
కేంద్ర ప్రభుత్వం త్వరలో బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న వారానికి ఐదు రోజుల పని దినాలను అమలు చేసేలా కేంద్ర ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వలు వెలువరించనున్నట్లు జాతీయ మీడియా సంస్థలు కథనాల్ని వెలువరించాయి.
కేంద్ర ఆర్ధిక శాఖ అమలు చేస్తున్న ఐదు రోజుల పనిదినాల్ని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ( ఐబీఏ), యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ (యూఎఫ్‌బీఈఎస్) అంగీకరించినట్లు సమాచారం. అయితే అందుకు బదులుగా ఉద్యోగులు రోజుకు 40 నిమిషాల పాటు అదనంగా పనిచేయాల్సి ఉంటుంది.
అదనంగా పనిచేసేందుకు సైతం బ్యాంక్ యూనియన్లు అంగీకరించాయి. దీంతో ఐబీఏ అంగీకరించిన ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపించింది. ఈ మేరకు వేజ్ బోర్డు సవరణలు చేసి కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే.. బ్యాంకు ఉద్యోగులు ఇకపై ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేయాల్సి వస్తుందని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
చదవండి👉 గూగుల్ సరికొత్త సంచలనం.. లాగిన్ అవ్వాలంటే పాస్‌వర్డ్ అవసరం లేదు!