దేశమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 2024-25 కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టన్నారు. ఈ బడ్జెట్‌పై దేశంలోని అన్ని వర్గాలవారు వివిధ ప్రయోజనాలు ఆశిస్తున్నారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు ఈసారి ఏవైనా పన్ను ప్రయోజనాలు ఉంటాయా అని ఆసక్తిగా ఉన్నారు.
ఈసారి ప్రవేశపెట్టేది సమగ్ర బడ్జెట్ కాకపోయినా కొన్ని సానుకూల మార్పులపై పన్ను చెల్లింపుదారులలో ఆశలు ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ప్రధాన పన్ను ప్రయోజనాలు ఉంటాయని ట్యాక్స్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అయినప్పటికీ ఈ మధ్యంతర బడ్జెట్‌లో పన్ను చెల్లింపు ఊరటనిచ్చే కొన్ని చిన్న సర్దుబాట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అవి ఏవేవీ అన్నది ఇక్కడ చూద్దాం..
బెంగళూరుకు హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు
చట్ట ప్రకారం మెట్రో నగరంగా బెంగళూరును గుర్తించినప్పటికీ, ఆదాయపు పన్ను విషయాల పరంగా బెంగళూరును ఇప్పటికీ నాన్-మెట్రో సిటీగా పరిగణిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో బెంగళూరును మెట్రో నగరంగా వర్గీకరించి హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు పరిమితిని 40 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని నిపుణులు ప్రతిపాదించారు.
సెక్షన్ 80D మినహాయింపు పరిమితి
పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంల కోసం సెక్షన్ 80D కింద మినహాయింపు పరిమితిని పెంచే అవకాశం ఉంది. ఇది సాధారణ ప్రజలకు రూ.25,000 నుంచి రూ.50,000కు, సీనియర్ సిటిజన్‌లకు రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచవచ్చని పన్ను నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు ఆరోగ్య సంరక్షణ సేవలకు పన్ను తగ్గింపులను సులభతరం చేయడానికి కొత్త పన్ను విధానంలోకి సెక్షన్ 80D ప్రయోజనాలను తీసుకొస్తారన్న ఊహాగానాలు ఉన్నాయి.
గృహ కొనుగోలుదారులకు టీడీఎస్ పరిమితి
ప్రస్తుతం ఆస్తి కొనుగోళ్లపై టీడీఎస్ మినహాయింపు పరిమితి రూ. 50 లక్షలు ఉంది. ఈ పరిమితిని మించితే 1 శాతం టీడీఎస్ ఉంది. ఆస్తి కొనుగోళ్లపై టీడీఎస్ మినహాయింపులకు సంబంధించి ఈ మధ్యంతర బడ్జెట్ ఆస్తులు విక్రయించే ఎన్‌ఆర్‌ఐలకు మరింత పారదర్శకత, అవగాహన తీసుకొస్తుందని భావిస్తున్నారు.
మూలధన లాభాలపై పన్ను సరళీకరణ
పెట్టుబడి ఆదాయానికి సంబంధించి ప్రస్తుత పన్ను వ్యవస్థలో ఉన్న సంక్లిష్టతను ఎత్తి చూపుతూ ట్యాక్స్ నిపుణులు కొన్ని సూచనలు చేశారు. ఇండెక్సేషన్‌కు సంబంధించిన నియమాలను సరళీకృతం చేయడం, లిస్టెడ్, అన్‌లిస్టెడ్ సెక్యూరిటీల పన్నులో సమానత్వాన్ని తీసుకురావడం వంటివి ఈ సూచనల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment