న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ టెక్నాలజీని 5–7 నెలల్లో 5జీకి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న 1.35 లక్షల టెలికం టవర్ల ద్వారా ఈ సర్వీసులు అందుబాటులోకి రాగలవని పేర్కొన్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు.
ఇతర టెలికం సంస్థలు ఇంకా పూర్తిగా కవర్ చేయని అనేక గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీఎస్‌ఎన్‌ఎల్ సర్వీసులు ఉన్నాయని మంత్రి చెప్పారు. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న టెల్కోలకు గట్టి పోటీనివ్వడంతో పాటు మారుమూల ప్రాంతాల్లో టెలికం సేవలకు బీఎస్‌ఎన్‌ఎల్ కీలకంగా మారగలదని ఆయన పేర్కొన్నారు. స్వదేశీ ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా టెలికం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్‌ను ఏటా రూ. 500 కోట్ల నుంచి రూ. 4,000 కోట్లకు పెంచే యోచన ఉన్నట్లు ఆయన వివరించారు.
నవకల్పనలు, అంకుర సంస్థల వ్యవస్థను ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వేస్, రక్షణ శాఖ తగు తోడ్పాటు అందిస్తున్నాయని వైష్ణవ్ చెప్పారు. రైల్వేస్ ఇప్పటికే 800 స్టార్టప్‌లతో, రక్షణ శాఖ 2,000 పైచిలుకు స్టార్టప్స్‌తో కలిసి పని చేస్తున్నాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment