భారతీయులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. పండగ సమయాల్లో షాపులు కళకళలాడుతాయన్న సంగతి తెలిసిందే. అందుకే కంపెనీలు బ్యాంకులు, వ్యాపారులు తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ప్రత్యేకంగా దివాళి సందర్భంగా కొందరు వారి స్నేహితులకు, బంధువులకు బహుమతులను కూడా ఇస్తుంటారు. అయితే ఈ గిఫ్టింగ్ సీజన్‌లో ఇదే అదునుగా కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఉచితంగా దీపావళి బహుమతుల పేరుతో మీ బ్యాంక్ ఖాతాని ఖాళీ చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ మెసేజ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హెచ్చరిస్తోంది.
వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో దీపావళి బహామతుల పేరుతో అనధికారికంగా మెసేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి. ఫెస్టివల్ ఆఫర్స్, గిఫ్ట్స్, బహుమతుల పేరుతో మెసేజ్ లింక్స్‌ను పంపిస్తున్నారని తెలపింది. ఆ లింక్స్ క్లిక్ చేస్తే యూజర్ల వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చిరించింది. ఒక వేళ వాటిని క్లిక్ చేస్తే చైనాకు చెందిన వెబ్‌సైట్‌లకు లింక్ అయ్యే అవకాశం ఉందని, అవి .xyz, .top డొమైన్లతో ఈ వెబ్‌సైట్స్ ఉన్నట్లు CERT-In గుర్తించింది.
ఈ రకంగా మోసం
అయితే బహుమతులను పొందేందుకు అమాయకంగా ప్రజలు వాటికి ఆకర్షితులవుతారు. వినియోగదారు లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, అతనికి బహుమతి గెలుచుకున్నట్లు అభినందనలు సందేశం వస్తుంది. ఆపై వారి వ్యక్తిగత వివరాలను నింపాల్సి ఉంటుంది. అలా నింపిన తర్వాత, బహుమతిని క్లెయిమ్ కోసం ఆ లింక్ ఉన్న మెసేజ్లను వారి స్నేహితులు, బంధువులతో పంచుకోవాలని అప్పుడే గిఫ్ట్ పొందగలరని చూపిస్తుంది. ఈ కార్యక్రమం పూర్తయ్యాక యూజర్ల వ్యక్తిగత డేటా మొత్తం సైబర్ దాడి గురయ్యే అవకాశం ఉంది.
ఆన్‌లైన్ స్కామ్‌ను ఎలా నివారించాలి
ఈ తరహా స్కామ్‌లను నివారించేందుకు, బహామతులు, రుణాల పేరుతో అనధికారికంగా వచ్చే లింక్‌ల పట్ల జాగ్రత్తగా వహించాలి. మెసేజ్ మన మొబైల్ లోకి రాగానే ఆ లింక్ మూలాన్ని తనిఖీ చేయడం మంచిది. డొమైన్ పేరు కూడా సరిచూసుకోవడం ఉత్తమం. ఏ మాత్రం మెసేజ్ పై సందేహం ఉన్నా మీరు దానిపై క్లిక్ చేయడం మానుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా పర్సనల్ డేటాను బహిర్గతం చేయకూడదు.
Comments
Please login to add a commentAdd a comment