న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం చర్యలు ప్రతిపాదించింది. వీటి ప్రకారం ఇకపై ప్రభుత్వ ఏజెన్సీల పరిధిలోని వివిధ డిజిటల్ వ్యవస్థలతో లావాదేవీల్లో వ్యాపార సంస్థలు తమ గుర్తింపు ధ్రువీకరణ కోసం పర్మనెంట్ అకౌంటు నంబరు (పాన్) కార్డు ఒక్కటే సమర్పించినా సరిపోనుంది. ప్రస్తుతం వ్యాపారాలకి అనుమతులు తీసుకునేందుకు జీఎస్‌టీఎన్, టిన్, ఈఎస్‌ఐసీ వంటి రకరకాల ఐడీలు అవసరమవుతున్నాయి. దేశీయంగా వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు ఇది తోడ్పడగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మరోవైపు, వాణిజ్య వివాదాల పరిష్కారం కోసం వివాద్ సే విశ్వాస్–2 (వీఎస్‌వీ–2) స్కీమును ప్రవేశపెడుతున్నట్లు ఆమె తెలిపారు. అసెస్‌మెంటుకు సంబంధించి పన్నులు, వడ్డీలు, జరిమానాలు వంటి అంశాల్లో వివాదాల పరిష్కారానికి ఇది ఉపయోగపడనుంది.
పన్ను వివాదాల తగ్గింపుపై దృష్టి ..
పన్నుపరమైన వివాదాలను తగ్గించేందుకు కూడా ఆర్థిక మంత్రి ప్రతిపాదనలు చేశారు. ఒకే తరహా లీగల్ వివాదాలపై అప్పీళ్లు చేసేందుకు బోలెడంత సమయం, వనరులు వృధా అవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిర్దిష్ట చట్టాన్ని సవాలు చేసే కేసు ఏదైనా న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంటే.. ఐటీ శాఖ మళ్లీ అదే తరహా కేసు మరొకటి దాఖలు చేయకుండా వాయిదా వేసేలా కేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉండాలని ఆమె ప్రతిపాదించారు.
రీక్లెయిమింగ్ సులభతరానికి ఐఈపీఎఫ్
షేర్లు, డివిడెండ్ల రీక్లెయిమింగ్ ప్రక్రియను సులభతరం చేసేందుకు సమీకృత ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్, ప్రొటెక్షన్ ఫండ్ (ఐఈపీఎఫ్)ను ఏర్పాటు చేయనున్నట్లు సీతారామన్ చెప్పారు. ఇక, ఫీల్డ్ ఆఫీసుల్లో దాఖలయ్యే వివిధ రకాల ఫారంలను కేంద్రీకృతంగా హ్యాండిల్ చేసేందుకు కంపెనీల చట్టం కింద సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తద్వారా కార్పొరేట్లకు మరింత వేగవంతంగా సమాచారం/స్పందన లభించగలదని ఆమె పేర్కొన్నారు.
కేవైసీ.. ఈజీ..
కస్టమర్ల వివరాల సేకరణకు సంబంధించిన నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రక్రియను సరళతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా అందరికీ ఒకే తరహా ప్రక్రియ పాటించడం కాకుండా ’రిస్క్ ఆధారిత’ విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, నియంత్రణ సంస్థలు, నియంత్రిత సంస్థల దగ్గర ఉండే వ్యక్తుల గుర్తింపు, చిరునామాలను ఒకే చోట అప్‌డేట్ చేసేలా నిర్దిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆమె ప్రతిపాదించారు. ఇందుకోసం డిజిలాకర్ సర్వీసును, ఆధార్‌ను ఉపయోగించనున్నారు. అలాగే, ఒకే సమాచారాన్ని వివిధ ప్రభుత్వ ఏజెన్సీలకు వేర్వేరుగా సమర్పించాల్సిన అగత్యం తప్పించేలా ఏకీకృత ఫైలింగ్ ప్రక్రియ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి ప్రతిపాదించారు.
చదవండి: సరైన సమయం కాదు.. అందుకే రూ. 20,000 కోట్ల ఎఫ్‌పీవోను వెనక్కి ఇస్తున్నాం: అదానీ గ్రూప్
Comments
Please login to add a commentAdd a comment