ముంబై: ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలతో స్టాక్ సూచీలు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. చైనా అతిపెద్ద రియల్టీ సంస్థ ఎవర్‌గ్రాండే డిఫాల్ట్ వార్తలతో పాటు అంతర్జాతీయంగా కమోడిటీ ధరల క్షీణత, యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ సమావేశానికి ముందు (మంగళవారం) ఇన్వెస్టర్ల అప్రమత్తత అంశాలు మన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి అనూహ్య పతనమూ ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో సెన్సెక్స్ 525 పాయింట్లు పతనమైన 58,491 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 188 పాయింట్లు క్షీణించి 17,397 వద్ద నిలిచింది. సూచీలకిది రెండోరోజూ నష్టాల ముగింపుతో పాటు గడిచిన రెండు నెలల్లో ఒకరోజులో అతిపెద్ద పతనం ఇదే కావడం గమనార్హం. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో ఏడు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఒక్క ఎఫ్‌ఎంసీజీ తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. మెటల్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో బీఎస్‌ఈ స్మాల్, మిడ్‌క్యాప్ ఇండెక్సులు రెండుశాతం నష్టాన్ని చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ.93 కోట్ల షేర్ల కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,627 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
ఇంట్రాడేలో 626 పాయింట్లు క్రాష్
ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 381 పాయింట్లు క్షీణించి 58,635 వద్ద, నిఫ్టీ 144 పాయింట్లు పతనమై 17,444 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. భారీ నష్టాల నేపథ్యంలో తొలుత షార్ట్ కవరింగ్ జరగడంతో సూచీలు కొంతవరకు నష్టాలను భర్తీ చేసుకున్నాయి. అయితే ఆసియా మార్కెట్లలో అమ్మకాలు ఆగకపోవడంతో పాటు యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభంతో సూచీలు మళ్లీ నష్టాల బాట పట్టాయి. మిడ్‌సెషన్ నుంచి అమ్మకాలు క్రమంగా పెరుగుతూ ట్రేడింగ్ ముగిసే వరకు కొనసాగాయి. ఒకదశలో సెన్సెక్స్ 626 పాయింట్లు పతనమై 58,390 వద్ద, నిఫ్టీ 223 పాయింట్లు నష్టపోయి 17, 362 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.
కరిగిపోయిన మెటల్ షేర్లు
అంతర్జాతీయ మార్కెట్లో్ల టన్ను ఐరన్ ఓర్ ధర 100 డాలర్ల దిగువకు చేరుకోవడంతో దేశీ మార్కెట్లో మెటల్, మైనింగ్ స్టాక్స్ కరిగిపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్ షేర్లకు ప్రాతినిధ్యం వహించి నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఏకంగా 7% నష్టపోయింది. ఈ సూచీలోని టాటా స్టీల్, జిందాల్ స్టీల్, నాల్కో, ఎన్‌ఎమ్‌డీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సెయిల్, హిందాల్కో, వేదాంత షేర్లు పదిశాతం నుంచి ఐదు శాతం క్షీణించాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఏపీఎల్ అపోలో, హిందుస్తాన్ జింక్, మెయిల్, కోల్ ఇండియా షేర్లు 4–2% పతనమయ్యాయి.
ప్రపంచ మార్కెట్లకు చైనా ఫీవర్!
చైనా మార్కెట్ నియంత్రణ సంస్థ కఠిన నిబంధనలతో ఆ దేశపు రెండో అతిపెద్ద రియల్ ఎస్టేట్ గ్రూప్ ఎవర్‌గ్రాండే ఈ బుధవారం 83.5 మిలియన్ డాలర్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమవ్వొచ్చనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ డిఫాల్ట్ ప్రభావంతో గృహ నిర్మాణ రంగం మందగమనంలో కూరుకుపోయి ప్రపంచవ్యాప్తంగా మెటల్ షేర్లకు డిమాండ్ తగ్గవచ్చనే ఆందోళనలు అధికమయ్యాయి. హాంకాంగ్ స్టాక్ మార్కెట్‌లో లిస్టైన ఎవర్‌గ్రాండే షేరు 19 శాతం క్షీణించి పదేళ్ల కనిష్టానికి దిగిరావడంతో హాంకాంగ్ స్టాక్ సూచీ 3% నష్టపోయింది. సింగపూర్, ఇండోనేసియా దేశాల స్టాక్ సూచీలు 2–1% నష్టపోయాయి. కాగా చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాల మార్కెట్లు పనిచేయలేదు. ఆసియా మార్కెట్లలోని ప్రతికూలతలతో పాటు అమెరికా సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం (మంగళవారం) నేపథ్యంలో అప్రమత్తతతో యూరప్‌లోని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు 2–3% నష్టపోయాయి. యూఎస్ ఫ్యూచర్లు 2% నష్టాలతో కదలాడుతున్నాయి.
రూ. 5.31 లక్షల కోట్లు ఆవిరి
సూచీల 2రోజుల పతనంతో 5.31 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్లు సోమవారం ఒక్కరోజే రూ.3.49 లక్షల కోట్ల సంపదను కోల్పోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మార్కెట్ విలువ రూ.255 లక్షల కోట్లకు దిగివచ్చింది.
మార్కెట్లో మరిన్ని సంగతులు
►నష్టాల మార్కెట్లో ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఎదురీదాయి. హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్), మారికో, ఐటీసీ, నెస్లే, బ్రిటానియా షేర్లు 3% నుంచి 0.5% లాభపడ్డాయి. ఐటీసీ షేరు ఇంట్రాడేలో మూడున్నర శాతం ఎగసి రూ.239 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. చివరికి 1.5% లాభంతో రూ.237 వద్ద ముగిసింది.
►వ్యాపార కార్యకలాపాలు ఊపందుకోవడం హోటల్ రంగ షేర్లకు కలిసొచ్చింది. ఇండియా హోటల్స్ షేరు 8 శాతం ర్యాలీ చేసి ఏడాది గరిష్టాన్ని తాకింది.
►అదానీ గ్రూప్ ఎన్డీటీవీని టేకోవర్ చేస్తుందన్న వార్తలతో ఎన్‌డీటీవీ షేరు పదిశాతం పెరిగి రూ.80 వద్ద ముగిసింది.
►వరుస లాభాలతో దూసుకెళ్తున్న ఐఆర్‌సీటీసీ షేరు బ్రేక్ పడింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఈ షేరు నాలుగు శాతం నష్టపోయి రూ.3,720 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment