కేంద్ర ప్రభుత్వం ఆదాయ వనరులు పెంచుకొనేందుకు ప్రత్యక్ష, పరోక్ష పన్నులపై ఆధారపడుతోంది. దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. రాబడిలో వృద్ధి ఆశాజనకంగా ఉంది. సగటున నెలకు సుమారు రూ.1.5 లక్షల కోట్లకుపైనే ఖజానాకు జమ అవుతోంది. ప్రపంచమంతా అధిక ద్రవ్యోల్బణం, అనిశ్చితి భయాలు కొనసాగుతున్న తరుణంలో భారత్ వంటి పెద్ద దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో పన్నువసూళ్లు ఆసక్తిగా మారాయి.
పరోక్ష పన్నులతోపాటు నేరుగా ప్రజల సంపాదనపై వేసే ప్రత్యక్ష పన్ను వసూళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24) ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 19.41 శాతం వృద్ధి నమోదైందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.14.70 లక్షల కోట్ల పన్ను వసూళ్లు జరిగాయని తెలిపింది. జనవరి 10 నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు స్థిరమైన వృద్ధిరేటు కొనసాగిస్తున్నాయని సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2023-24 బడ్జెట్ అంచనాల్లో 80.61 శాతం వృద్ధి చెందినట్లు కేంద్రం పేర్కొంది.
ప్రత్యక్ష పన్ను వసూళ్లు (వ్యక్తిగత ఆదాయం పన్ను, కార్పొరేట్ టాక్స్) రూపేణా రూ.18.23 లక్షలు వసూలు చేయాలని బడ్జెట్ అంచనాల్లో గతేడాది ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇది 2022-23 సంవత్సరం రూ.16.61 లక్షల కోట్లతో పోలిస్తే 9.75 శాతం ఎక్కువ. ఇక గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2024 జనవరి 10 వరకు ఐటీ రీఫండ్స్ రూ.2.48 లక్షల కోట్లుగా ఉండనున్నాయి.
ఇదీ చదవండి: సినిమా చూపిస్తూ కోట్లు సంపాదన!
స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.17.18 లక్షలకోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 16.77 శాతం ఎక్కువ. స్థూల కార్పొరేట్ టాక్స్ (సీఐటీ) వసూళ్లు 8.32 శాతం, వ్యక్తిగత పన్ను ఆదాయం (పీఐటీ) వసూళ్లు 26.11 శాతం పెరిగాయి. రీఫండ్స్ సర్దుబాటు తర్వాత సీఐటీ వసూళ్లలో నికర వృద్ధిరేటు 12.37 శాతం, పీఐటీ వసూళ్లలో 27.26 శాతంగా నమోదైనట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment