
న్యూఢిల్లీ: గత నెల రోజుల వ్యవధిలో ఆర్చీస్, హ్యామ్‌లీస్, డబ్ల్యూహెచ్ స్మిత్ వంటి రిటైల్ స్టోర్స్ నుంచి 18,600 ఆటబొమ్మలను అధికారులు సీజ్ చేశారు. భారతీయ నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన బీఐఎస్ మార్కు లేకపోవడం, నకిలీ లైసెన్సులతో తయారు చేయడం తదితర అంశాలు ఇందుకు కారణం. బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ శుక్రవారం ఈ విషయాలు తెలిపారు.
బీఐఎస్ ప్రమాణాలకు తగ్గట్లుగా లేని బొమ్మల విక్రయం జరుగుతోందంటూ దేశీ తయారీదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో దేశవ్యాప్తంగా గత నెలలో పెద్ద విమానాశ్రయాలు, మాల్స్‌లోని బడా రిటైలర్స్ స్టోర్స్‌లో 44 సోదాలు నిర్వహించినట్లు ఆయన వివరించారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై తదితర విమానాశ్రాయాల్లో వేల కొద్దీ బొమ్మలను సీజ్ చేసినట్లు తెలిపారు. బీఐఎస్ చట్టం కింద నిబంధనల ఉల్లంఘనకు గాను రూ. 1 లక్ష జరిమానా మొదలుకుని జైలు శిక్ష వరకూ నేరం తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయి.