మీరు పాత ఐఫోన్‌లను వినియోగిస్తున్నారా? వాటిల్లో ఏమైనా బ్యాటరీ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయా? ఈ తరహా ఇబ్బందులు తలెత్తుంటే ప్రముఖ టెక్ దిగ్గజం, ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ నష్టపరిహారం చెల్లిస్తుంది.
సుమారు 8 ఏళ్ల క్రితం నమోదైన యాపిల్‌పై ‘బ్యాటరీగేట్’ క్లాస్-యాక్షన్ లాసూట్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన ఐఫోన్‌లను వినియోగిస్తుంటే యాపిల్ నుంచి నష్టపరిహారం పొందవచ్చు.
అసలేంటి యాపిల్ ‘బ్యాటరీగేట్’ వివాదం
2016లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ఎస్, 7 సిరీస్‌తో పాటు ఎస్‌ఈ మోడల్ ఫోన్‌లపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఐఫోన్ సిరీస్ మోడళ్లు స్లో అవ్వడంతో వాటిని ఆపరేట్ చేయలేపోతున్నామంటూ అమెరికాకు చెందిన సుమారు 33 రాష్ట్రాల యూజర్లు మూకుమ్మడిగా సంబంధిత రాష్ట్రాల కోర్టులను ఆశ్రయించారు.
యాపిల్ సంస్థ ధనార్జన కోసం కావాలనే తమ ఫోన్‌లలో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసిందని, తద్వారా మేం వినియోగించే ఫోన్‌లు పనిచేయడం మందగిస్తే.. కొత్త ఫోన్‌లు కొనుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలా కొనుగోలు చేస్తే ఐఫోన్‌ల అమ్మకాలు జరిగి.. యాపిల్ సంస్థకు లబ్ధి చేకూరుతుందని ఆరోపించారు.
యాపిల్ అనాలోచిత నిర్ణయం వల్లే
వినియోగదారుల హక్కుల కోసం పోరాడే జస్టిన్ గుట్మాన్ సైతం యాపిల్‌కు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశారు. ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో పాటు పవర్ మేనేజ్మెంట్ టూల్ వల్ల ఐఫోన్‌లు అకస్మాత్తుగా షట్‌డౌన్ అవ్వడం, బ్యాటరీ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. యాపిల్ నిర్ణయంతో ఐఫోన్ 6, 6ప్లస్, 6 ఎస్, 6ఎస్ ప్లస్, ఎస్‌ఈ,7, 7 ప్లస్, 8, 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్‌ను వినియోగిస్తున్న యూకేలో 25 మిలియన్ల ఐఫోన్ యూజర్లకు నష్టం వాటిల్లిందని, ఆ మొత్తం విలువ 768 మిలియన్లని కోర్టుకు ఆధారాల్ని అందించారు.
తెరపైకి బ్యాటరీగేట్ వివాదం
ఈ వివాదాన్ని మరింత ఉదృతం చేసేలా.. యాపిల్ కంపెనీ ఐఫోన్‌లను ఉద్దేశపూర్వకంగా ప్రాసెసర్ పనితీరు మందగించేలా వ్యవహరించిందని తెలిపేలా ‘బ్యాటరీగేట్’ అనేపదాన్ని అనే పదాన్ని రూపొందించారు. ‘బ్యాటరీగేట్’ పేరును ట్రెండింగ్‌లోకి తెచ్చారు.
బాధిత యూజర్లకు 92 డాలర్ల నష్టపరిహారం
ఈ వివాదం చిలిచిలికి గాలివానలా మారింది. వినియోగదారుల ఫిర్యాదు దెబ్బకు యాపిల్ దిగొచ్చింది. 2020లో బాధిత యూజర్లకు 500 మిలియన్ల నష్టపరిహారం చెల్లిస్తామని అంగీకరించింది. ఒప్పందం ప్రకారం.. యాపిల్ ఇటీవల ప్రతి ఒక్క బాధిత యూజర్‌కు 92 డాలర్ల వరకు నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment