న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల వాహనాలను ప్రోత్సహించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖల్లో వినియోగిస్తున్న వాహనాలు 15 ఏళ్లకు మించి పాతబడిన పక్షంలో రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్ చేయరాదని భావిస్తోంది. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ ఈ మేరకు ఒక ప్రతిపాదన రూపొందించింది. 2022 ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ శాఖలు పదిహేనేళ్లు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్‌ను రెన్యూ చేసుకోవడానికి ఉండదంటూ ఒక ట్వీట్‌లో పేర్కొంది. కొత్త నిబంధనల ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ, సంబంధిత వర్గాలు 30 రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది.
కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మునిసిపల్, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలు మొదలైన వాటిల్లో ఉపయోగిస్తున్న వాహనాలకు ప్రతిపాదిత నిబంధనలను ప్రభుత్వం వర్తింప చేయనుంది. 20 ఏళ్లు పాతబడిన వ్యక్తిగత వాహనాలకు, 15 ఏళ్లు పైబడిన వాణిజ్య వాహనాలకు ఫిట్‌నెస్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుందంటూ 2021–22 బడ్జెట్‌లో కేంద్రం స్వచ్ఛంద స్క్రాపేజీ (తుక్కు) పాలసీని ప్రకటించిన నేపథ్యంలో తాజా ముసాయిదా నోటిఫికేషన్ ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment