంశాలు దీనికి దోహదం చేసే అంశాలుగా పేర్కొంది. రుణాలకు డిమాండ్‌లేదని ఇప్పుడే ప్రకటించడం తొందరపాటు చర్య అవుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పేర్కొన్నారు.
రుణ వృద్ధికి బ్యాంకింగ్ అక్టోబర్ నుంచీ జిల్లాల వారీగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కూడా ఆమె వెల్లడించారు. ‘‘మహమ్మారి కరోనా ప్రారంభం నుంచీ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొనడానికి కేంద్రం పలు ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఈ ఉద్దీపన ప్యాకేజీలు సత్ఫలితాలు ఇవ్వడంలో రుణ వృద్ధి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అక్టోబర్ నుంచీ చేపట్టనున్న జిల్లాల వారీ చర్యలు రుణ వృద్ధికి ఊపునిస్తాయి’’ అని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. రుణ వృద్ధికి ఊపునందించడానికి 2019లో సైతం బ్యాంకులు 400 జిల్లాల్లో ‘‘రుణ మేళా’’లను నిర్వహించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment