ఇప్పుడు ప్రపంచమంతటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభంజనమే. అందరూ చాట్‌బాట్ గురించే చర్చించుకుంటున్నారు. చాట్‌జీపీటీ వంటి చాట్‌బాట్‌లతో మాట్లాడేందుకు ప్రముఖులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏఐ ఆధారిత ప్లాట్‌ఫారమ్ నుంచి పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సాంకేతికత, ఆవిష్కరణలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై తమ అంతరార్థాలను ఆవిష్కరించారు.
వీరిని ఇంటర్వ్వూ చేసేందుకు ఈ చాట్‌బాట్ అధునాతన నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అల్గారిథమ్‌లను ఉపయోగించింది. గతంలో వారిద్దరు చేసిన ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, పబ్లిక్ స్టేట్‌మెంట్‌ల నుంచి ప్రశ్నలను రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికత అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా చెబుతున్నారు. ఎందుకంటే ఇది వారితో సమాధానాలు రాబట్టేందుకు చాలా తెలివిగా ప్రశ్నలు సంధించింది. 10 డౌనింగ్ స్ట్రీట్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో ఈ ఇంటర్వ్వూ వీడియోను పోస్ట్ చేశారు.
రాబోయే పదేళ్లలో గ్లోబల్ ఎకానమీ, జాబ్ మార్కెట్‌పై సాంకేతికత ఎలా ప్రభావం చూపుతుందని మీరు భావిస్తున్నారు?.. అంటూ ఇంటర్వ్వూను ప్రారంభించిన చాట్‌బాట్.. ఇద్దరినీ ఆలోచనలను రేకెత్తించే పలు ప్రశ్నలను సంధించింది. దీనికి బిల్‌గేట్స్ స్పందిస్తూ.. కార్మిక కొరత, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి అంశాల్లో ప్రపంచం మరింత పురోగతి చెందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రశ్న అడిగిన చాట్‌బాట్‌ను అభినందిస్తూ తాము మరింత సమర్థవంతంగా పనిచేయడంలో ఏఐ సహాయపడుతుందన్నారు.
చాట్‌బాట్ తర్వాతి ప్రశ్న.. ‘మీరు ఇప్పటివరకు స్వీకరించిన అతి ముఖ్యమైన సలహా ఏమిటి, అది మీ వృత్తిని, జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది’.. దీనిపై బిల్స్‌గేట్, రిషిసునాక్ ఇద్దరూ సమాధానమిచ్చారు. తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి అందిన సహకారాన్ని, సలహాలను పంచుకున్నారు.
మీ విధులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయాల్సివస్తే దేన్ని చేయాలని మీరు కోరుకుంటారు అని అడిప్రశ్నకు గేట్స్ సమాధానమిస్తూ.. తాను నోట్స్ తయారు చేసే క్రమంలో డ్రాయింగ్‌లు, పద్యాలను జోడించడానికి ఏఐ సహాయం తీసుకుంటానన్నారు. ప్రధాని ప్రశ్నోత్తరాల సమయంలో తన తరఫున ఏఐ పాల్గొనడాన్నిఇష్టపడతానని రిషి సునాక్ చెప్పారు.
బ్రెగ్జిట్ అనంతరం యూకే ఆర్థిక పరిస్థతి, వృద్ధి, ఆవిష్కరణల కోసం కొత్త అవకాశాలను సృష్టించడానికి సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చనే దాని గురించి రిషి సునాక్‌ను చాట్‌బాట్ ప్రశ్నించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి కొత్త సాంకేతికతలలో పెట్టుబడులు, ఇన్వెస్టర్లు, చిన్న వ్యాపారారులకు మద్దతిచ్చే వ్యవస్థను సృష్టించడం వంటివాటి ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. కోవిడ్ అనంతర ప్రపంచం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, క్లిష్ట సమయాల్లో ఒకరికొకరు ఎలా తోడుగా నిలివాలి వంటి అంశాలను కూడా ఆయన స్పృశించారు.
సమాజంలో ఏఐ పాత్ర, వాతావరణ మార్పు, ప్రపంచ ఆరోగ్యం వంటి అత్యంత ముఖ్యమైన సవాళ్లను పరిష్కరించడానికి దీన్ని ఎలా ఉపయోగించవచ్చనే దాని గురించి బిల్ గేట్స్‌ను అడగ్గా నైతికంగా, పారదర్శకంగా, జవాబుదారీగా ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. దీని ప్రయోజనాలు ప్రజలందరికీ అందేలా ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు, పౌర సమాజం మధ్య సహకారం కావాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment