న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్, నిధుల సేకరణ పేరుతో మరికొన్ని ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేస్తోంది కేంద్రం. పెట్టుబడుల ఉపసంహారణకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించే బాధ్యతలను బాధ్యతలను నీతి ఆయోగ్‌కి అప్పగించింది. ఈ ప్రక్రియలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు ప్రైవేటీకరణకు రంగం సిద్ధమైంది.
వేగవంతమైన ప్రక్రియ
పెట్టుబడుల ఉపసంహారణకు అత్యున్నత స్థాయి కమిటీ (సీజీఎస్) నీతి అయోగ్ నియమించింది. ఇందులో ఆర్థిక వ్యవహారాల విభాగం, రెవెన్యూ, కార్పొరేట్ వ్యవహారాలు, లీగల్ వ్యవహారాలు తదితర విభాగాల కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. నీతి ఆయోగ్, సీజీఎస్‌లు ప్రైవేటీకరణకు సూచించిన లిస్టులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి ఉన్నాయి. ఇందులో సెంట్రల్ బ్యాంకు, ఐవోబీలలో పెట్టుబడులు ఉపసంహరణకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని క్యాబినెట్ ఈ ప్రతిపాదనలకు తుది ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. క్యాబినెట్ ఆమోదం తర్వాత ప్రైవేటీకరించేందుకు నిబంధనల్లో తగు మార్పులు, చేర్పులు చేపడతారు. అటు రిజర్వ్ బ్యాంక్ కూడా పీఎస్‌బీల ప్రైవేటీకరణపై కేంద్రంతో చర్చలు జరుపుతోంది.
వ్యతిరేకిస్తున్న యూనియన్లు
బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు ప్రైవేటీకరణ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో.. మార్చిలో రెండు రోజుల పాటు సమ్మెకు దిగాయి. పెద్ద నోట్ల రద్దు, జన ధన యోజన, ముద్ర యోజన వంటి ప్రభుత్వ స్కీముల విజయవంతంలో ప్రభుత్వ బ్యాంకులు ఎంతో కీలకపాత్ర పోషించాయని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు చెబుతున్నాయి.
డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగం..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా సుమారు రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ. 2.10 లక్షల కోట్ల కన్నా ఇది తక్కువ. బ్యాంకుల ప్రైవేటీకరణతో పాటు ఎల్‌ఐసీ సారథ్యంలో ఉన్న ఐడీబీఐ బ్యాంకు నుంచి కూడా కేంద్రం తప్పుకోనుంది. బ్యాంకులో వ్యూహాత్మకంగా పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ గత నెలలో సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. ఐడీబీఐ బ్యాంకులో కేంద్రం, ఎల్‌ఐసీకి 94% వాటా ఉంది. ప్రస్తుతం ప్రమోటరయిన ఎల్‌ఐసీకి ఐడీబీఐ బ్యాంకులో 49.21 శాతం వాటా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment